కాషాయానికి... కషాయం తాగించిన పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ సభ... రెండు రోజులుగా మీడియాలో నానా హడావుడికి కారణమైన ఈ అంశం ఎట్టకేలకు ముగిసింది! ఇంతకీ పవన్ సభ ఏమైనట్టు? ఖచ్చితంగా టీకప్పులో తుఫాన్ అయితే కాదు! నిజమైన తుఫానే! ఎవరికి తుఫాను అంటే మాత్రం బీజేపికి, మోదీకి అనే చెప్పాలి!


గంట సేపు అనర్గళంగా మాట్లాడిన పవన్ చనిపోయిన తన అభిమాని వినోద్ రాయల్ గురించి ఓ సారి అలా ప్రస్తావించినా మెయిన్ టార్గెట్ మాత్రం ప్రత్యేక హోదాగానే పెట్టుకున్నాడు. అది ఇవ్వని కేంద్ర ప్రభుత్వాన్నే సీరియస్ గా టార్గెట్ చేశాడు. తెలుగు దేశాన్ని, టీడీపీ ఎంపీల్ని, కేంద్ర మంత్రుల్ని ఆయన అక్కడక్కడా విమర్శించినా ఘాటు మాత్రం కమలదళానికే ఎక్కువగా తగిలింది. 


మోదీ అంటే తనకు అభిమానం అని చెబుతూనే పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా మాత్రం కావాల్సిందేనన్నాడు. అందుకోసం సుదీర్ఘ ప్రణాళికనే ప్రకటించాడు కూడా. బీజేపీనే మరీ మరీ టార్గెట్ చేసిన పవర్ స్టార్ నెక్ట్స్ సభ కాకినాడలో వుంటుందని తేల్చాడు. ఎందుకంటే, అక్కడే బీజేపి ఒక ఓటు రెండు రాష్ట్రాలని తీర్మానం చేసిందన్నాడు. కాషాయ దళాన్ని ఓ రేంజ్లో ఆటాడిన పవన్ కళ్యాణ్ మోదీనే కాక వెంకయ్యనాయుడ్ని కూడా ఒక దశలో బాగా టార్గెట్ చేశాడు. కాంగ్రెస్ లాగే బీజేపి కూడా ప్రవర్తిస్తుందని ధ్వజమెత్తాడు. 


విమర్శలు చేస్తూనే తన భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించాడు జనసేన అధినేత. మూడు దశల్లో ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తానని అన్నాడు. సభలతో మొదలు పెట్టి రోడ్లపై ధర్నాలు , రాస్తారోకోల వరకూ అన్నీ చేస్తామని చెప్పాడు. దీని ద్వారా 2019వరకూ తాను ప్రజల్లోనే వుంటానని స్పష్టమైన సంకేతం ఇచ్చాడు. తాను 75కిలోలు కూడా వుండనని చెప్పుకొచ్చిన పవన్ తన బలం అభిమానులే అన్నాడు. తన కూతురు క్రిస్టియన్ అంటూ కూడా చెప్పిన కళ్యాణ్ అక్కడక్కడా కొన్ని డైలాగ్స్ తో బాగానే ఆకట్టుకున్నాడు. కాకపోతే, చాలా వరకూ స్పీచ్ సీరియస్ గా నడిచిందనే చెప్పుకోవాలి. చివర్లో ఇంగ్లీష్, హిందీల్లో కూడా దంచి కొట్టాడు పవర్ స్టార్. 


పవన్ కళ్యాణ్ అనూహ్యంగా ఏర్పాటు చేసిన సభ అంతే అనూహ్యంగా బీజేపి వైపు గురి పెట్టబడింది! తెలుగు దేశాన్ని తగినంత విమర్శిచలేదనే వాళ్లు ఎలాగూ వుండనే వున్నారు. కాకపోతే, విమర్శకుల మాటలెలా వున్నా పవన్ మాత్రం ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వాన్ని సహజంగానే టార్గెట్ చేశాడు. ఇక జనసేనాని దాడికి ఢిల్లీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి...