పాకిస్తాన్ కి కాశ్మీర్ వాత.... బలూచిస్తాన్ కర్రుతో!

ఇండియాకి,పాకిస్తాన్ కి రెండు దేశాలకి కాశ్మీర్ పెద్ద సమస్యే! కాని, ఇండియాకి అనేక పెద్ద సమస్యల్లో కాశ్మీర్ ఒకటి! పాకిస్తాన్ కి అలా కాదు... కాశ్మీర్ సమస్య లేకుంటే ఆ దేశ భవిష్యత్తే గందరగోళంలో పడుతుంది! ఎందుకంటే, కాశ్మీర్ అనే బూచి చూపించి ఇండియాతో శత్రుత్వాన్ని సమర్థించుకుంటారు ఇస్లామ్ బాద్ పాలకులు. అదే సాకుతో పాక్ మిలటరీ కూడా జనాన్ని రెచ్చగొట్టి తన పట్టు నిలుపుకుంటుంది! ఒకవేళ రెండు దేశాల మధ్య కాశ్మీర్ సమస్యే లేకపోతే? అప్పడు అక్కడి పాలకులకి , మిలటరీకి, ఉగ్రవాదులకి అందరికీ సమస్యే! అందుకే, కాశ్మీర్ ని రాజేస్తూ వుంటారు పక్క దేశపు ముష్కరులు... 


ఇండియా, పాక్ విడిపడినప్పటి నుంచీ జమ్మూ కాశ్మీర్ పై ఎలాగోలా పట్టు కోసం ప్రయత్నిస్తోన్న పాకిస్తాన్ పదే పదే భంగపడుతూ వచ్చింది. యూడు యుద్దాల్లో కన్ను లొట్ట పోయి బయటపడింది. అయినా సరే తన తోక వంకరని సరి చేసుకోలేకపోతోంది. ఇప్పటికిప్పుడు ప్రత్యక్ష యుద్ధం వస్తే సరిగ్గా నాలుగు రోజులు కూడా పోరాడలేని ఆర్ధిక స్థితి ఆ దేశానిది! అయినా కాశ్మీర్ ను అడ్డం పెట్టుకుని అంతర్జాతీయంగా రభస చేస్తుంటుంది. పైగా దొంగ చాటు యుద్ధం బాగా అలవాటైపోయింది పాకిస్తానీ పాలకులు, ఐఎస్ఐ దొంగలకి! అందుకు తాజా ఉదాహరణ రెండు నెలలుగా కాశ్మీర్ అట్టుడికిపోవటమే. 


ఎవరో ఒక ఉగ్రవాది బుర్హాన్ వని ఎన్ కౌంటర్లో చచ్చిపోతే వేలాదిగా యువత రోడ్లపైకి వచ్చి రాళ్లు రువ్వింది. అంతే కాదు, ఎంత మంది ఆర్మీ కాల్పుల్లో నేలకూలినా ఆందోళనకారులు వెనక్కి తగ్గటం లేదు. ఇదంతా ఎందుకు? ఒక ఉగ్రవాది కోసం! ఇందులోనే అసలు కిటుకు వుంది. ఆందోళనకారులుగా చెలరేగిపోతున్న వారి వెనుక ఖచ్చితంగా పాక్ హస్తం వుంది. అది అందిస్తున్న డబ్బులతోనే ఈ కృత్రిమ పోరాటం నడుస్తోంది. అదే మోదీ అన్నారు స్వాతంత్ర్య దినోత్సవ ఉపన్యాసంలో! మోదీ కేవలం పాక్ ని కాశ్మీర్ విషయంలో తప్పు పట్టడమే కాకుండా బలూచిస్తాన్ విషయంలో ఉతికి ఆరేశారు. కాశ్మీర్ గురించి పాక్ మాట్లాడటం మానకపోతే తాము బలూచిస్తాన్ గురించి మాట్లాడతామని అగ్గి రాజేశారు. అప్పట్నుంచీ ఇస్లామాబాద్ లోని నవాజ్ షరీఫ్ కుర్చీ కింద సెగ రాజుకుంది! పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది!


బలూచిస్తాన్ లో పాక్ జెండాలు ఉద్యమకారులు కాళ్ల కింద. ఇండియా జెండాలు గాల్లో ఎగురుతూ కనిపిస్తున్నాయి! మోదీ ఫోటోలు అక్కడి స్వాతంత్ర్య పోరాట మోధుల చేతుల్లో ప్రత్యక్షమయ్యాయి! జర్మనీ లాంటి దేశాల్లోని ప్రవాస బలూచీ ప్రజలు ఇండియా జెండాలతో నిరసనలు తెలుపుతున్నారు! ఇదంతా పాక్ కి జ్వరం తెప్పిస్తోంది! మోదీ, తన చాణక్యుడు అజిత్ ధోవల్ తో కలిసి గట్టిగా ప్లాన్ చేస్తే పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ విడిపోవటం అసాద్యమేం కాదు. ఇంతకు ముందు ఇండియా వల్లే బంగ్లాదేశ్ ను వదులుకోవాల్సి వచ్చింది పాక్. ఇప్పుడు మళ్లీ చరిత్ర పునరావృతం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాని, బలూచిస్తాన్ విముక్తి అంత ఈజీ విషయం కూడా కాదు. కాని, పాక్ ను కాశ్మీర్ విషయంలో కట్టడి చేయటం కోసం బలూచిస్తాన్ కు సాయం చేయటం తప్పు కూడా కాదు! అసలు ఇంత కాలమే గత ప్రభుత్వాలు ఆ సాహసోపేతమైన వ్యూహం అమలు చేయాల్సింది! 


బలూచిస్తాన్ కు మోదీ మద్దతు చెవిలో పడ్డప్పటి నుంచీ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ వణికిపోతున్నాడు. తన చీఫ్ అడ్వైజర్ సర్ తాజ్ అజీజ్ ను పంపి కాశ్మీర్ విషయంలో తమకు హెల్ప్ చేయమని యూఎస్, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యాల్ని అడిగించాడు. కాని, ఎక్కడా ఇండియాకి వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ కూడా తెచ్చుకోలేకపోయారు! చైనా కూడా పాకిస్తాన్ ఆశించిన విధంగా స్పందిచలేదు! మోదీ దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ ని అమెరికా, జపాన్, వియత్నాంతో కలిసి ఒంటరిని చేయటమే ఇందుకు కారణం!


చేసేదేమి లేక ప్రగల్భాలకు దిగుతోంది పాకిస్తాన్. నవాజ్ షరిఫ్ తాను 22 మంది ఎంపీల్ని ఎన్నిక చేశాననీ, వాళ్లు అంతర్జాతీయ వేదికల్లో రెగ్యులర్ గా కాశ్మీర్ అంశం లేవనెత్తుతారనీ అన్నాడు. ఈ తాజా నిర్ణయంతో పాకిస్తాన్ అభద్రత మరింత స్పష్టమైంది! ఇస్లామ్ బాద్ నుంచి వచ్చిన చర్చల ఆఫర్ ని ఇండియా నిర్ద్వంద్వంగా తోసి పుచ్చింది. ముందు కాశ్మీర్లో హింస రాజేయకుండా వుంటే అప్పుడు చూద్దామంది! 


మోదీ అధికారంలోకి వచ్చాక సెగ తగులుతున్న వారిలో కాంగ్రెస్ నేతలు, వారి అనుచర మేధావులు, ఎన్జీవుల యజమానులు ముందు వరసలో వుంటారు! ఇక దేశానికి ఆవల మోదీ హీట్ పక్కగా తగులుతున్న వ్యక్తులు పాకిస్తాన్, చైనా ప్రధాని, ప్రెసిడెంట్లు!