స్కూల్ కు రావాలని బలవంతపెట్టొద్దు.. గురుకులాలు, హాస్టళ్లు తెరవొద్దు!
posted on Aug 31, 2021 11:59AM
తెలంగాణలో స్కూళ్లను తెరవడంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్కూల్ కు కచ్చితంగా హాజరుకావాలంటూ విద్యార్థులను బలవంతం చేయొద్దని ఆదేశించింది. తరగతులకు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దని.. ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. గురుకులాలు, హాస్టళ్లను తెరవొద్దని హైకోర్టు ఆదేశించింది. సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలను పున: ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కరోనా కేసులు తగ్గకపోయినా పాఠశాలలను రీ ఓపెన్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైదరాబాద్‌కు చెందిన ఎం.బాలకృష్ణ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు.. మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఆన్‌లైన్, ప్రత్యక్ష బోధనపై విద్యాసంస్థలే నిర్ణయించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రత్యక్ష బోధన నిర్వహించే పాఠశాలలకు వారంలోపు మార్గదర్శకాలు జారీ చేయాలని విద్యాశాఖను ఆదేశించింది. పాఠశాలలు పాటించాల్సిన మార్గదర్శకాలపై ప్రచారం చేయాలని సూచించింది. గురుకులాలు, హాస్టళ్లలో వసతులపై నివేదిక ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రత్యక్ష బోధనపై పరస్పర విరుద్ధ లాభనష్టాలు ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో ఇంకా కొవిడ్ తీవ్రత కొనసాగుతోందని చెప్పింది. సెప్టెంబరు-అక్టోబరులో కొవిడ్ మూడో దశ ముప్పు హెచ్చరికలు.. మరోవైపు విద్యాసంస్థలు తెరవకపోతే విద్యార్థులు నష్టపోతున్నారన్న అభిప్రాయాలూ ఉన్నాయని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండింటినీ సమన్వయం చేసి చూడాలని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 4కి వాయిదా వేసింది.
కోర్టులో వాదనల సందర్భంగా అన్ని వైద్య సదుపాయాలు ఉన్న అమెరికాలో రోజుకి లక్ష కేసులు పెరుగుతున్నాయని పిటిషనర్ తరపు లాయర్ చెప్పారు. భారతదేశంలో వైద్య సదుపాయాలు లేవని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం లో కూడా అదే పరిస్థితి ఉందన్నారు. చిన్నపిల్లలను పాఠశాలకు పంపే ముందు తల్లిదండ్రులు అండర్ టేకింగ్ ఇవ్వాలని పాఠశాల యాజమాన్యాలు డిమాండ్ చేస్తుయని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం తరుపన వాదనలు వినిపించిన ఏజీ.. UNICEF పాఠశాల తప్పనిసరిగా ఓపెన్ చేయాలి అని చెప్పిందన్నారు. చాలా మంది స్కూల్లో న్యూట్రిషన్ ఫుడ్ మిస్ అవుతున్నారని కోర్టుకు తెలిపారు. స్కూల్లో ఆహార సరఫరా పై డీఈఓ నేతృత్వంలో పర్యవేక్షణలో చేస్తామన్నారు ఏజీ.
ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సెప్టెంబర్ అక్టోబర్ లో కోవిడ్ తీవ్రస్థాయిలో వినిపిస్తుందని నివేదిక అందించిన డబ్ల్యూహెచ్ఓకు ఎం చెపుతారని ప్రశ్నించింది.కోవిడ్ టీకా పూర్తి కాలేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.. అది డిసెంబర్లో పూర్తి చేస్తారని అలాంటప్పుడు ఏవిధంగా వ్యాక్సిన్ లేకుండా పాఠశాలలకు ప్రవేశాన్ని అనుమతి ఇస్తున్నారని ప్రశ్నించింది. ఒకవేళ స్కూల్స్ లో ఉన్న పిల్లలకు ఏమైనా జరిగితే దానికి ఎవరు బాధ్యులు అన్న హైకోర్టు.. చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారు అలాంటప్పుడు అటువంటి పరిస్థితి లో పాఠశాలల మేనేజ్మెంట్ వారి భరిస్తుందా అని నిలదీసింది. పిల్లలను స్కూల్స్ కు పంపకపోతే తల్లిదండ్రుల పైన ఏమైనా చర్యలు తీసుకునే అధికారం మీకు ఉందా అని ప్రశ్నించింది హైకోర్టు.