అమరావతి పరిస్థితిపై హైకోర్టు సీరియస్‌!!

రాజధాని అమరావతి ప్రాంతంలో నెలకొన్న పరిస్థితిపై హైకోర్టు సీరియస్‌ అయింది. మహిళలపై లాఠీచార్జ్‌ ఘటనను కోర్టు సుమోటోగా తీసుకుంది. అమరావతిలో పలు ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 చట్టం విధించిన సంగతి తెలిసిందే. అయితే 144 సెక్షన్ తొలగించాలని హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. తమపై దాడులు చేస్తున్నారని, శాంతియుత నిరసనలకు అనుమతి ఇవ్వడం లేదని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాజధానిలో పోలీసు చట్టాల అమలుపై హైకోర్టు అసంతృప్తి వెలిబుచ్చింది. రాజధానిలో పరిస్థితులకు సంబంధించి పిటిషనర్లు ఇచ్చిన దృశ్యాలను న్యాయమూర్తి పరిశీలించారు. రాజధాని గ్రామాల్లో ఏం జరుగుతోందో అర్ధం కావడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. గ్రామాల్లో పోలీసులు మార్చ్‌ఫాస్ట్‌ చేయడమేంటని ప్రశ్నించింది. కర్ఫ్యూ వాతావరణం ఎందుకు ఉందని హైకోర్టు నిలదీసింది. కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. పూర్తి వివరాలతో శుక్రవారం కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu