గ్రీట్ వే అమెరికా ప్రచార కర్తగా డా॥గజల్ శ్రీనివాస్ నియామకం
posted on Jun 27, 2015 4:56PM

ప్రఖ్యాత గజల్ గాయకుడు, ట్రిపుల్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ప్రపంచ శాంతి ప్రచారకుడు అయిన డా॥ గజల్ శ్రీనివాస్ ను అమెరికా లోని ప్రముఖ గ్రీటింగ్ కార్డు తయారీ సంస్థ గ్రీట్ వే (Greetway Inc) తమ సంస్థ ప్రచార కర్తగా నియమించారు. గజల్ శ్రీనివాస్ గ్రీటవే ప్రచార కర్తగా 2015 నుండి 2018 వరకు, మూడు సంవత్సరములు కొనసాగుతారని గ్రీట్ వే మార్కెటింగ్ అధినేత జేర్మి డాసన్ తెలిపారు.
డా॥ గజల్ శ్రీనివాస్ ప్రచార కార్య కర్తగా వుంటూ, వివిధ దేశాలు పర్యటించి 18 సంవతరములలోపు బాలబాలికలు , యువతీ యువకులకు చిత్ర లేఖన పోటీలు, సదస్సులు, ప్రదర్శనలు నిర్వహించి వారిలోని ప్రతిభా కౌశలాన్ని పైకి తీసుకు వస్తూ, వివిధ దేశాల మధ్య శాంతి సుహృద్భావ స్నేహ బంధాలను పెంపొందిచే లాగా కృషిచేస్తారు.
గ్రీట్ వే (Greetway Inc) సంస్థ ఫౌండేషన్ ద్వారా భారత దేశం లో మారు మూల ప్రాంతాలలో ఉన్న పాఠశాలల్లో మౌలిక సదుపాయాల రూపకల్పన కోసం డా॥ గజల్ శ్రీనివాస్ కృషి చేస్తారని సంస్థ అధినేత వడలి రమేష్ తెలిపారు.
ఇందులో భాగంగా పోటీలను నిర్వహించి బాల బాలికలు, యువతీ యువకులకు ప్రోత్సాహకరమైన నగదు బహుమతులు, వివిధ దేశాలలో శిక్షణా కార్యక్రమాలు అందచేస్తారని తెలిపారు. త్వరలో భారత దేశములో ఢిల్లీ , హైదరబాద్ నగరాలలో కార్యాలయాల ప్రారంభానికి కృషి చేస్తున్నామని జేర్మి డాసన్ తెలిపారు.