అప్పుడే రోళ్లు పగులుతున్నాయి!
posted on Mar 15, 2025 11:06AM
.webp)
తెలంగాణలో ఎండలు మండి పోతున్నాయి. ఎప్పుడో మే చివరి వారంలో రోహిణీ కార్తె సందర్భంగా రోళ్లు పగిలే ఎండలు కాస్తాయి అని చెప్పుకోవడం మనకు తెలుసు. అయితే ఈ సారి మాత్రం మార్చి రెండో వారంలోనే రోళ్లు పగిలే స్థాయిలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పుడే 40 డిగ్రీలు దాటేశాయి.
ఆదిలామాద్, నిజామాబాద్ జిల్లాల్లో 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. మరో ఐదు రోజుల పాటు రాష్ట్రంలో హీట్ వేవ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా వాతావరణ శాఖ ఆదిలాబాద్, జగిత్యాల, నిజామాబాద్, కొమురం భీమ్, మంచిర్యాల జిల్లాలలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
వడ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించింది. అలాగే హైదరాబాద్ నగరంలో కూడా సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకూ రాష్ట్రంలో ఇదే వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. మార్చి 20 తరువాత రెండుమూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.