ఖాకీలకు మానవత్వం లేదా? అంబులెన్సులు ఆపేస్తారా?
posted on May 11, 2021 12:10PM
తెలంగాణ పోలీసులు మరీ విపరీతంగా ప్రవర్తిస్తున్నారు. కనీస మానవత్వం లేకుండా క్రూరంగా వ్యవహరిస్తున్నారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వస్తున్న ఏపీ కరోనా పేషెంట్లను సరిహద్దుల్లో అడ్డుకుంటున్నారు. వరుసగా రెండో రోజు కూడా తెలంగాణ బోర్డర్‌లో కొవిడ్ అంబులెన్సులను ఆపేస్తున్నారు తెలంగాణ పోలీసులు.
సోమవారం కూడా ఇలానే అంబులెన్సులను ఆపడం కలకలం రేపింది. ఇరు రాష్ట్ర పోలీసులు చర్చించి.. కొన్ని కండిషన్లు పెట్టారు. తమ ఆసుపత్రిలో చికిత్సకు అనుమతించామని హాస్పిటల్స్ వారు ఇచ్చిన లేఖ చూపిస్తేనే.. తెలంగాణలోకి అనుమతిస్తామని నిబంధన పెట్టారు. లెటర్ లేకపోతే.. తమ రాష్ట్రంలోకి నో ఎంట్రీ అంటూ నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. అంబులెన్సులను వెనక్కి తిరిగి పంపించేస్తున్నారు. మంగళవారం పలువురు పేషెంట్స్.. పోలీసులు చెప్పినట్టే హాస్పిటల్స్ వాళ్లు పంపిన లెటర్స్ చూపించినా.. పోలీసులు తెలంగాణలోకి అనుమతించలేదు. లెటర్స్ కాదు.. హాస్పిటల్ ల్యాండ్‌లైన్ నుంచి ఫోన్ వస్తేనే పంపిస్తామంటూ తిరకాసు పెడుతున్నారు.
ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లే కరోనా రోగులను తెలంగాణ పోలీసులు రెండోరోజూ అనుమతించడం లేదు. ఏపీ-తెలంగాణ సరిహద్దు రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద కొవిడ్ రోగులతో వచ్చే అంబులెన్స్‌లను నిలిపివేస్తున్నారు. ఆస్పత్రులు పంపిన అనుమతి పత్రాలు చూపించినా పోలీసులు అంగీకరించడం లేదు. హైదరాబాద్‌లోని ఆస్పత్రుల ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేస్తే తప్ప తెలంగాణలోకి ప్రవేశం లేదని తేల్చిచెబుతున్నారు. అలా ఫోన్లు వచ్చిన వారినే అనుమతిస్తున్నారు. దీంతో గంటల తరబడి రోడ్లపైనే రోగులు, బంధువులు పడిగాపులు కాస్తున్నారు. కొవిడ్ రోగులకు ఏమైనా జరిగితే తెలంగాణ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న రోగులను రక్షించాలని వేడుకుంటున్నారు.
మరోవైపు, సరిహద్దుల్లో అంబులెన్సులను ఆపుతున్న విషయం తెలంగాణ హైకోర్టు దృష్టికి వచ్చింది. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విపత్తు వేళ అంబులెన్స్‌లను నిలిపేయడం మానవత్వమేనా అని ప్రశ్నించింది. ఏ అధికారంతో రాష్ట్ర సరిహద్దుల దగ్గర అంబులెన్స్‌లు ఆపారని ప్రశ్నించింది. హైదరాబాద్‌లో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా.. సరిహద్దుల్లో పోలీసుల తీరు మాత్రం మారలేదు. ఇప్పటికీ ఏపీ నుంచి కొవిడ్ పేషెంట్స్‌తో వస్తున్న అంబులెన్స్‌లను ఖాకీలు అడ్డుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.