ప్రాచీన కట్టడాలను కూల్చేస్తున్న గుప్తనిధుల బ్యాచ్
posted on Jul 16, 2012 10:35AM
గుప్తనిధుల కోసం వేట కొనసాగుతూనే ఉంది. రాయలసీమ, ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఈ వేట సాగుతోంది. ప్రత్యేకించి కొందరు క్షుద్రపూజలు చేసేవారిని తోడు తీసుకుని ఈ వేట కొనసాగిస్తున్నారు. గుప్తనిధుల కోసం బలులు ఇవ్వటానికి కూడా వెనుకాడటం లేదు. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లోని పురాతన ఆలయాల గురించి పర్యాటకశాఖ పూర్తిస్థాయిలో ప్రచారం చేయటం లేదు. దీంతో పర్యాటకుల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో సత్యసాయిబాబా మరణానంతరం పర్యాటకుల రాక తగ్గింది. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలు సరిహద్దులు కలిసే ఉండటంతో ఏ జిల్లాకు వచ్చినా మిగిలిన ప్రాంతాల్లో ప్రాశస్త్యం ఉన్న ఆలయాలను పర్యాటకులు సందర్శించేవారు.
ఇప్పుడు దాదాపు రాకపోకలే తక్కువ అవటంతో దీన్ని అదునుగా తీసుకుని కొందరు ఈ గుప్తనిధుల వేట కొనసాగిస్తున్నారు. కడపజిల్లా ఒంటిమిట్ట గ్రామంలోని ప్రధానరహదారిపై రామతీర్థం దగ్గర పురాతన మండపం ఉంది. ఈ మండపం ప్రాశస్త్యం తెలిసి తాజాగా ఇక్కడ తవ్వకాలు జరిపారు. గతంలో ఇదే మండపంలోని రాతిగుబ్బను దుండగులు కదిలించారు. ఈ కదిలించిన తీరు చూసిన వారు గుప్తనిధుల వేట కోసమే కదిలించారని ఆనవాళ్లను బట్టి అర్థమవుతోంది. ఇటీవల మండపంలోని పల్లె, మాధవరంలో విగ్రహాలు చోరీకి గురవటం, గుప్తనిధుల కోసం తవ్వకాలు చూస్తున్న కడపజిల్లా వాసులు పురాతన సంపద పరిరక్షణ కోసమైనా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.