చెరువులోకి మనిషి వెళ్లాడు...మనిషిపైకి చెరువొచ్చింది!

సోషల్ మీడియాలో ఇప్పుడు చెరువుల మీద చాలా చర్చ నడుస్తోంది!అందుక్కారణం హైద్రాబాద్ ను ముంచెత్తిన వరదలే.సిటీలోని చాలా కాలనీల్లో సెల్లార్లు నీట మునిగిపోయాయి.కొన్ని చోట్ల ఇళ్లలోంచి జనం బయటకి కూడా రాలేక సతమతం అవుతున్నారు.అయితే,ఇందుకు కారణం చెరువుల ఆక్రమణే అని నెటిజన్ల అభిప్రాయం.పాలకులు సమయానికి స్సందిచారా లేదా లాంటి విషయాలు పక్కన పెడితే చెరువుల కబ్జాలు మాత్రం నిజమే!అదే హైద్రాబాద్ లాంటి చాలా నగరాల దుస్థితికి కారణం... 
చెరువు గుండెలో మనం పోయి తిష్ఠవేస్తే... ఆ చెరువు పెద్ద వర్షం పడ్డప్పుడు మన ఇంట్లోకి వచ్చి తిష్ఠ వేస్తుంది!ఇప్పుడు అదే జరిగింది. అసలు ఆదునిక మానవుడు ప్రకృతిని తన ఇష్టానుసారం నాశనం చేస్తున్నాడు గత కొన్ని శతాబ్దాలుగా.అందులో నగరాల్లో దారుణంగా  బలైపోయిన ప్రకృతి వనరులు చెరువులు.భూమ్మీది ప్రతీ చోటా నదులు,వంకలు,వాగులు వుండవు.అవ్వి లేని ప్రాంతాల్లో మనిషికి నీటి వనరుగా నిలిచేది చెరువే.దాన్ని వాడుకునే ఒకప్పుడు ఊరు ఊరంతా బతికేది.రైతులు పొలాలకు నీళ్లు పెట్టుకోవటం మొదలు జనం తాగు నీరు తీసుకుపోవటం,బట్టలు పిండుకోవటం,పశువుల్ని కడుక్కోవటం... ఇలా అన్నీ చెరువు చుట్టూనే చేసేవారు!కాని,ఇప్పడు ఆ చెరువే బరువనిపిస్తోంది మనుషులకి!
చెరువులు ప్రతీ సంవత్సరం వానలు పడితేనే బాగా నిండుతాయి.లేకపోతే అవ్వి ఎండిపోయి ఇసుక తేలుతాయి.ఇక్కడే నగరాల్లోని మనిషిలో దుర్బుద్ది బయలుదేరుతోంది.తాను వుండటానికి ఇల్లు,ఆ ఇల్లు కట్టుకోవటానికి ఇసుక రెండూ ఖాళీ అయిన చెరువులోనే చూసుకుంటున్నాడు నగరజీవి.ఫలితంగా చెరువులు క్రమంగా కబ్జా అయిపోతున్నాయి.మిగిలిన చోట్ల ఇసుక తరలించుకుపోతున్నారు.ముందు ముందు ఎప్పుడైనా వర్షం పడ్డా కూడా నీళ్లు నిల్వ వుండకుండా చేస్తున్నారు.
మనిషి చెరువులపై పడి వాటిని చెరిచేయటమే హైద్రాబాద్ లో ప్రస్తుత దుస్థితికి కారణం.ఒకప్పుడు తెలంగాణాలోని అన్ని ప్రాంతాల్లో లాగే ఇక్కడా అనేక చెరువులు వుండేవి.నదులు లేని చోట్లలో అంతా చెరువులే తెలంగాణ ప్రజలకి జీవనాధారం.ప్రస్తుత గ్రేటర్ హైద్రాబాద్ లోని ఆనాటి అనేక పల్లెలు కూడా తమ ఊరి చెరువుతోనే హాయిగా జీవించాయి.కాని,అభివృద్ధి పేరున గత అరవై ఏళ్లలో జరిగిన విధ్వంసమే చెరువుల అదృశ్యానికి కారణం.ఇందుకు ఏ ఒక్క రాజకీయ పార్టీనో,రాజకీయ నేతనో కారణం చేయటం కూడా వృథానే.నగరాల్లో చెరువుల ఆదృశ్యం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోంది.ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్ లో మరీ ఎక్కువ.డెవలప్ మెంట్ స్పాంజీలా చెరువుల్ని పీల్చిపారేస్తుంది!
గతంలో ఏం జరిగినా ఇప్పుడు నవ తెలంగాణ ఆవిర్భావం జరిగింది కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం హైద్రాబాద్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.అసలు కనిపించకుండా మిస్సైపోయిన చెరువులు ఏమయ్యాయో ఆరాతీసి పునరుద్దరించాలి. ఇందుకోసం కొంత వరకూ జనాగ్రహం కూడా తప్పక పోవచ్చు.కాని,నగర క్షేమం దృష్ట్యా అది తప్పుదు.అలాగే,వర్షం కురిస్తే నీరు వేగంగా సిటీ బయటకు వెళ్లేలా డ్రైనేజ్ వ్యవస్థను ఆధునీకరించాలి.నిజాం కాలం నాలాల హైద్రాబాద్ ను నిజమైన పోస్ట్ మాడన్ మెట్రోపాలిస్ గా తీర్చిదిద్దాలి.ఇది బృహత్తర కార్యక్రమం.కేసీఆర్ సర్కార్ ఎంత వరకూ విజయవంతం అవుతుందో చూడాలి...