వడ్డించేవాడు మనోడయితే

 

వడ్డించేవాడు మనోడయితే మనం ఏమూల కూర్చొన్నా అందవలసినవి అన్నీసవ్యంగా అందిపోతాయని ఊరికే అనలేదు పెద్దలు.

 

ప్రజాసేవ అంటూ ముందు కొన్నిసేవాకార్యక్రమాలు చేప్పటడం, కొంచెం ప్రజలలో పాపులారిటీ పెరిగిన తరువాత మెల్లగా రాజకీయాలలోకి అడుగుపెట్టడం, ఆ తరువాత ఏరాజకీయ పార్టీనో ఆశ్రయించి మెల్లగా పార్టీటికెట్ దక్కించుకోవడం, ఆ తరువాత ఇక తన ‘స్వయంసేవ’ మొదలుపెట్టుకొని కోట్లుకూడవేసుకొంటూ, దొరికిన కాడికి భూములు పోగేసుకోవడం, మంత్రిపదవి కోసం లాబీయింగ్ చేసుకొని మరింత పై......కి ఎదగడం, ఇదే ప్రస్తుతo ప్రతీ రాజకీయనాయకుడి ఫార్మాట్. ఈ పద్దతిలో ముందుకు సాగిపోయిన వారు మాత్రమే ‘ప్రజాసేవ’లో ఆరితెరినవారుగా పరిగనించబడుతారు.

 

మిగిలిన వాళ్ళు సిద్దాంతాలు, ఆదర్శాలూ అంటూ ‘ఈల’ వేసుకొంటూ కాలక్షేపం చేయవలసిందే తప్ప మరో దారిలేదు. ఎవరో ఒకరిద్దరు మాత్రం నిరాడంబర జీవితం గడుపుతూ ‘ప్రజలకు సేవ’ చేసుకొంటూ రాజకీయ అప్రయోజకులుగా మిగిలిపోతారు. అటువంటి వారిని పార్టీలూ పట్టించుకోవు, ప్రజలు కూడా పట్టించుకోరు.

 

ఇప్పటి లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం ఒక రాజకీయ నాయకుడు (ప్రజాసేవలో నిమగ్నమయినవాడు) ఎన్ని కోట్లు పోగేసుకొంటే అంత గొప్పనాయకుడు. ఎన్ని కుంభాకొణాలలో అతని పేరు కనబడితే అంత ‘ఫేమస్ పర్సనాలిటీ.’ జైలుకి కూడా వెళ్ళి వస్తే అదో ప్రత్యెక అర్హత కింద లెక్క. ఇందులో సిగ్గు పడేందుకు ఏమిలేదు. సిగ్గూలజ్జా అనుకోవలసిన అవసరం అంతకంటే లేదు. ఎటువంటి వారినయినా కుల ప్రతిపాదికనో లేక వేరే మరేదో ప్రాతిపదికనో నెత్తినపెట్టుకు మోసే ప్రజలకి మన దేశంలో కరువు లేదు.

 

విజయ చిహ్నంగా రెండు వ్రేళ్ళూ ఊపుతూ బహుఠీవిగా కోర్టులకీ, జైళ్ళకీ తిరుగుతూ కూడా నెగ్గుకు రావచ్చును. నిజం చెప్పాలంటే అప్పటినుండే ప్రజలు, మీడియా కూడా అతనిని అసలు సిసలయిన రాజకీయ నాయకుడిగా గుర్తించడం మొదలు పెడతారు. అప్పుడే అతనికి అటు రాజకీయ పార్టీలు, ప్రజలు వీలయినచోట ప్రభుత్వమూ కూడా అండగా నిలబడతారు. ఈ తర్కానికి మద్దతుగా ఇక్కడ ఒక మోటు సామెత చెప్పుకోక తప్పదు. తేనే తీసేవాడు చేయి నాకడా? అనట్లు, అధికారంలో ఉన్నవాడు కాకపొతే విపక్షం లో ఉన్నవాడు వెనకేసుకొంటాడా అనే లాజిక్ ని కూడా బాగా వంట బట్టిన్చుకొన్నారు ప్రజలు. అధికారంలో ఉన్న నాయకుడు తన పదవిని తనకోసం వాడుకోవడంలో తప్పేమిటో? అని గునిసే ప్రజలు మనకి చాలామందే ఉన్నారు. ఈ విదంగా పరిణతి చెందిన ప్రజలు మనకి ఉన్నపుడు ఇక ఏ రాజకీయనయకుడయినా ఆత్మాన్యునతతో ఎందుకు బాద పడాలి?

 

కమింగ్ టూ పాయింట్ ఈ సారి చర్చ మన గౌరవమంత్రివర్యులు శ్రీమాన్ గంట శ్రీనివాసరావు గారి వ్యాపార సంస్తలు, వాటి అభివృద్దికి ఆయన కష్టపడుతున్న తీరు గురించి. కొద్ది నెలల క్రితమే ఆయన విజయవాడ కృష్ణనది మద్యనున్న భవానీ ఐల్యాండ్ ని తన ‘ప్రత్యుషా కంపెనీ’ ద్వారా సొంతం (లీజు అని మరో పేరు పెట్టారు దానికి) చేసుకోవడాన్ని ప్రజలు ముక్కున వేలేసుకొని చూస్తూ ఉండిపోయారు.

 

మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఇందిరమ్మ బాటపట్టి విశాఖకి వచ్చినప్పుడు, ప్రతిపక్షాలు మంత్రిగారికి చెందిన ప్రత్యుషా కంపెనీకి నగరం నడిబొడ్డునఉన్న కోట్లువిలువ చేసే ప్రభుత్వ గ్రంధాలయం ౩౩సం.లు లీజుపై (స్వంతం చేసుకోవడాన్ని) ఇవ్వడాన్ని ఆపేక్షిస్తూ ముఖ్యమంత్రికి ఒక వినతి పత్రం ఇవ్వబోయారు. బి.ఓ.టి.(బిల్ట్-ఆపరేట్-ట్రాన్స్ ఫర్) ప్రాతిపాదికన ప్రభుత్వమే అతనికి విలువయిన గ్రంధాలయభూమిని అప్పజేప్పడాన్ని ప్రశ్నిస్తూ ముఖ్యమంత్రికి వినతిపత్రం ఈయబోయారు. ప్రజోపయోగమయిన అటువంటి విలువయిన భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఈవిదంగా ధారాదత్తం చేయడం మంచికాదని చెప్పబోయారు.

 

గానీ ముందే అనుకొనట్లు వడ్డించేవాడు మనోడయితే.....ప్రభుత్వభూములేమిటి పరిశ్రమల పేరిట పొలాలు, కొండలను కూడా బొంచేసేయవచ్చును అని గతంలోనే చాలామంది నిరూపించేరు గనుక ముఖ్యమంత్రి బహుశః దానినే ప్రాతిపదికగా తీసుకొంటున్నట్లు ‘దానికో ప్రత్యేక కమిటీ వేసాము కదా అదే ఈ వ్యవహారాలు చుసుకొంటుoది’ అని తేలికగా తీసి పడేసి పక్కన కూర్చొన్న గంటా వారిని ఆనందభరితుడ్ని చేసారు. అప్పుడు గంటావారు కూడా ఒట్టిపుణ్యానికే ప్రతిపక్షాలవారు ప్రతీచిన్నవిషయాన్ని(భూమి ఖరీదు రూ.50కోట్లు మాత్రమే గాబట్టి) రాజకీయం చేయాలని చూస్తున్నారని గట్టిగా ఖండించి ముసి ముసి నవ్వులు నవ్వుతూ తన ‘కాంగ్రెస్ హస్తం’ దులుపు కొన్నారు.