గుర్ మెహర్ ... గురి తప్పిన అభ్యుదయవాద బాణం!

 

ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్... ఇప్పుడు ఇది మన దేశ రాజకీయాల్లో మీడియా, మేధావులు, విద్యార్థులు ప్రయోగించే అణుబాంబులా మారిపోయింది! వున్నట్టుండీ జాతీయ రాజకీయాల్లో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్ బాంబు పేలుతుంది. అంతే కొన్నాళ్ల పాటూ మిగతా విషయాలన్నీ మర్చిపోయి ఇంగ్లీషు మీడియా భావప్రకటనా స్వేచ్ఛ అనే పూనకంతో ఊగిపోతుంది! మరో కొత్త మసాలా ఐటెం దొరకగానే దాని వెంట పడి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్ను వదిలేస్తుంది! మోదీ ప్రధాని అయినప్పట్నుంచీ ఇదే తంతూ!

 

నమో ప్రధాని కావటం చాలా మందికి ఇష్టం లేదన్నది మనకు తెలిసిందే. కాని, ఆయన సామాన్యుల మద్దతుతో పీఎం అయ్యారు. బీజేపి పాలక పక్షం అయింది. ఇది ఎందుకోగాని ఇప్పటికీ కొన్ని సంస్థలు, సంఘాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. కొందరు మోదీ, కాషాయ వ్యతిరేకులు తమ అసహనంలో భాగంగా ఎంతకైనా తెగిస్తున్నారు. అలాంటి ఒక ఆవేశపూరిత యువతే... గుర్ మెహర్ కౌర్! ఎవరీమే అంటారేమో... ఇంగ్లీషు మీడియాలో ఈమె పేరు మీద నానా రచ్చ జరిగిపోయింది గత కొన్ని రోజుల్లో!

 

'' మా నాన్నని పాకిస్తాన్ చంపలేదు. యుద్ధం బలితీసుకుంది! '' ఇదీ తనని తాను అమర సైనికుడి కూతురుగా ప్రకటించుకున్న ఇరవై ఏళ్ల గుర్ మెహర్ కౌర్ ఇంటర్నెట్ లో చేసిన వ్యాఖ్య! అసలు కార్గిల్ యుద్ధంలో పాకీల చేతిలో చనిపోయిన ఒక అమరుడి కూతురు మాట్లాడాల్సిన మాటలేనా అవి? కార్గిల్ అమర వీరుల్ని పాకిస్తాన్ కాకుంటే ఎవరు చంపినట్టు? యుద్ధం పాకిస్తాన్ కాక ఇండియా మొదలు పెట్టిందా? పిచ్చెక్కిన మాటలు కాకపోతే గుర్ మెహర్ కౌర్ స్టేట్టెంట్స్ కి అర్థం ఏంటి? చాలా మందికి వచ్చినట్టే పిచ్చి కోపం వీరేంద్ర సెహ్వాగ్ కి కూడా వచ్చింది. కాబట్టే, ఆయన కూడా ఆన్ లైన్లో గుర్ మెహర్ కౌర్ ని ఘాటుగా విమర్శించాడు. '' నేను ట్రిపుల్ సెంచరీ చేయలేదు. నా బ్యాట్ చేసింది '' అంటూ వెటకారం చేశాడు! సెహ్వాగ్ కి సపోర్ట్ గా నిలిచిన బాలీవుడ్ హీరో రణదీప్ హూడా మరింత ప్రచారం కల్పించాడు! అంతే, కొన్ని గంటల్లో పాకిస్తాన్ ను సమర్థించిన గుర్ మెహర్ కౌర్ దారుణంగా ట్రాల్ అయిపోయింది సోషల్ మీడియాలో!

 

ఇంతకీ, ఒక అమర సైనికుడి కూతురైన గుర్ మెహర్ ఎందుకు రచ్చలోకి దిగింది? ఆ మధ్య ఢిల్లీలోని జేఎన్ యూలో జాతి వ్యతిరేక నినాదాలు, సభలు, సమావేశాలు నిర్వహించిన ఉమర్ ఖలీద్ గుర్తున్నాడా? కన్నయ్యాతో పాటూ దేశ ద్రోహం కేసు ఎదుర్కొన్న ఆయన పార్లమెంట్ పై దాడిలో దోషిగా తేలిన అఫ్జల్ గురుకు వీరాభిమాని. ఆయనగార్ని ఢిల్లీలోని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధిపత్యం వున్న మరో కాలేజీకి ఆహ్వానించారు. అక్కడ స్పీచ్ ఇవ్వమని కోరారు. ఇది తెలుసుకున్న ఏబీవీపి సహజంగానే రంగంలోకి దిగి తడాఖా చూపింది. అయితే, బీజేపి అనుబంధ విద్యార్థి సంఘం భౌతిక దాడులు కూడా చేయటం చాలా దారుణం. కాని, అంతే దుర్మార్గం ఉమర్ ఖలీద్ ను సభలు, సమావేశాలకు ఆహ్వానించి ఉపన్యసించమనటం! ఆతను ఇంకా నిర్దోషి అని కోర్టులు క్లీన్ చిట్ ఇవ్వలేదు. అటువంటి దేశ ద్రోహ కేసులు ఎదుర్కొంటోన్న వ్యక్తిని ముఖ్య అతిథిగా పిలవటం.... నిజంగా సమంజసం కాదు.

 

ఉమర్ ఖలీద్ ను మాట్లాడనివ్వకపోటంతో గుర్ మెహర్ కౌర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్ బాంబు పేల్చింది. వెంటనే ఎన్డీటీవీ లాంటి మోదీ వ్యతిరేక మీడియా ఆమెను ఓవర్ నైట్ సెలబ్రిటీని చేసింది. ఇరవై ఏళ్ల ఆమె తెలిసో తెలియకో వివాదంలో కాలుపెడితే దాన్ని భూతద్దంలో చూపటమే కాకుండా... పదే పదే అమర సైనికుడి కూతురంటూ కలరింగ్ ఇచ్చేశారు సో కాల్డ్ జర్నలిస్టులు. ఆమె మాట్లాడిన ట్రాష్ కన్నా ఆమె జవాను కూతురన్న విషయమే హైలైట్ అయింది! అందుకే, ఆమె తన తండ్రి పాకిస్తాన్ చంపలేదంటే చాలా మంది కడుపు మండిపోయింది! పైగా ఉమర్ ఖలీద్ లాంటి కేసులు ఎదుర్కొంటోన్న వ్యక్తికి భావప్రకటనా స్వాతంత్ర్యం వుంటుందని చెబుతోన్న గుర్ మెహర్ సెహ్వాగ్, రణదీప్ హూడా లాంటి వారు తన గురించి జోక్ చేస్తే మాత్రం తట్టుకోలేకపోయింది. వారు సోషల్ మీడియాలో ట్రాల్ చేయటం వల్ల తనకు రేప్, మర్డర్ థ్రెట్స్ వస్తున్నాయని మీడియా ముందుకొచ్చింది. నిజంగా అలాంటివి వస్తే నేరుగా ఆధారాలతో సహా ఢిల్లీ పోలీసుల వద్దకి ప్రొటెక్షన్ కోసం వెళ్లాలి! కాని, అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలో వుండే ఢిల్లీ మహిళా కమిషన్ దగ్గరికి వెళ్లింది! దీంట్లో మతలబు ఏంటి? ఏమీ లేదు... గుర్ మెహర్ కౌర్ ఆప్ అభిమాని, కార్యకర్త! అసలు ట్విస్ట్ అంతా ఈ ఒక్క రహస్యంలో వుంది!

 

ఒక సైనికుడు దేశం కోసం అమరుడు అవ్వటం అత్యంత గొప్ప విషయం. కాని, అతని కూతురు ఆ త్యాగన్ని అడ్డుపెట్టుకుని పాకిస్తాన్ ను వెనకేసుకురావటం పరమ దారుణమైన అంశం. మామూలు వారు పాక్ కు అనుకూలంగా మాట్లాడితేనే రియాక్షన్ సీరియస్ గా వుంటుంది. అటువంటిది ఒక అమరుడి వారసురాలు తన ఇష్టానుసారం మాట్లాడితే... ఫలితం రెట్టింపు వుంటుంది. ఆఫ్ట్రాల్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్ గుర్ మెహర్ కౌర్, ఆమెను సమర్థించే వారికే కాదు... వ్యతిరేకించే వారికి కూడా వుంటుంది కదా!