తెలుగులోనూ జీవోలు.. కూటమి ప్రభుత్వం నిర్ణయం
posted on Feb 5, 2025 10:08AM

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పాలనలో తెలుగుకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంత వరకూ జీవోలన్నీ ఇంగ్లీషులోనే వచ్చేవి. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులోనూ జారీ చేయాలని నిర్ణయించింది. ఇంగ్లీష్ తో పాటు తెలుగు భాషలోనూ ప్రభుత్వ జీవోలు జారీ చేయాలని నిర్ణయించింది. వాస్తవానికి ఈ నిర్ణయం జనవరి నుంచే అమలు కావాల్సి ఉన్నప్పటికీ సాంకేతిక కారణాల కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు ఆ ప్రక్రియ మొదలైంది. తాజాగా రాష్ట్ర హోంశాఖ ఓ ఖైదీని పెరోల్ పై విడుదల చేయడానికి సంబంధించిన జీవోను ఇంగ్లీషుతో పాటు తెలుగులోనూ జారీ చేసింది.
ఇక నుంచి ప్రభుత్వం నుంచి విడుదలయ్యే ప్రతి జీవో తొలుత ఇంగ్లీషులో విడుదల అవుతుంది. ఆ తరువాత రెండు రోజుల వ్యవధిలో అదే జీవో తెలుగులోనూ విడుదల కానుంది. ప్రభుత్వం నిర్ణయంపై తెలుగు భాషాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.