వల్లభనేని వంశీ బెయిలు పిటిషన్ విచారణ వాయిదా

విజయవాడ జిల్లా జైల్లో గత రెండు నెలలుగా రిమాండ్‌ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో మరో సారి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ ను కోర్టు వారం రోజులకు వాయిదా వేసింది.  భూ ఆక్రమణ కేసులో తనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ వల్లభనేని  వంశీ దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ పై సోమవారం (ఏప్రిల్ 21) విచారణ జరిపిన హైకోర్టు తదుపరి విచారణను వారం రోజుల పాటు వాయిదా వేసింది.  

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన అనుచరులతో కలిసి బెదిరింపులకు పాల్పడి 8.91 ఎకరాలను విక్రయించారని తేలబ్రోలుకు చెందిన ఎన్‌ శీధర్‌రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు   ఆత్కూరు పోలీసులు వంశీ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అదే కేసులో వంశీ ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.   ఈ కేసులో తనకు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ వంశీ హైకోర్టును ఆశ్రయించారు.   ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ప్రభుత్వ తరఫు న్యాయవాది  ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకోవాలని కోరడంతో కోర్టు విచారణ వాయిదా వేసింది.  

వల్లభనేని వంశీ ఇప్పటికే పలు కేసుల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసుతో పాటు,  గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా ఉన్న సత్యవర్థన్‌ కిడ్నాప్‌ చేశారనే కేసు, భూ ఆక్రమణ కేసులో కూడా ఆయన  రిమాండ్‌ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.