అమరగాయకుడు

 

 

 

ఆయన స్వరం షడ్జమం, ఆ రాగం రిషభం,ఆ సుమధుర గానం.. గాంధారం, ఆ గాన మాధుర్యం మధ్యమం, ఆయన పాట పంచమం, ఆయన కంఠం పలికించే ధ్వని దైవతం, ఆయన స్వరంలో ప్రతిఫలించే నాదం నిషాదం, ఇలా సప్తస్వరాలను తన గాన మాధుర్యంలో కట్టిపడేసిన అమరగాయకుడు ఘంటసాల..

 

ఆయన పాడని పాట లేదు.. ఆయన పాడలేని పాటా లేదు.. అందుకే ఆయన తెలుగుతెరను ఏళిన గాయకుడు, తెలుగు సంగీతానికి దిశా నిర్ధేశం చేసిన అమరుడు. భక్తి గీతమైన విరహగీతమైన, అల్లరి పాటైనా, ఆర్థతతో పాడే పాట అయిన ఆయన గొంతులో  ఆ భావం ప్రస్పుటంగా కనిపిస్తుంది. అందుకే ఆయన తెలుగు సినిమా సంగీత ప్రపంచంలో మరే గాయకుడు అందుకోలేని అత్యున్నత శిఖరాలను అధిరోహించాడు.



ఘంటసాలగా ప్రఖ్యాతి గాంచిన ఘంటసాల వెంకటేశ్వరరావు 1922 డిసెంబర్‌ 4న గుడివాడ సమీపంలోని చౌటుపల్లి గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి మృదంగం వాయిస్తూ భజనలు చేసేవారు. అలా తండ్రి నుంచి సంక్రమించిన సంగీత జ్ఞానానికి ఆయన మరింత పదును పెట్టారు. తండ్రి మరణిస్తూ తనను గొప్ప సంగీత విధ్వాంసుడు కావాలని కోరటంతో అదే తన జీవిత ఆశయంగా ఆయన సంగీత సాగరానికి మధించి అమృతగానం పలికించారు.


1944లొ తన మేనకొడలైన సావిత్రిని వివాహం చేసుకున్నారు ఘంటసాల.. ఆమెరాకతొనే ఘంటసాల జీవితంలోకి అదృష్టం కూడా కలిసి వచ్చింది. తన పెళ్లిలో  తానే కచేరి చేసి అందరిని ఆశ్చర్యపరిచిన ఘంటసాల ఆ పెళ్లి వచ్చిన సముద్రాల రాఘవాచార్యుల దృష్టిలో పడ్డారు. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. సముద్రాల ప్రొత్సాహంతో సినీగాయకునిగా మారారు ఘంటసాల.


తరువాత ఎన్నో సినిమాల్లో పాటలు పాడారు ఘంటసాల, కాని ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు లేదు. కానీ తెలుగు పాటకు మకుటంలా భాసిల్లాల్సిన ఆయనన్ను కాలం అలా ఆగిపోనివ్వలేదు. 1955లో పాతాలభైరవి సినిమా విడుదలైంది. ఈ ఒక్క సినిమాతోనే ఘంటసాల పేరు ఆంద్ర దేశమంతా మారు మ్రోగిపోయింది. తరువాత వరుసగా మల్లీశ్వరీ, దేవదాసు, మాయాబజార్‌, శ్రీవెంకటేశ్వర మహత్యం లాంటి సినిమాతో ఆయన కీర్తి హిమశిఖరాలను తాకింది.


అప్పటి నుంచి దాదాపు 30 ఏళ్ల పాటు వెండితెర మీద ఘంటసాల శకం నడిచింది. భక్తి రస చిత్రమయినా, యాక్షన్‌ సినిమా అయినా, ఫ్యామిలీ డ్రామా అయినా ఎలాంటి సినిమా అయినా గాయకుడు మాత్రం ఘంటసాలే.. అలా తెలుగు పాటకు పర్యాయపదంగా మారారు ఘంటసాల.


అయితే 1969లో మాత్రం ఆ గాత్రం అలసిపోయింది. అప్పటి నుంచి ఆయన తరుచూ అనారోగ్యానికి గురవుతుండటంతో పాటలు పాడటం తగ్గించారు. అదే సమయంలో విదేశాల్లో ప్రదర్శనలు కూడా ఇవ్వడంతో శారీరకంగా చాలా అలసిపోయారు. అంత అలసి పోయాక కూడా ఆయన భగవద్గీత గానం చేసి తెలుగు జాతికి తరగని స్వర సంపవను అందించారు. కాని ఎంతటి పవిత్ర ప్రవాహమైనా ఎక్కడో ఒక చోట ఆగిపోవాల్సిందే. అందుకే వెండితెర అమృతదారలను సృష్టించిన ఘంటసాల స్వరప్రవాహం 1974 ఫిబ్రవరి 11న ఆగిపోయింది. ఎన్నాళ్లకు తరగని అపార గాన మాధుర్యాన్ని మనకందించి ఆయన మాత్రం  తిరిగిరాని లోకాలకు తరలిపోయారు.


తెలుగు జాతికి తెలుగు పాటు జాతీయ స్థాయిలో సమున్నత స్థానం కల్పించిన అమరగాయకుడు ఘంటసాల గారిని ఈ అక్షరనివాళిని అర్పిస్తుంది తెలుగువన్‌.. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu