గార్డెనింగ్‌తో ఆరోగ్యం!

 

ఉరుకులు పరుగులు పెట్టే జీవితంలో ఎవ్వరికీ నిమిషం ఖాళీ ఉండటం లేదు. ఇంత వేగంగా సాగే జీవితంలోనూ మొక్కలని పెంచడం అంటే ఇష్టపడేవారు లేకపోలేదు. ఇంటి పెరడులో ఏ కాస్త జాగా ఉన్నా, రోజులో ఏ మాత్రం ఖాళీ ఉన్నా... తోటపనిలో తృప్తిని పొందేవారు కనిపించకపోరు. కానీ తోటపని అనేది కేవలం ఒక వ్యాపకం మాత్రమే కాదనీ, అద్భుతమైన ఆరోగ్యాన్ని సాధించే మార్గం అని అంటున్నారు నిపుణులు. నమ్మనివారి కోసం చాలా కారణాలనే చూపిస్తున్నారు.

 

ప్రశాంతత లభిస్తుంది:  నెదర్లాండ్స్‌ చెందిన కొందరు నిపుణులు ఆ మధ్య ఒక పరిశోధనను చేశారు. అందులో భాగంగా రోజులో ఒక అరగంటపాటు కొందరిని తోటపని చేయమని, మరికొందరిని ఇంట్లోనే ఉండి చదువుకోమనీ చెప్పారు. ఫలితం! తోటపని చేసిన వారి మనసు చాలా ఉల్లాసంగా మారిపోయిందట. పైగా మానసిక ఒత్తిడి కారణంగా ఉత్పత్తి అయ్యే ‘కార్టిసాల్‌’ అనే రసాయనం కూడా వీరిలో తగ్గుముఖం పట్టిందట. ఊబకాయం నుంచి గుండెజబ్బుల వరకూ నానారకాల అనారోగ్య సమస్యలకూ ఈ కార్టిసాల్‌ ఓ కారణం! దీనిని బట్టి తోటపని అమితమైన ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కలిగిస్తుందని తేలిపోయింది.

 

అధిక వ్యాయామం:  చాలామంది నడక, సైక్లింగ్‌, ఈత వంటి వ్యాయామాలే అత్యద్భుత ఫలితాలు ఇస్తాయని అనుకుంటారు. కానీ తోటపని ఒకటి ఉందన్న విషయం మర్చిపోతారు. తోటపనిలో మట్టిని తవ్విపోయడం, పాదులు కట్టడం, మొక్కలు నాటడం, కలుపుని ఏరివేయడం... ఇలా చాలా పనే చేయవలసి ఉంటుంది. దీని వల్ల శరీరానికి కావల్సినంత వ్యాయామం లభిస్తుంది. పైగా ఈ తోటపని చేసే సమయంలో కళ్ల దగ్గర్నుంచీ వేళ్ల వరకూ ప్రతీ అవయవమూ నేర్పుగా పనిచేయాల్సి ఉంటుంది. అంటే శరీరంలోని ప్రతిభాగానికీ ఇది చురుకుదనాన్ని అందిస్తుందన్నమాట! పైగా శరీరం ఎటు పడితే అటుగా వంగే నేర్పునీ అలవరుస్తుంది.

 

విటమిన్‌ డి:  శరీరానికి ప్రకృతి సిద్ధంగా సూర్యరశ్మి నుంచి లభించే పోషకం- విటమిన్‌ ‘డి’. కానీ నాలుగు గోడల మధ్యనే ఉండిపోతున్న జీవనశైలి వల్ల ఈ డి విటమిన్‌ కూడా ఇప్పుడు మనకి దూరమవుతోంది. దీంతో శరీరానికి అవసరమయ్యే కాల్షియంను శోషించుకునే శక్తిని కోల్పోతున్నాము. చర్మవ్యాధుల దగ్గర్నుంచీ చక్కెర వ్యాధి వరకూ... చాలా సమస్యలని అదుపులో ఉంచేందుకు డి విటమిన్‌ అత్యవసరం. తరచూ తోటపని చేయడం వల్ల ఈ డి విటమిన్ మనకు కావల్సినంతగా లభించే అవకాశం ఉంది.

 

మెదడుకీ మంచిదే!:  తోటపనిలో కేవలం శరీరం మాత్రమే కాదు... మెదడు కూడా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి వృద్ధాప్యంతో పాటు వచ్చే అల్జీమర్స్‌, మతిమరపు వంటి సమస్యలకి తోటపని చాలా ఉపయుక్తమట! తోటపని చేసే అలవాటు లేనివారితో పోలిస్తే, ఆ అలవాటు ఉన్నవారిలో మతిమరపు సమస్య దాదాపు 47 శాతం తక్కువగా ఉన్నట్లు ఓ పరిశోధనలో తేలింది.

 

సంతృప్తి:  తోటపని చేసేవారిలో..... తాము ఒక మొక్కకి జీవం పోసామన్న సంతృప్తి, ఆ మొక్కలు పెరుగుతున్నప్పుడు కలిగే సంతోషం ఏ ఆస్తిపాస్తులకీ తీసిపోవు. ఇక తాము నాటిన చెట్ల నుంచి సహజసిద్ధంగా లభించే కూరగాయలు తిన్నప్పుడు ఎలాంటి అనారోగ్యమూ దరిచేరదు. చెట్లని పెంచడం, వాటి మధ్య ఉండటం... మనిషికి తాను కూడా ప్రకృతిలో ఒక భాగం అన్న భావనను కలిగిస్తుంది. ప్రకృతితో ఉండే ఆ అనుబంధంతో అతని ఆయుష్షు మరింతగా పెరుగుతుంది.

 

- నిర్జర.