మహోగ్రరూపం దాల్చిన గోదావరి.. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక
posted on Aug 21, 2025 9:28AM

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తోడు.. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కురుస్తున్న వానలకు గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. వరద నీరు పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద గురువారం (ఆగస్టు 21) ఉదయానికి గోదావరి నీటి మట్టం 50.8 అడుగులకు చేరింది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇక ధవళేశ్వరం వద్ద కూడా వరదగోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో కూడా 9.88 లక్షల క్యూసెక్కులుగా ఉంది. మన్యం, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ సూచించింది. ముఖ్యంగా నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.
ఇలా ఉండగా తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి వరద ప్రవాహం ప్రమాద స్థాయికి చేరింది. కాళేశ్వరం సరస్వతీ ఘట్ వద్ద ఏర్పాటు చేసిన జ్ణాన జ్యోతులు నీట మునిగాయి. ఇక్కడ గరిష్ఠ ప్రవాహం 13.460 మీట్లకు కాగా ప్రస్తత పప్రవాహం 12.220 మీటర్లుగా ఉంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాళేశ్వరం తీరం వద్ద ఉన్న దుకాణాలను అధికారులు ఖాళీ చేయించారు. అలాగే ములుగు జిల్లా రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి ప్రవాహం ఉధృతంగా ఉంది. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.