పటీదార్ ఉద్యమనేతకు రెండేళ్ల జైలు

2015 జూలైలో హార్దిక్ పటేల్ నేతృత్వంలో గుజరాత్‌ విద్యా, ఉద్యోగాల్లో తమకు ఓబీసీ కేటగిరీ కింద రిజర్వేషన్ కల్పించాలంటూ పటేల్ వర్గీయులు ఆందోళన చేపట్టారు.పెద్ద ఎత్తున ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేశారు.ఈ ఆందోళనతో హార్దిక్‌ పటేల్‌ నాయకుడిగా ఎదిగారు.అప్పుడు జరిగిన ఆందోళనల నేపథ్యంలో హార్దిక్‌పై దేశద్రోహం, తదితర కేసులు నమోదయ్యాయి. 2015 అక్టోబరులో హార్దిక్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మెహ్‌సనా జిల్లాలోకి వెళ్లకుండా గుజరాత్‌ హైకోర్టు నిషేధం విధించింది.

 

 

గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కోర్టు నిషేధం ఎత్తేసింది.అల్లర్లకు సంబంధించిన కేసులో హార్దిక్‌ పటేల్‌ దోషిగా తేలడంతో కోర్టు అతడికి శిక్ష విధించింది. భాజపా ఎమ్మెల్యే కార్యాలయాన్ని తగలబెట్టడం, అక్కడ అల్లర్లు సృష్టించిన కేసులో హార్దిక్‌ దోషిగా తేలాడు. ఈ కేసులో 17 మంది నిందితులుగా ఉండగా, మెహసనాలోని కోర్టు ముగ్గురుని దోషులుగా తేల్చింది. హార్దిక్‌తో పాటు సర్దార్‌ పటేల్‌ గ్రూప్‌ నేత లాల్జి పటేల్‌కి కూడా రెండేళ్ల జైలు శిక్ష, రూ.50వేల జరిమానా విధించింది.కాగా కోర్టు తీర్పు వెలువడగానే హార్దిక్ పటేల్ తరపు న్యాయవాది బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసినట్టు సమాచారం.