TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సెలెక్టివ్ సెక్యులరిజం: పాఠ్యపుస్తక రాజకీయం వెనుక ఉన్న అసలు నిజాలు.!

Published on: Mon Nov 2, 2026 9:39AM

విద్యాశాఖ, పాఠ్యపుస్తక రాజకీయం,  మూడు తరాల జ్ఞాపకభ్రంశం

ముఖ్యాంశాలు
-  స్వాతంత్య్రానంతర తొలి మూడు దశాబ్దాలలో  కేంద్ర విద్యాశాఖను ఏ భావజాలం నిర్దేశించింది అన్నది ప్రధాన చర్చ.
- 1947–1977 మధ్య తొమ్మిది మంది కేంద్ర విద్యాశాఖ మంత్రులు పనిచేశారు. వారిలొ ఐదుగురు ఐదుగురు ముస్లిం, నలుగురు హిందూ. కానీ ఆ మూడు దశాబ్దాలలో దాదాపు 19 ఏళ్లు కేంద్ర విద్యాశాఖ ఒకే వర్గం చేతుల్లో ఉంది.
- లౌకికవాదం పేరిట మెజారిటీ సమాజం పిల్లలకు  తటస్థత బోధించారు.  మైనారిటీ విద్యాసంస్థలకు అదే ప్రమాణం ఎప్పుడూ వర్తించలేదు.
- రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 రక్షణను  మత విద్యకు రక్షణ గా మార్చిన రాజకీయం దశాబ్దాల పాటు కొనసాగింది.
- ఫలితం.. మూలాలకు దూరమైన, తమ చరిత్రను తామే తక్కువ అంచనా వేసుకునే తరం.

చారిత్రక నేపథ్యం

1947 ఆగస్టు 15. దేశానికి ఇండిపెండెన్స్ వచ్చింది.  ఆ రోజు సామాన్యుని ఆశ ఒకటే.. ఇక మన పిల్లలు మన దేశ నిజమైన చరిత్రను చదువుతారు. రామాయణ, మహాభారతాలను మన సంస్కృతి మూలాలుగా తెలుసుకుంటారు. మహారాణా ప్రతాప్, శివాజీ, గురు గోవింద్ సింగ్, రాణి లక్ష్మీబాయి, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ పోరాటాన్ని ఆదర్శంగా తీసుకుంటారని. కానీ ఆ ఆశ నెరవేరలేదు. ఎందుకంటే స్వాతంత్ర్యం రాగానే విద్య అనేది జ్ఞాన ప్రసార సాధనంగా కాకుండా, రాజకీయ పునాది వేసుకునే సాధనంగా మారింది. కొత్త దేశానికి ఒక  అధికారిక చరిత్ర  అవసరమైంది. ఆ చరిత్రలో ఎవరు హీరోలు, ఎవరు విలన్లు, ఏ యుద్ధం గుర్తుంచుకోవాల్సినది, ఏ యుద్ధం మరచిపోవాల్సినది..  అన్నది పాఠ్యపుస్తక సంస్థలు నిర్ణయించాయి. ఆ నిర్ణయం రాజకీయ నిర్ణయం. జ్ఞానపరమైనది కాదు. 1958 ఫిబ్రవరి వరకు,  పదేళ్లకు పైగా కేంద్ర విద్యాశాఖ మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేతుల్లో ఉంది. ఆయన ఒక పండితుడు.  యూజీసీ , ఐఐటీ వంటి సంస్థల నిర్మాణంలో ఆయన పాత్ర గురించి చర్చ ఉండదు. కానీ సంస్థలు నిర్మించడం ఒక విషయం.  ఆ సంస్థల్లో, పాఠశాలల్లో ఏం బోధించాలి అన్నది మరో విషయం. రెండోదే తరాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది.

ఇక్కడ ఒక విషయాన్ని ముందే స్పష్టం చేయాలి. ఈ ముప్పై ఏళ్లలో విద్యాశాఖ మంత్రులందరూ ఒకే మతానికి చెందినవారు అని సోషల్ మీడియాలో విస్తృతంగా ఒక ప్రచారం ఉంది. అది వాస్తవం కాదు. కె.ఎల్. శ్రీమాలి, త్రిగుణ సేన్, వి.కె.ఆర్.వి. రావు, సిద్ధార్థ శంకర్ రే..   నలుగురు హిందూ మంత్రులు కూడా ఈ కాలంలో కేంద్ర విద్యా శాఖను  నిర్వహించారు. ఆ వాస్తవాన్ని దాచి వాదించడం అవివేకం.  అలాంటి వాదన ఒక్క శోధనలో కూలిపోతుంది. అసలు చర్చ సంఖ్యల గురించి కాదు..  దిశ గురించి.

సంఘటనల కాలక్రమం: 1947–1977

కేంద్ర విద్యాశాఖను నిర్వహించిన మంత్రుల పూర్తి జాబితా 
మంత్రి                                               పదవీకాలం                    వ్యవధి
మౌలానా అబుల్ కలాం ఆజాద్         15.08.1947 – 22.02.1958    10 ఏళ్ళ 6 నెలలు
డా. కె.ఎల్. శ్రీమాలి                          22.02.1958 – 31.08.1963    5 ఏళ్ళ. 6 నెలులు
హుమాయూన్ కబీర్                         31.08.1963 – 21.11.1963    సుమారు 3 నెలలు
ఎం.సి. చాగ్లా                          21.11.1963 – 13.11.1966    3 ఏళ్లు
ఫక్రుద్దీన్ అలీ అహ్మద్        14.11.1966 – 13.03.1967    4 నెలలు
డా. త్రిగుణ సేన్                         16.03.1967 – 14.02.1969    2 ఏళ్ళు
డా. వి.కె.ఆర్.వి. రావు                            14.02.1969 – 18.03.1971    2 ఏళ్ళు
సిద్ధార్థ శంకర్ రే                          18.03.1971 – 20.03.1972    ఏడాది
ఎస్. నూరుల్ హసన్                          24.03.1972 – 24.03.1977    5 ఏళ్ళు.

సంఖ్యలు చూపించేది ఇది.. తొమ్మిది మంది మంత్రుల్లో ఐదుగురు ముస్లిం, నలుగురు హిందూ. కానీ ముప్పై ఏళ్లలో సుమారు పందొమ్మిది ఏళ్ల పాటు ఆ పదవిని ముస్లిం మంత్రులే నిర్వహించారు. అత్యధిక కాలం ఒకే వ్యక్తి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ పదేళ్లకు పైగా), రెండో అత్యధిక కాలం మరో వ్యక్తి (నూరుల్ హసన్  ఐదు ఏళ్లు). అంటే నిర్ణయాధికారం ఎక్కడ కేంద్రీకృతమైందో స్పష్టమవుతుంది. మిగిలిన నలుగురు హిందూ మంత్రుల్లో ఇద్దరు ..  త్రిగుణ సేన్, సిద్ధార్థ శంకర్ రే — రెండేళ్ల లోపు మాత్రమే పనిచేశారు;  శ్రీమాలి, రావు మాత్రమే ఐదు, రెండేళ్ల చొప్పున కొనసాగారు.

ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం..  1968 జాతీయ విద్యా విధానం, పాఠ్యపుస్తక పునర్విమర్శ,  ఆధునిక, లౌకిక చరిత్ర దృష్టికోణం..  ఇవన్నీ ఆ పదేళ్ల కాలంలోనే రూపు దాల్చాయి. అంటే ఒక దశాబ్దం నిర్ణయం మూడు దశాబ్దాల ఫలితాన్ని నిర్ణయించింది.

లౌకికవాదం పేరిట ఏం బోధించారు?

ప్రభుత్వ పాఠశాలల్లో హిందూ విద్యార్థికి చెప్పిన మాటలు ఇవి.. నువ్వు లౌకికవాదిగా ఉండు. అన్ని మతాలను సమానంగా చూడు. రామాయణ, మహాభారతాలు కేవలం కథలు. నీ సంస్కృతి గురించి మాట్లాడితే అది మతతత్వం.  అదే సమయంలో మహారాణా ప్రతాప్ హల్దీఘాటీ పోరాటం పాఠ్యపుస్తకాల్లో కుంచించుకుపోయింది.  శివాజీ  హిందూ స్వరాజ్యం భావన మసకబారింది.  గురు గోవింద్ సింగ్ త్యాగం ఒక చారిత్రక సంఘటనగా మిగిలిపోయింది.

అదే సమయంలో మధ్యయుగ భారతాన్ని చిత్రించిన విధానం మరోలా ఉంది. అక్బర్ దీన్ ఎ ఇలాహీ, మత సహనం, కళల పోషణ,  ఇవి విస్తృతంగా చర్చించబడ్డాయి. కానీ బాబర్ మందిర ధ్వంసం, ఔరంగజేబు కాలంలో జరిగిన మందిర ధ్వంసాలు, గురు తేగ్ బహదూర్ శిరచ్ఛేదం  వంటివి  ఇవి అదే పాఠ్యపుస్తకాల్లో అంత విస్తృతంగా కనిపించలేదు. ఒక పాలకుడి మత సహనం విస్తారంగా, మరో పాలకుడి హింస సంక్షిప్తంగా  ఉ:ది.  ఇది చరిత్ర కాదు, ఎంపిక అంటే సెలక్షన్. 
ఇదే విమర్శను కాంగ్రెస్ ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఎందుకంటే ఆ విమర్శ రాజకీయంగా ప్రశ్నించే శక్తిని కోల్పోయింది. మతతత్వం అనే లేబుల్ తో నిశ్శబ్దం చేయబడింది.

ద్వంద్వ ప్రమాణాలు

ప్రభుత్వ పాఠశాలల్లో లౌకికవాదాన్ని అమలు చేసిన అదే వ్యవస్థ, మైనారిటీ విద్యాసంస్థల విషయంలో పూర్తిగా మౌనం వహించింది. ఇది యాదృచ్చికం కాదు. రాజ్యాంగ నిర్మాణంలోని ఒక అంతరాన్ని రాజకీయంగా పెంచి పోషించడం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 మైనారిటీ విద్యాసంస్థలకు స్థాపన, నిర్వహణ హక్కును కల్పిస్తుంది. దాని ఉద్దేశం.. సాంస్కృతిక, భాషా పరిరక్షణ. కానీ దశాబ్దాల తరబడి ఆ రక్షణ  రాష్ట్రం ఏమీ చెప్పకూడదు అనే అర్థంలోకి మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో వందేమాతరం, జాతీయ గీతం తప్పనిసరి. మదరసాల్లో అవి లేకపోవడాన్ని ఎవరూ ప్రశ్నించలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యాంశాలు రాష్ట్రం నిర్ణయిస్తుంది.  మదరసాల పాఠ్యాంశాలను రాష్ట్రం తాకలేదు.

అంటే లౌకికవాదం ఒక వైపు మాత్రమే వర్తించే నియమంగా మారింది. మెజారిటీ పిల్లవాడు తన సంప్రదాయం నుంచి దూరం కావాలి. మైనారిటీ పిల్లవాడు తన మతం నుంచి దూరం కావాల్సిన అవసరం లేదు. ఇది లౌకికవాదం కాదు..  ఇది ఎంపిక చేసిన లౌకికవాదం. ఔను సెలెక్టివ్ సెక్యులరిజం.  హిందువుల   దేవాలయ ఆదాయంపై రాష్ట్ర నియంత్రణ. అదే మైనారిటీ మతస్థలాలకు   ఆ నియంత్రణ లేదు. హిందూ పండుగ ప్రభుత్వ కార్యాలయంలో  మతపరమైనది’  మరో పండుగ  సాంస్కృతికమైనది. ఒకరు మాట్లాడితే  మతతత్వం.  మరొకరు మాట్లాడితే  మైనారిటీ హక్కులు. ఇది చర్చ కాదు..  నిఘంటువు రాజకీయం.

రాజకీయంగా ఇది ఓటు బ్యాంకు లెక్క. ఒక వర్గాన్ని ఏకీకృత ఓటు బ్యాంక్ గా  మార్చుకోవడానికి  మైనారిటీ భద్రత  అనే భావన రాజకీయ మూలధనంగా మారింది. ఆ మూలధనం ఎంత పనిచేస్తుందో, దాన్ని కాపాడుకోవడానికి ఎంత మౌనం అవసరమో చరిత్ర చూపింది. సామాజికంగా ఫలితం మరింత తీవ్రం. ఒక తరం మెజారిటీ పిల్లలు తమ సంస్కృతి పట్ల సిగ్గుతో పెరిగారు. మరో తరం మైనారిటీ పిల్లలు తమ మతం పట్ల అతిగా పెరిగారు. ఒక వైపు ఆత్మన్యూనత, మరో వైపు మతాభిమానం,  రెండూ సమాజానికి హానికరమే. సమాజంలో సమతౌల్యం ఏర్పడాలంటే రెండు వైపులా ఒకే ప్రమాణం ఉండాలి.

మీడియా కోణం ఇంకా స్పష్టం.  మెజారిటీవాదం,  మతతత్వం , ‘సాంప్రదాయికత  ఇవి విశ్లేషణ పదాలు కావు..  ఆయుధాలు. హిందూ సమాజం తన చరిత్ర గురించి ప్రశ్నించిన ప్రతిసారీ ఈ ఆయుధాలు వాడబడ్డాయి. అదే ప్రశ్న మైనారిటీ సమాజం నుంచి వచ్చినప్పుడు అవి మాయమవుతాయి. ఇరవై ఏళ్లుగా టెలివిజన్ చర్చలు, సోషల్ మీడియా వేదికలు ఈ అసమానతను మరింత పదును చేశాయి.


ఈ ముప్పై ఏళ్ల విద్యా దిశ నేటి రాజకీయ భాషలో కనిపిస్తోంది. తమ పూర్వీకులు శతాబ్దాల పాటు విదేశీ పాలనకు వ్యతిరేకంగా పోరాడారని పాఠశాలల్లో చదువుకోని ఒక తరం, పెద్దయ్యాక  భారతదేశాన్ని మొఘలులే నిర్మించారు  అని అంటుంది. కాశీ, మథుర, అయోధ్యల చరిత్ర తెలియని ఒక తరం, మందిరం, మసీదు గొడవలు ఎందుకు?” అని అడుగుతుంది. ప్రశ్న అడగడం తప్పు కాదు,  సమాధానం తెలియకపోవడమే సమస్య.

ఈ రోజు పాఠ్యపుస్తక పునర్విమర్శలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఒక వర్గం దాన్ని  చరిత్ర పునర్లేఖనం’ అంటుంది.  మరో వర్గం  చరిత్ర సవరణ  అంటుంది. రెండు వైపులా భావోద్వేగం ఉంది.  రెండు వైపులా రాజకీయం ఉంది. కానీ ఒక విషయం మరచిపోకూడదు.  ఏ పాఠ్యపుస్తకమూ పూర్తిగా తటస్థం కాదు. ప్రతి తరం తన పిల్లలకు తన అవగాహనను అందించాలని ప్రయత్నిస్తుంది. ప్రశ్న ఏమిటంటే..  ఆ ప్రయత్నం ఒక వర్గానికి మాత్రమే ఎందుకు అనుమతించబడింది? పబ్లిక్ డిబేట్ లో ఇప్పుడు ఒక కొత్త దశ మొదలైంది. పాఠ్యపుస్తకాల్లో ఏం ఉంది, ఏం లేదు అన్నది సామాన్య కుటుంబాల్లో కూడా చర్చకు వస్తోంది. ఇది ఆరోగ్యకరమైన సంకేతం. ఎందుకంటే విద్య ఎవరి ఆస్తి కాదు, అది దేశ భవిష్యత్తు.


కాంగ్రెస్ నాయకులను ఒక ప్రశ్న అడగాలి. ఒకే భావజాల వర్గం ముప్పై ఏళ్లలో పందొమ్మిది ఏళ్లు విద్యాశాఖను నిర్వహించినప్పుడు అది  లౌకికవాదం.  మరో వర్గం ఆ పదవిని నిర్వహించినప్పుడు అది  మతతత్వం ఎలా అవుతుంది?  ప్రభుత్వ పాఠశాలల్లో వందేమాతరం బోధించడం మతతత్వమైతే, మదరసాల్లో దాన్ని ఎందుకు నిషేధించలేదు? ఒకే నియమం రెండు ప్రమాణాలతో ఎలా పనిచేస్తుంది? 1947 నుంచి 1977 వరకు విద్యాశాఖను ఒక ప్రత్యేక భావజాలానికి అప్పగించి, భారత చరిత్రను మార్చాలని ప్రయత్నించారు. కానీ ఒక విషయం మరచిపోయారు.  పుస్తకాల నుంచి చరిత్రను చెరిపేయవచ్చు. ప్రజల జ్ఞాపకం నుంచి కాదు. నేడు మహారాణా ప్రతాప్, శివాజీ, గురు గోవింద్ సింగ్, భగత్ సింగ్ తిరిగి ప్రజా స్మృతిలోకి వస్తున్నారు. ఎంపిక చేసిన లౌకికవాదం ఓడిపోయింది. మిగిలింది ఒకే ఒక ప్రశ్న..  తదుపరి ముప్పై ఏళ్లలో మనం ఏ ప్రమాణాన్ని ఎంచుకుంటాము?


-సీతారాం కంఠంనేని 

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా  https://TeluguOne.com  పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.   

[Selective Secularism Education Policy, Indian History, Textbooks Politics, Ministry of Education India, Indian Education System,  Ideological Bias, Telugu One]