బీజేపీలోకి ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ ఖాన్! రేవంత్ రెడ్డి కోసమేనా..? 

తెలంగాణలో కాంగ్రెస్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కీలక నేతలు వరుసగా కమలం గూటికి చేరుతున్నారు. ఆదివారం రోజున  గ్రేటర్ లో బలమైన నేతగా ఉన్న మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్..  జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు. కూన రాజీనామా షాక్ నుంచి కోలుకోకుముందే కాంగ్రెస్  కు హైదరాబాద్ లో హస్తానికి మరో ముఖ్య నేత హ్యాండించ్చేందుకు సిద్దమవుతున్నారు. 

గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ లీడర్ గా పిలుచుకునే  ఫిరోజ్‌ఖాన్‌ త్వరలో బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2018లో కాంగ్రెస్‌ తరఫున పోటీచేశారు ఫిరోజ్‌ ఖాన్‌. 2019 లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్‌ లోక్‌ సభకు  పోటీ చేసి ఓడిపోయారు. పాతబస్తీలో ఎంఐఎం పార్టీకి వ్యతిరేకంగా ఆయన పోరాడుతున్నారు. గతంలో ఆయనపై దాడి కూడా జరిగింది. అయినా భయపడకుండా దూకుడు రాజకీయాలు చేస్తున్నారు ఫిరోజ్ ఖాన్. దీంతో ఆయనను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎమ్మెల్యే రాజాసింగ్‌ చేసిన ప్రయత్నాలు కొలిక్కివచ్చాయి. బండి సంజయ్‌తో ఆయన ఇప్పటికే రెండుసార్లు సమావేశమైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.  

సిర్పూరు కాగజ్‌నగర్‌ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ పాల్వాయి హరీశ్‌బాబు మంగళవారం బీజేపీలో చేరనున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యారు. హరీశ్ తండ్రి పాల్వాయి పురుషోత్తంరావు 1989లో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా సిర్పూరు కాగజ్‌నగర్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించారు. 1999లో హరీశ్ తల్లి పాల్వాయి రాజ్యలక్ష్మి టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 
 
తెలంగాణ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి కొనసాగుతున్న వలసలపై మరో ఆసక్తికర చర్చ జరుగుతోంది. బీజేపీలోకి వెళుతున్న కాంగ్రెస్ నేతలంతా మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అనుచరులే కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కూన శ్రీశైలం గౌడ్ గ్రేటర్ లో రేవంత్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. ఫిరోజ్ ఖాన్ కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా నియమించాలని ఓపెన్ గానే ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. అంతేకాదు రేవంత్ కు వ్యతిరేకంగా మాట్లాడే కాంగ్రెస్ సీనియర్లపైనా ఆయన విరుచుకుపడ్డారు.  సిర్పూరు కాగజ్‌నగర్‌ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ పాల్వాయి హరీశ్‌బాబు.. రేవంత్ రెడ్డితో పాటు టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. ఇలా వలస పోతున్న నేతలంతా రేవంత్ రెడ్డి అనుచరులే కావడంతో.. ఆయన డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu