హరీష్ బడ్జెట్ నిరాశపరిచింది!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో సోమవారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ సాదాసీదాగా ఉంది. ఎన్నికల సంవత్సరం కావడంతో సంక్షేమానికి పెద్ద పీట వేసినా ఎవరినీ పెద్దగా మెప్పించలేకపోయింది. కొన్ని పథకాలకు కేటాయింపులు పెంచినా, గత బడ్జెట్ కంటే సంక్షేమానికి ఎక్కువ నిధులు కేటాయించినా.. హరీష్ రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ పై పెదవి విరుపులే ఎక్కువగా విపినిస్తున్నాయి.  దళితబంధు, రైతుబంధు, రైతుబీమా స్కీమ్‌లకుఈ సారి కేటాయింపులు పెంచలేదు.

గతంలో సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కేటాయించినా వాటిని విడుదల చేయకపోవడాన్ని ఎత్తి చూపుతే ఈ సారి కేటాయింపులపై నమ్మకం లేదన్న భావన సామాన్యులలో కూడా వ్యక్తమౌతోంది. ఈ ఏడాది రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త పథకాల ప్రకటన, వాటికి కేటాయింపులు ఉంటాయని అంతా ఆశించారు. అయతే హరీష్ రావు కొత్త పథకాల ఊసే తన బడ్జెట్ లో ఎత్తలేదు. 

 . ఇటీవల ముఖ్యమంత్రి ఎక్కడ పర్యటనకు వెళ్ళినా మున్సిపాలిటీలకు, మండలాలకు, నియోజకవర్గాలకు హామీలు గుప్పిస్తున్నరు. అందుకు అనుగుణంగా  బడ్జెట్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్‌కు ఏకంగా  రూ.8,348 కోట్లు ఎక్కువగా కేటాయించారు.  అందువల్ల రాష్ట్రంలో పార్టీ బలహీనంగా ఉన్న చోట నిధులను గుమ్మరించి అభివృద్ధి పనులు చేపట్టడానికి అవకాశం లభించింది. నిరుద్యోగ భృతి, గిరిజనబంధు వంటి పథకాల ఊసే బడ్జెట్ లో కనిపించలేదు.

ఉద్యోగుల్లో ఉన్న వ్యతిరేకతను ఏదో ఒక మేర తగ్గించాలన్న ఉద్దేశంతో కొత్త ఉద్యోగాలకు వెయ్యి కోట్లు కేటాయించారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించనున్నట్లు గత బడ్జెట్‌ సందర్భంగా సీఎం అసెంబ్లీ వేదికగానే హామీ ఇచ్చినా ఇప్పటికీ అమల్లోకి రాలేదు. ఇప్పుడు అదే హామీని మరో సారి ఇచ్చారు. ఇక కేంద్ర తో విభేదాల కారణంగా రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇక్కట్లు బడ్జెట్ లో ప్రతిఫలించాయి.  ఆదాయ వనరుల కోత కారణంగా బడ్జెట్ లో కొత్త సంక్షేమ పథకాలకు అవకాశం లేకుండా పోయింది.  

దళితబంధుకు గతేడాది రూ. 17,700 కోట్లు కేటాయించినా ఒక్క పైసా కూడా విడుదల కాకపోవడానికి కూడా నిధుల కొరతే కారణం.  ఈసారి కూడా దళిత బంధుకు అంతే నిధులు కేటాయించినా విడుదలపై అనుమానాలు ఉన్నాయి.   మొత్తంమీద 2023-24 బడ్జెట్ నిరాశాజనకంగా ఉంది. ఇది విపక్షాల మాటే కాదు. ఆర్థిక రంగ నిపుణుల విశ్లేషణ కూడా. స్వయంగా భారాస శ్రేణులలోనూ ఒకింత అసంతృప్తి వ్యక్తంఅవుతోంది.