29 నుంచి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు.. ఎన్ని రోజులో తెలుసా?
posted on Dec 26, 2025 2:44PM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు గెజిట్ విడుదలైంది. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం (డిసెంబర్ 29) నుంచి ప్రారంభం కానున్నాయి. ఆ రోజు ఉదయం పదిన్నర గంటలకు ఉభయ సభల సంయుక్త సమావేశం ఉంటుంది. ఈ శీతాకాల సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలన్నది బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో నిర్ణయిస్తారు.
బయట అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు చాలా వేడిగా సాగనున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే. అలాగే, ఎంపీటీసీ, జెడ్పీటీపీ ఎన్నికలు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకు వచ్చే అంశం కూడా సభలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.
ఇక పోతే.. కృష్ణా, గోదావరి నీటి కేటాయింపులకు సంబంధించి, ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శలు, వాటికి అంతే ఘాటుగా రేవంత్ ప్రతివిమర్శలు చేయడమే కాకుండా, అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలంటూ సవాల్ చేయడం నేపథ్యంలో ఈ శీతాకాల సమావేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ముఖ్యంగా కేసీఆర్ సవాల్ ను స్వీకరించి మాజీ ముఖ్యమంత్రి, అసెంబ్లీలో బీఆర్ఎస్ పక్ష నేత అయిన కేసీఆర్ సభకు వస్తారా? లేక డుమ్మా కొడతారా? అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.