మెట్రో రూటు మార్పుకు ఎల్ అండ్ టి ఓకే
posted on Nov 15, 2014 7:43PM

హైదరాబాద్ మెట్రో రైలు మార్గం అలైన్‌మెంట్ మార్పుకు ఎల్ అండ్ టి సంస్థ అంగీకరించింది. దీంతో ఈ విషయంలో గత కొంతకాలంగా ఏర్పడిన ప్రతిష్టంబన తొలగిపోయి, మెట్రో పనులు చురుకుగా సాగడానికి మార్గం సుగమమైంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం నాడు ఎల్ అండ్ టి సంస్థ ఛైర్మన్ నాయక్, ఇతర ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మెట్రో అలైన్‌మెంట్ మార్చడానికి అంగీకారం కుదిరింది. ఈ మేరకు పాతబస్తీలో ప్రార్థనా మందిరాలు ఉన్న చోట అలైన్‌మెంట్‌ను మార్చి మూసీ నది పక్కనుంచి మార్గాన్ని మార్చుతారు. అలాగే సుల్తాన్ బజార్ దగ్గర మార్గాన్ని మార్చి కోఠీ ఉమన్స్ కాలేజీ వెనుక నుంచి మళ్ళిస్తారు. అదేవిధంగా ప్రస్తుతం అసెంబ్లీ ముందు నుంచి వున్న మార్గాన్ని అసెంబ్లీ వెనుక నుంచి తీసుకెళ్తారు. మెట్రో అలైన్‌మెంట్ మార్పుకు అయ్యే వ్యయాన్ని భరించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారు. మెట్రోకి అప్పగించిన స్థలాలను కూడా తిరిగి తీసుకోబోమని కూడా కేసీఆర్ హామీ ఇచ్చారని తెలుస్తోంది. అలాగే, మొత్తం మెట్రోరైలు మార్గాన్ని కూడా 72 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్లకు పెంచడానికి కూడా ఎల్అండ్టీ అంగీకరించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 20వ తేదీన ఎల్ అండ్ టీ ప్రతినిధులతో మరోసారి సమావేశమవుతారు.