హేమంత్ సొరేన్ శాసనసభ సభ్యత్వం రద్దు
posted on Aug 26, 2022 4:52PM
జార్ఖండ్ ముఖ్యమంత్రి, జేఎంఎం చీఫ్ హేమంత్ సొరేన్ శాసన సభ్యత్వాన్ని గవర్నర్ రమేశ్ బయిస్ శుక్రవారం(ఆగష్టు 26) రద్దు చేశారు. సొరేన్ అధికార దుర్వినియోగానికి పాల్పడి, తనకు తానే మైనింగ్ లీజును కేటాయించుకున్నారని, ఆయన శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ నేత రఘుబర్ దాస్ ఫిర్యాదు చేయడంతో, ఎన్నికల కమిషన్ విచారణ జరిపింది. ఇరు పక్షాల వాదనలను విన్నతర్వాత సొరే న్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని గవర్నర్‌కు ఈసీ సిఫారసు చేసింది. దీంతో గవర్నర్ శుక్రవారం సొరేన్ ఎమ్మెల్యే పదవికి అనర్హుడని ప్రకటించారు.
గనుల విషయంలో హేమంత్ సోరెన్‌పై విమర్శల వెల్లువెత్తిన క్రమంలో హేమంత్ వ్యవహార సరళిపై కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ ఫిర్యాదు చేయడం, ఆ ఫిర్యాదును కేంద్రం ఎన్నికల సంఘానికి పంపడం, హేమంత్ శాసన సభ సభ్యత్వం రద్దుకు ఈసీ సిఫారసు చేయడం, ఈసీ సిఫారసు ఆధారంగా హేమంత్ ఎమ్మెల్యే పదవిని రద్దు చేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకోవడం వేగంగా జరిగిపోయాయి. ఈ కీలక పరిణా మం తర్వాత తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు హేమంత్ సోరెన్ ఎలాంటి అడుగు వేస్తారన్నది ఆసక్తి కరంగా మారింది.
గనుల లీజు వ్యవహారంలో హేమంత్ సోరెన్ అక్రమాలకు పాల్పడ్డారని.. ఆయనపై అనర్హత వేటు వేయా లని బీజేపీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆయనపై అనర్హుడిగా ప్రకటించాలని గవర్నర్ రమేష్ బైస్ కి ఈసీ లేఖ రాసినట్లు రాజ్ భవన్ వర్గాలు పేర్కొన్నాయి. కానీ దీనిపై గవర్నర్ గానీ.. రాజ్‌భవన్ గానీ.. అధికారిక ప్రకటన చేయలేదు. గురువారం (ఆగష్టు 25) సాయంత్రం ఢిల్లీ నుంచి రాంచీకి వచ్చారు గవర్నర్. ఈ వ్యవహారంపై 26న కీలక ప్రకటన చేసేరు.
షెల్ కంపెనీలో పెట్టుబడులు పెట్టి భారీగా ఆస్తులు సంపాదించినట్లు సోరెన్ కుటుంబంపై ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై బీజేపీ కూడా గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 9A నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించింది. చట్ట సభ్యుడిగా ఉన్నవారు ప్రభుత్వ కాంట్రాక్ట్‌లు పొందరాదని..దీన్ని ఉల్లంఘిస్తే అనర్హతకు గురవుతారని.. అందువల్ల ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే గవ్నరర్ ఈసీ అభిప్రాయాన్ని కోరగా.. ఈసీ తన స్పందన తెలియజేసింది. అనర్హతకు సిఫారసు చేసినట్లు సమాచారం.