అరుణగ్రహంపై భారత్ తొలి సంతకం
posted on Sep 24, 2014 12:18PM
.jpg)
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన మంగళ యాన్ ప్రయోగం విజయవంతమయింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మార్స్ ఆర్బిటర్ (మామ్) విజయవంతంగా అరుణగ్రహ కక్షలో ప్రవేశపెట్టడం, అది కూడా భారత్ తన తొలి ప్రయత్నంలోనే సాధించడంతో భారత శాస్త్రవేత్తల అపూర్వ మేధస్సును, దేశ సాంకేతిక పరిజ్ఞానాన్ని యావత్ ప్రపంచానికి మరొకసారి చాటి చెప్పినట్లయింది.
పది నెలల పాటు దాదాపు 65 లక్షల కిమీ దూరం అవిశ్రాంతంగా సాగిన ఈ మంగళ యాన్ యాత్ర నేడు విజయవంతంగా ముగిసింది. ఇక నుండి మామ్ అరుణగ్రహంపై పరిశోధనలు మొదలుపెట్టి ఆ గ్రహం గురించి విలువయిన సమాచారం, ఫోటోలు బెంగళూరులో ఉన్న అంతరిక్ష కేంద్రానికి పంపుతుంటుంది. ఈరోజు మధ్యాహ్నం పన్నెండున్నర గంటల తర్వాత మార్స్ గ్రహ తొలి ఫొటో భూమికి చేరవచ్చును. ఇది అరుణగ్రహంపై భారత్ చేసిన తొలి సంతకంగా చెప్పుకోవచ్చును.
ఇప్పటికే భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ఇతరదేశాలకు చెందిన అనేక రకాల ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెడుతూ దేశానికి భారీ ఆదాయ వనరుగా నిలుస్తోంది. ఇప్పుడు ఈ అనన్య సామాన్యమయిన విజయవంతంతో ఇకపై మరిన్ని దేశాలు భారత్ అంతరిక్ష సమస్త సేవలను ఉపయోగించుకొనేందుకు ముందుకు రావచ్చును. అంతే కాక వివిధ దేశాలు ఇకపై ఇస్రోతో అంతరిక్ష పరిశోధనలకు ఆసక్తి చూపవచ్చును.
అందుకు ప్రధానంగా మూడు కారణాలు చెప్పుకోవచ్చును. 1. భారత శాస్త్రవేత్తల సమర్ధత. 2. సక్సస్ రేట్ ఎక్కువగా ఉండటం.3. అమెరికాలో నాసా వంటి సంస్థలతో పోలిస్తే చాలా చవకలో విజయవంతంగా ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టగలగడం.ఇదే ప్రయోగానికి నాసా దాదాపు రూ. 6,000 కోట్లు ఖర్చు చేస్తే భారత శాస్త్ర వేత్తలు కేవలం రూ.450 కోట్లలో పని పూర్తి చేసారు. అందువలన ఈ మంగళ యాన్ విజయం భారత అంతరిక్ష పరిశోధనలకు, అంతరిక్ష వ్యాపారానికి నాంది పలుకుతుందని ఆశించవచ్చును.