భారత్-జర్మనీ దేశాల మధ్య ఐదు ఒప్పందాలపై సంతకాలు

 

జర్మనీ ఛాన్సిలర్ ఎంజల్ మెర్కెల్ మూడు రోజుల భారత్ పర్యటనలో భాగంగా ఈరోజు బెంగుళూరులో పర్యటించారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఎంజల్ మెర్కెల్ సమక్షంలో ఇండో-జర్మన్ సమ్మిట్ లో ఇరుదేశాలకు చెందిన వివిధ సంస్థల మధ్య ఈరోజు ఐదు ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయి.

 

వాటిలో మొదటగా గుజరాత్ ఇంటర్ నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ-సీమెన్స్ సంస్థల మధ్య ఒక ఒప్పందం పత్రాలపై ఆ సంస్థల ప్రతినిధులు సంతకాలు చేసారు. ఈ ఒప్పందంలో భాగంగా సీమెన్స్ సంస్థ నగరాలలో మొబైల్ సేవలకు అవసరమయిన సాంకేతిక పరిజ్ఞానం అందిస్తుంది.

 

రెండవ ఒప్పందం టాటా పవర్ మరియు రోడే అండ్ ష్వార్జ్ సంస్థల మధ్య జరిగింది. సాఫ్ట్ వేర్ ఆధారిత రేడియో (యస్.డి.ఆర్.) రంగంలో ఆ రెండు సంస్థలు కలిసి పనిచేస్తాయి.

 

మూడవ ఒప్పందం ఓ.పి.జి. పవర్ వెంచర్స్ మరియు ఐ.బి.సి. సోలార్ మధ్య సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం ఒప్పందం జరిగింది. వాటి కోసం ఆ రెండు సంస్థలు కలిసి మూడు స్పెషల్ పర్పస్ కంపెనీలను ఏర్పాటు చేసుకొంటాయి.

 

నాలుగవ ఒప్పందం నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ మరియు ఇంఫీనియన్ కార్పోరేషన్ మధ్య జరిగింది. ఎలక్ట్రికల్ సెమీ కండక్టర్స్ సంస్థల ఏర్పాటుకి ఇంఫీనియన్ కార్పోరేషన్ సహకరిస్తుంది.

 

ఐదవ ఒప్పందం హెచ్.ఎం.టి. మరియు ఫ్రావున్ హోఫర్ సమస్థల మధ్య జరిగింది. జర్మనీకి చెందిన అ సంస్థ హెచ్.ఎం.టి.కి భారీ యంత్రాలు నిర్మాణానికి సహకరిస్తుంది.