స్వంత దేశంలో హిందువులు శరణార్థులు అవుతున్నారా? 

 

మన దేశంలో హిందూ అతివాదులు వున్నారు నిజమే. వాళ్ల నుంచి మైనార్టీలకు ప్రమాదం వుంటే వుండొచ్చు కూడా! కాని, మన దేశంలో కుహనా లౌకికవాదం కూడా వుంది. ఈ సూడో సెక్యులరిజమ్ మనం గుర్తించలేనంత పెద్ద ప్రమాదం. పైగా దీనికి కారణం ఏ ముస్లిమ్ లో, క్రిస్టియన్లో కాదు. వ్యక్తిగతంగా హిందువులే అయిన మన అతి సెక్యులర్ నేతలు! 

 

ఎన్నికల సమయంలో మైనార్టీలు మూకుమ్మడిగా ఓటు వేస్తారు. అందుకే, వాళ్లను ప్రసన్నం చేసుకోటానికి మన నాయకులు బోలెడన్ని జిమ్మిక్కులు చేస్తుంటారు. నిజంగా మైనార్టీల జీవితాల్ని బాగు చేసే పనులు కాకుండా వింత వింత హామీలు ఇస్తుంటారు. ఇఫ్తార్ విందుల్లో ఫోటోలు దిగటం మొదలు హజ్ యాత్రకు సబ్సిడీ వరకూ మన నాయకులు చేయని మైనార్టీ అపీస్ మెంట్ లేదు. కాని, కొన్ని రాష్ట్రాల్లో ఇది మరీ దారుణంగా తయారవుతోంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో నేతల సెక్యులర్ ఛాందసవాదం మరీ మితిమీరుతోంది. ఇందుకు తాజాగా వెలువడిన జాతీయ మానవ హక్కుల కమీషన్ నివేదికే మంచి ఉదాహరణ. ఉత్తర్ ప్రదేశ్ లో సమాజ్ వాది పార్టీ అధికారంలోకి వస్తే ఆజం ఖాన్ లాంటి ముస్లిమ్ నేతల అరాచకం పెరిగిపోతుంది. సామాన్య పేద ముస్లిమ్ లకు ఏం చేయకున్నా హిందువులపై దాడులు చేసేస్తుంటారు సమాజ్ వాది గుండాలు. దాని ఫలితమే గత నాలుగేళ్లలో వందల సంఖ్యలో జరిగిన మత కలహాలు. ఉత్తర్ ప్రదేశ్ లో ముజఫర్ నగర్ మత కలహాలు సహా ఎన్నో జరిగాయి ఈ మధ్య. అయితే , అవేవీ చాలా వరకూ ప్రధాన స్రవంతిలోని మీడియా దాకా రాలేదు. చాలా సార్లు మీడియాలో కూడా వున్న ఆదర్శవాద, అభ్యుదయవాద, లెఫ్ట్ జర్నలిస్టులు వాట్ని చూసీ చూడకుండా వదిలేశారు. దాంతో ఉత్తర్ ప్రదేశ్ లో అరాచకం అడ్డు లేకండా పోయింది!

 

కొన్నాళ్ల కింద బీజేపి ఎంపీ హుకుమ్ సింగ్ ఉత్తర్ ప్రదేశ్ లోని కైరానా ప్రాంతం నుంచి హిందువులు వలసపోవాల్సి వస్తోందని ప్రకటన చేశాడు. వందల సంఖ్యలో హిందూ కుటుంబాలు స్థానిక మైనార్టీ రౌడీల భయంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయని ఆయన అన్నాడు. సమాజ్ వాది నేతల అండతో మైనార్టీ గూండాలు రెచ్చిపోతున్నారని చెప్పుకొచ్చాడు. కాని, అప్పుడు మీడియా, మేధావులు అంతా అతడ్ని తిట్టిపోశారు. వెటకారం చేశారు. బీజేపి ఎంపీ కాబట్టి హిందూ ఓట్ల కోసం అలా మత భావనలు రెచ్చగొడుతున్నాడని ఆరోపించారు! 

 

కైరానాలో నిజంగా హిందువులు మైనార్టీ వర్గానికి చెందిన సంఘ వ్యతిరేక శక్తులకి భయపడి వలసపోయారా? ఈ ప్రశ్నకి సమాధానం కనుక్కునేందుకే జాతీయ మానవ హక్కుల కమీషన్ విచారణ జరిపింది. తన రిపోర్ట్ సిద్ధం చేసింది. దాంట్లో కైరానాలో హిందువుల వలసలు నిజమేనని తేల్చింది! 

 

ఉత్తర్ ప్రదేశ్ లోనే కాదు బెంగాల్ లోనూ మమతా బెనర్జీ మార్కు లౌకికవాద ఓటు బ్యాంకు పాలన నడుస్తోంది. అక్కడి మాల్డా ప్రాంతంలో ఆ మధ్య మైనార్టీలు భీకరంగా హిందువుల ఆస్తులపై దాడులు చేశారు. అయినా మమతా బెనర్జీ ఎటువంటి గట్టి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. నిజానికి బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్ల కారణంగా బెంగాల్లో అనేక చోట్ల మైనార్టీలే మెజార్జీలుగా మారిపోతున్నారు. ఇలా జనాభాలో అసహజంగా మార్పులు చేసుకుంటే అది దేశ భవిష్యత్తు కే ప్రమాదం. కాని, మన ఓటు బ్యాంకు రాజకీయ నేతలకు అవేవీ పట్టటం లేదు! 

 

ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన హిందువుల వలసల కారణంగా దేశంలోని ముస్లిమ్ లను తప్పు పట్టటానికి ఏం లేదు. వాళ్లు ఎప్పటిలాగే పేదరికంలో మగ్గిపోతున్నారు. కాని, వాళ్లను, వాళ్ల ఓట్లను, వాళ్ల భయాన్ని అడ్డుపెట్టుకుని స్వార్థ రాజకీయ నేతలు పబ్బం గడుపుకుంటున్నారు! ఇదే విషాదం. అటు మైనార్టీలు, ఇటు మెజార్జీలు ఇద్దరూ ఇబ్బందుల్లో, భయాల్లో మునిగిపోతుంటే ... నేతలు మాత్రం అధికారం మరుగుతున్నారు!