బిల్లులు చెల్లించలేదని మృతదేహాలను నిలిపివేయడం చట్టవిరుద్ధం: అమానవీయం, శిక్షార్హం.!
Published on: Sat Nov 14, 2026 11:37AM

వైద్య రంగానికి సంబంధించి దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న అంశంపై ఇప్పుడు పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఆసుపత్రి బిల్లులు పూర్తిగా చెల్లించలేదనే కారణంతో చికిత్స పొందుతూ మరణించిన వారి మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించడానికి ఆస్పత్రులు నిరాకరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలను కలవరపెడుతున్న ఈ ఘటనలు కేవలం ఏదో ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పదే పదే పునరావృతమవుతున్నాయి. ఈ విషయాన్ని పలు నివేదికలు సైతం ఎత్తి చూపుతున్నాయి. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన తమ ప్రియమైన వారిని కడసారి చూసుకునేందుకు, అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా కుటుంబ సభ్యులు నానాపాట్లు పడాల్సి వస్తోంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా విపరీతంగా షేర్ అవుతున్న ఒక వైరల్ పోస్ట్ ఈ సమస్య తీవ్రతను కళ్లకు కట్టింది.
ఢిల్లీలోని ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి ఐసీయూలో జరిగినట్లు చెప్పబడుతున్న ఆ ఘటనలో, ఇద్దరు వేర్వేరు వ్యక్తులు తమ తండ్రులను కోల్పోగా, ఆసుపత్రి సిబ్బంది భారీ బిల్లుల కోసం మృతదేహాలను ఫ్రీజర్‌లోనే ఉంచారు. రూ. 11.5 లక్షల బిల్లు చెల్లించాలంటూ యాజమాన్యం ఒత్తిడి తేవడంతో ఆ కుటుంబాలు పడిన వేదనను ఆ సోషల్ మీడియా పోస్టు కళ్లకుకట్టింది. అయితే, ఈ నిర్దిష్ట ఉదంతానికి సంబంధించి అధికారిక రికార్డుల్లో కచ్చితమైన ఆధారాలు లేనప్పటికీ, సమాజంలో నెలకొన్న వాస్తవ పరిస్థితికి ఇది అద్దం పట్టింది. దేశవ్యాప్తంగా వివిధ ఆసుపత్రులలో ఇటువంటి సంఘటనలు నిత్యకృత్యంగా మారుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అదలా ఉంచితే.. చట్టపరమైన అంశాలను పరిశీలిస్తే.. కామన్ లా ఎప్పుడూ కూడా మృతదేహాన్ని ఎలాంటి ఆస్తిగా, వస్తువుగా పరిగణించదు. మరణించిన వ్యక్తికి సంబంధించిన దహన సంస్కారాలు, ననం చేసే హక్కు కేవలం అత్యంత సన్నిహిత బంధువులకు మాత్రమే ఉంటుందని చట్టం చెబుతోంది. అంతేకాని, బకాయిలు వసూలు చేసుకునేందుకు ఆసుపత్రి యాజమాన్యాని మృతదేహంపై ఎటువంటి యాజమాన్య హక్కు ఉండదు. ఈ విషయాన్ని న్యాయనిపుణులు విస్పష్టంగా చెబుతున్నారు. భారతదేశంలో మృతుల హక్కులను ప్రత్యేకంగా రక్షించేందుకు ప్రత్యేక చట్టాలు లేనప్పటికీ.. రాజ్యాంగం, గతంలో వెలువడిన కొన్ని కీలక సుప్రీంకోర్టు తీర్పులు, ఎన్హెచ్ఆర్సీ మార్గదర్శకాలే దీనికి రక్షణగా నిలుస్తున్నాయి.
గతంలో సుప్రీంకోర్టు పలుసార్లు ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 1989 నాటి పరమానంద్ కటారా కేసుకు సంబంధించి.. రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రాణాలను కాపాడే బాధ్యతను రాష్ట్రంపై ఉంచుతుందనీ, ప్రతి వైద్యుడు సకాలంలో చికిత్స అందించాలని కోర్టు స్పష్టం చేసింది. ఆ తర్వాత 1995లో ఇదే కేసుకు సంబంధించి ఇచ్చిన ఆదేశాల్లో, మరణానంతరం కూడా శరీరానికి గౌరవప్రదమైన మర్యాద దక్కే హక్కు ఉంటుందని న్యాయస్థానం కుండబద్దలు కొట్టింది. ముఖ్యంగా 2018 జూలై 9న యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ మూల్‌చంద్ ఖైరాతీ రామ్ ట్రస్ట్ కేసులో సుప్రీంకోర్టు బిల్లుల వసూలు కోసం మృతదేహాలను తాకట్టుగా పెట్టుకోవడం చట్టవిరుద్ధమని, అది నేరపూరిత చర్య అని, వైద్య వృత్తిపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసే చర్యగా పరిగణించాలని విస్పష్టంగా చెప్పింది. ఇటువంటి ఘటనలు వెలుగుచూసిన వెంటనే ఆసుపత్రి యాజమాన్యంపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు తీర్పులు ఇంత విస్పష్టంగా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితిలో ఇసుమంతైనా మార్పు రాలేదని, తరచుగా మృతదేహాలను అప్పగించాలంటే బిల్లు బకాయిలు చెల్లించాలంటూ ఆస్పత్రుల యాజమాన్యాలు చేస్తున్న డిమాండ్లు తేటతెల్లం చేస్తున్నాయి.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 2019లో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ కింద రోగుల హక్కులు మరియు బాధ్యతలను విస్పష్టంగా పేర్కొంది, ఆ ప్రకారం ఏ కారణం చేతనైనా సరే ఆసుపత్రులు మృతదేహాలను అప్పగించడానికి నిరాకరించడానికి వీల్లేదు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్ హెచ్ ఆర్సీ) కూడా ఇదే విషయాన్ని పేర్కొంటూ మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే, ఆరోగ్య రంగం అనేది పూర్తిగా రాష్ట్రాల పరిధిలోకి వచ్చే అంశం కావడంతో, కేంద్రం జారీ చేసే ఆదేశాలు, మార్గదర్శకాలను అమలు చేయడంలో రాష్ట్రాలలో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టాన్ని కూడా అన్ని రాష్ట్రాలు పూర్తిగా ఆమోదించకపోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలోని వివిధ ప్రాంతాలలో మృతదేహాల అప్పగింత విషయంలో ఆస్పత్రుల యాజమాన్యాలు మొరాయించిన ఘటనలు తరచుగా వెలుగు చూస్తూనే ఉన్నాయి. తిరుపతిలో కేవలం 45 వేల రూపాయల బకాయి కోసం, గ్రేటర్ నోయిడాలో 3 లక్షల రూపాయల కోసం, గురుగ్రామ్‌లోనూ ఆస్పత్రి బిల్లుల చెల్లింపుల కోసం మృతదేహాలను బంధువులకు అప్పగించకుండా నిలిపివేసిన ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. లూథియానా, జింద్, జంషెడ్పూర్ వంటి ప్రాంతాలలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి.
ఇది కూడా చదవండి: రాజకీయ ఒత్తిళ్లా, జవాబుదారీ తనమా: జ్ణానేశ్ కుమార్ వివాదం వెనుక అసలు విషయం ఏంటి.?
అయితే, విస్మయం కలిగించే విషయం ఏమిటంటే, చట్టం, నిబంధనలు ఉన్నప్పటికీ, రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు లేదా మానవ హక్కుల సంఘం సభ్యులు జోక్యం చేసుకున్న సందర్భాలలో మాత్రమే ఆసుపత్రులు దిగివచ్చి మృతదేహాలను బంధువులకు అప్పగిస్తున్నాయి. ఈ సమస్యకు సంబంధించి చట్టపరమైన కోణాన్ని పరిశీలిస్తే.. ఆసుపత్రికి చెల్లించాల్సిన బకాయిలను వసూలు చేసుకునే హక్కు చట్టబద్ధంగా ఆయా అస్పత్రుల యాజమాన్యాలకు ఉంటుంది. కానీ ఆ బకాయిల వసూలు కోసం మృతదేహాన్ని బందీగా ఉంచే అధికారం వారికి లేదుగాక లేదు. ఆసుపత్రి బిల్లు అనేది సివిల్ వివాదం కిందకు వస్తుందే తప్ప, మానవ శరీరంతో ముడిపడిన నేరపూరిత మార్టిగేజ్ వ్యవహారం ఎంత మాత్రం కాదు. కాకూడదు. ఒకవేళ ఆసుపత్రులు నిబంధనలను ఉల్లంఘించి మృతదేహాలను అడ్డుకుంటే, భారత న్యాయ సంహిత కింద బలవంతపు వసూలు, ఇతర సెక్షన్ల ద్వారా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

అయినప్పటికీ, ఇటువంటి సంఘటనల్లో బాధితులకు న్యాయపోరాటం చేసే ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఆసుపత్రులు ఈ నిబంధనలను, కోర్టు తీర్పులను తేలికగా తీసుకుంటున్నాయి. సామాజికంగా చూస్తే.. ఆసుపత్రి కౌంటర్ వద్ద శవాలతో నిలబడే కుటుంబాలు ఇప్పటికే ఉన్నదంతా కోల్పోయి, అప్పులపాలై ఉంటారు. వారి దయనీయ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఆసుపత్రులు వ్యవహరించడం మానవత్వానికే మచ్చ అని చెప్పడానికి ఇసుమంతైనా సందేహించాల్సిన అవసరం లేదు. ఇటువంటి సంఘటనలను మీడియా, సోషల్ మీడియా వెలుగులోకి తీసుకువచ్చి, ఇందుకు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో చట్టపరమైన చర్యలు తీసుున్నప్పుడు మాత్రమే ఇటువంటి అమానవీయ చర్యలకు ఫుల్ స్టాప్ పడుతుంది. ప్రభుత్వాలు, ప్రభుత్వ యంత్రాంగాలు ఇటువంటి అమానవీయతపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసోం ప్రభుత్వం మరణ ధృవీకరణ పత్రం అందిన నిర్దిష్ట గడువులోగా మృతదేహాన్ని అప్పగించడం ఆలస్యం అయితే వెంటనే యంత్రాంగానికి సమాచారం అందించాలన్న నిబంధన విధించింది. ఇది దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించాలి. ప్రతి ఆసుపత్రిలోనూ ఈ నిబంధనలకు సంబంధించిన బోర్డులను ప్రదర్శించడం, బాధితుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్లను ఏర్పాటు చేయడం ద్వారా సమస్యకు శాశ్వత పరిష్కారం అందించాలి. మరణంతో ఆర్థిక లావాదేవీలు ముగియకపోయినప్పటికీ, ఆ బిల్లుల వసూళ్లు చట్టపరమైన మార్గాల ద్వారా జరగాలి తప్ప, అర్ధరాత్రి పూట ఫ్రీజర్ల వద్ద బంధువులను వేధించే పద్ధతికి ముగింపు పలకాలి. సమాజంలో మరణించిన ప్రతి ఒక్కరికీ గౌరవప్రదమైన వీడ్కోలు లభించేలా చూసే బాధ్యత ప్రభుత్వం మరియు పౌర సమాజంపై ఉంది.
మీకు నచ్చవచ్చు: రాజకీయ నాయకులను పూజించడం మానండి: పౌరులుగా ఆలోచించడం ప్రారంభించండి.!
సెలెక్టివ్ సెక్యులరిజం: పాఠ్యపుస్తక రాజకీయం వెనుక ఉన్న అసలు నిజాలు.!
-కంఠంనేని సీతారాం
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా https://TeluguOne.com పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.
[Hospitalharassment: Withholding Deadbodies, Unpaidbills, Illegal, Inhumamne, TeluguOne]


