సౌచాలయమే అని చిన్నగా చూడకు.. పారిశుద్ధ్యాన్ని పట్టించుకో.. వరల్డ్ టాయిలెట్ డే
posted on Nov 19, 2021 10:57AM
చిన్న సమస్య... కానీ, ప్రపంచం మొత్తాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. నిజానికి ఈ చిన్న సమస్యను ప్రపంచ దేశాలు ఏవీ గుర్తించక ముందే, మన జాతి పిత మహాత్మా గాంధీ గుర్తించారు. పారిశుధ్యం అవసరాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు, “ప్రతి ఒక్కరూ పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి, ఇంటిలోని ఇతర గదుల్లానే మరుగుదొడ్డీ పరిశుభ్రంగా ఉండాలి” అని ఎప్పుడోనే పిలుపు నిచ్చారు గాంధీజీ. అయినా మన దేశం సహా ప్రపంచ దేశాలు ఏవీ ఈ సమస్యను సమస్యగా చూడలేదు. మహత్ముని దార్శనికతను తెలుసుకోలేక పోయాయి. చివరకు పారిశుధ్య సమస్య ప్రపంచ సంక్షోభంగా మారిన తర్వాత గానీ, ప్రపపంచం, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్‌ఓ),ఐక్య రాజ్య సమితి పారిశుధ్యంపై దృష్టిని కేంద్రీకరించలేదు.
అలా చిన్నది అనుకున్న పారిశుధ్య సమస్య, ఇంతై ఇంతింతై ...జడలు విప్పి సమాజంలోని సర్వ రంగాలపైనా ప్రభావం చూపిన తర్వాత గానీ, సమస్య పరిష్కార ప్రయత్నాలు ప్రారంభం కాలేదు.ఈ నేపధ్యంలో ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన పారిశుద్ధ్య సంక్షోభాన్ని అధిగమించడానికి ఐక్యరాజ్య సమితి 2013నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ 19న అంతర్జాతీయ శౌచాలయ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. చిత్రం ఏమంటే, ఎప్పడో దశాబ్దాల క్రితం మహాత్మా గాంధీ ఇచ్చిన, “ప్రతి ఒక్కరూ పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి, ఇంటిలోని ఇతర గదుల్లానే మరుగుదొడ్డీ పరిశుభ్రంగా ఉండాలి” అని ఇచ్చిన పిలుపులోని సందేశం: 'మరుగుదొడ్లను విలువైనవిగా భావించాలి' అన్న నినాదంతో ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా వివిద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మరో వంక మహాత్ముడి దార్శనికతకు అనుగుణంగా మన దేశంలో మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వాల సహకరంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్నినిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా 2014, అక్టోబర్ 2 న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. స్వచ్ఛ భారత్ అభియాన్’గా కూడ పిలిచే ఈ కార్యక్రమం ద్వారా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పెద్ద ఎత్తున జరుగుతోంది. మరుగుదొడ్డి లేకుంటే జీవితానికి భద్రత, గౌరవం ఉండవు, అనే వాస్తవాన్ని ప్రజలు, ప్రభుత్వం కూడా గుర్తించాయి. అంతే కాదు స్త్రీలు, యుక్త వయసు ఆడపిల్లలు గౌరవప్రదంగా జీవించడానికి మరుగుదొడ్డి తోడ్పడుతుంది. గర్భిణులు, బాలింతలు, బహిష్టు సమయంలో మహిళలు మరుగుదొడ్డి లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందనే సత్యాని సమాజం తెలుసుకుంది. నిజానికి ఇవన్నీ అందరికీ అనుభవంలో ఉన్న వ్యధలే, అందుకే స్వచ్చ భారత్ ముఖ్యంగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, వినియోగానికి ప్రపంచ దేశాలన్నీ ప్రధాన్యత ఇస్తున్నాయి.
అయినా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్‌ఓ), యునిసెఫ్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 360కోట్ల మంది ప్రజలకు ఇప్పటికీ సురక్షితమైన పారిశుద్ధ్య సౌకర్యాలు అందుబాటులో లేవు. ఈరోజుకు సుమారు 49.4కోట్ల మంది బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేస్తున్నారు. గత రెండు దశాబ్దాల్లో సుమారు 240 కోట్ల మంది మరుగుదొడ్డి సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికీ మూడింట రెండు వంతుల జనాభాకు ప్రాథమిక పారిశుద్ధ్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం గమనార్హం.
ప్రాధమిక పారిశుద్ధ్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం వలన ఉత్పన్నమయ్యే సమస్యలు, సమాజం మీద చాల చాలా దుష్ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా మహిళల ఎదుగుదలకు ప్రతిబంధకం అవుతున్నాయి. మహిళలు ఎదుర్కుంటున్న సామాజిక,ఆర్థిక,విద్య,వైద్యసమస్యలకు ప్రాధమిక పారిశుద్ధ్య సౌకర్యాలు ముఖ్యంగా మరుగుదొడ్డి సదుపాయం లేక పోవడం ఒక మూలకారణంగా అంతర్జాతీయ సమాజం కొంచెం ఆలస్యంగానే అయినా గుర్తించింది. విద్యాసంస్థల్లో ఆడపిల్లలకు వేరుగా సురక్షితమైన మరుగుదొడ్డి సౌకర్యం లేకపోవడంతో ఎంతోమంది అర్ధాంతరంగా చదువును ఆపేయవలసి వస్తోంది. కొన్ని చోట్ల మహిళలు బహిర్భూమికి వెళ్ళినప్పుడు వారిపై అఘాయిత్యాలు చోటుచేసుకుంటున్నాయి.
పారిశుధ్యం అంటే కేవలం సౌచాలయం మాత్రేమే కాదు, రక్షిత మంచి నీరు, కాలుష్య రహిత ఆవాసాలు, ఇలా ఇంకా అనేక అంశాలు పారిశుధ్యం పరిధిలోకి వస్తాయి. ప్రపంచం మొత్తం మీద రక్షిత తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు లేక అతిసారం బారిన పడి అయిదేళ్లలోపు పిల్లలు వేల సంఖ్యలో చనిపోతున్నారు.
మరో వంక సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో, పారిశుధ్యం ప్రాధాన్యతను సంతరించుకుంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో, ఆరో స్థానంలో ఉన్న అందరికీ పారిశుద్ధ్య సదుపాయాన్ని ఈ దశాబ్దం చివరినాటికి అందించాలంటే ప్రభుత్వాలు నాలుగు రెట్లు అధికంగా పనిచేయాల్సి ఉంటుందని ఐక్యరాజ్య నివేదికలు పేర్కొంటున్నాయి.దేశంలో అనేక మంది పిల్లల్లో శారీరక, మానసిక ఎదుగుదల మందగించడానికీ పారిశుద్ధ్య లోపమే కారణం. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరుగుదొడ్డి వాడకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. దేశంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన నాటి నుంచి 10.83కోట్లు, ఈ ఏడాదిలోనే 8.52లక్షల మరుగుదొడ్లు నిర్మించినట్లు ప్రభుత్వ గణాంకాలు చాటుతున్నాయి. దేశవ్యాప్తంగా 2.62లక్షల పైచిలుకు గ్రామ పంచాయతీలు బహిరంగ మల విసర్జన రహితమని ప్రకటించుకున్నాయి.అయితే, ఇంకా అనేక గ్రామాలే కాదు పట్టణాలలోనో ప్రాధమిక పారిశుధ్య సదుపాయాలు లేని ప్రాంతాలు, అవాసాలు అనేకం ఉన్నాయి. అయితే ఇది కేవలం ప్రభుత్వాల సంకల్పంతో పరిష్కారం అయ్యే సమస్య కాదు. ప్రజల సహకారంతో మాత్రామే సమస్య తీవ్రత తగ్గుతుంది.