భారత్-ఆస్ట్రేలియా కీలక మ్యాచ్ నేడే
posted on Mar 26, 2015 7:34AM
.jpg)
భారత్, ఆస్ట్రేలియాలకు అత్యంత కీలకమయిన సెమీస్ మ్యాచ్ మరి కొద్దిసేపటిలో సిడ్నీలో మొదలవబోతోంది. అసలే అది ఆస్ట్రేలియా టీమ్..అరివీర భయంకరమయిన పోరాటపటిమ ప్రదర్శించే టీమ్. అందునా దాని స్వంత గడ్డ మీద డ్డీకొని ఓడించడం ఎంత కష్టమో క్రికెట్ అభిమానులందదరికీ తెలుసు. అయినా ఇంతవరకు ఆడిన అన్ని మ్యాచ్ లలో అద్భుతమయిన ప్రతిభ కనబరుస్తూ అజేయంగా దూసుకుపోతున్న భారత్ టీమ్, ఆస్ట్రేలియాను తప్పకుండా ఓడిస్తుందని అందరూ దృడంగా విశ్వసిస్తున్నారు. అందుకు కారణం ఇప్పుడు భారత్ టీమ్ లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లపై పట్టు సాధించి పూర్తి ఆత్మవిశ్వాసం కనబరుస్తుండటమే.
ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఇరువురూ కూడా ఇంతవరకు జరిగిన మ్యాచ్ లలో తమ సత్తా చాటి చూపారు. ఇక కెప్టెన్ ధోనీ, కోహ్లీ, రైనా, రహానే నలుగురు కూడా ఎంతటి బౌలర్లకైన కొరకరాని కొయ్యల్లా తయారయ్యారు. ఇంతకు ముందు ఒకరో ఇద్దరో బౌలర్ల మీదనే ఆధారపడి భారత్ టీమ్ ఎలాగో గండం గట్టెక్కేప్రయత్నం చేసేది. కానీ ఈసారి భారత్ టీమ్ లో ఏకంగా నలుగురు బౌలర్లు మహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, అశ్విన్ తమ సత్తా చాటి చూపుతున్నారు. ఈసారి భారత్ టీమ్ ఫీల్డింగ్ పై కూడా పూర్తి నియంత్రణ సాధించినట్లు కనబడుతోంది. కనుక భారత్ టీమ్ ఒత్తిడికి లోనవకుండా శ్రద్దగా ఆడితే ఆస్ట్రేలియాను ఓడించడం సాధ్యమే. మరికొద్దిసేపటిలో ఎలాగూ ఆట మొదలవబోతోంది కనుక తినబోతూ గారెల రుచి ఎలా ఉంటుందని ఆలోచించడం దేనికి?