ఎదురుదాడికి జగన్ కు ఇక మిగిలింది ఎన్నికల సంఘమే!

ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శరంగా జరుగుతాయన్న నమ్మకం జగన్ లో పోయింది. తనకు అనుకూలంగా, తన అనుకూల అధికారుల కనుసన్నలలో, తన కోసం తానే సృష్టించుకున్న వాలంటీర్ల వ్యవస్థ ఆధ్వర్యంలో స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాల్సిన ఎన్నికలను ఎన్నికల సంఘం చర్యల కారణంగా భ్రష్టుపట్టిపోతున్నాయని జనగ్ ఇప్పుడు ఊరూవాడా కోడై కూస్తున్నారు. పాపం ఆయనకు ఎన్నికలు తను అనుకున్నట్లు సక్రమంగా జరుగుతాయన్న నమ్మకం రోజు రోజుకూ సన్నగిల్లిపోతోందట. 2019లోనే ఎన్నికలు కూడా ఆయన కోరుకున్న విధంగా సక్రమంగా జరిగాయి. అప్పుడు జగన్ ప్రతిపక్షంలో ఉన్నా కూడా అంతా తాననుకున్నట్లే, తనకు కావలసినట్లే ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా తనకు కావలసిన విధంగా ఎన్నికలు సక్రమంగా సజావుగా జరగడం లేదు. రాష్ట్రంలో మెజారిటీ అధికారులు తాను చెప్పిందల్లా చేస్తుంటే.. ఈ ఎన్నికల సంఘానికి ఏం వచ్చింది. ఇష్టారీతిన అధికారులను మార్చేస్తోంది. అదీ విపక్ష కూటమి నేతల ఫిర్యాదులకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం ఆయనకు సుతరామూ నచ్చడం లేదు. అందుకే ఆయన ఎన్నికలలో విజయంపైనా నమ్మకం కోల్పోయారు. ఎన్నికలు సజావుగా జరుగవన్న నిశ్చయానికీ వచ్చేశారు. ఎన్నికల సంఘం ఇష్టానుసారంగా అధికారులను మార్చేస్తోందంటూ విమర్శలకు దిగారు.  

తన ఐదేళ్ల పాలనలో తన విధానాలు వేలెత్తి చూపే, గొంతెత్తి ప్రశ్నించే వారిపై వేధింపులు, ఎదురుదాడే అస్త్రంగా సంధించి వారి గొంతులను అణిచివేసిన జగన్. న్యాయస్థానాలు, న్యాయమూర్తులపై కూడా ఎదురుదాడే అస్త్రంగా ముందుకు సాగారు. ఇప్పటి వరకూ ప్రత్యర్ధులపై ఎదురుదాడినే అస్త్రంగా నమ్ముకున్న జగన్..  ఇప్పుడు ఎన్నికల సంఘంపైనా అదే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. తనకు అనుకూలంగా వ్యవహరించే డీజీపీ, ఏడీజీ, ఐజీలు, ఎస్పీలు, కలెక్టర్లు, డీఎస్పీలపై వేటుతో వణికిపోతున్న జగన్.. ఎన్నికల సంఘంపై రుసరుసలాడుతున్నారు. యథా నాయకా, తథా అనుచరులు అన్నట్లుగా జగన్ బాటలోనే  వైసీపీ మంత్రులు, ఎమ్మెల్సీలు,  నేతలు నడుస్తున్నారు. ప్రధానంగా ఎన్నికల సమయంలో అధికారుల బదిలీలు, పథకాల నిలిపివేతపై జగన్ నుంచి ఎమ్మెల్సీల చేస్తున్న ఎదురుదాడి వారిలో విజయం పట్ల కొరవడిన నమ్మకానికి నిదర్శనంగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

గత ఎన్నికల సమయంలో అప్పటికి విపక్ష నేతగా ఉన్న జగన్ అప్పటి అధికార పార్టీపై ఎన్నికల సంఘానికి ఎన్ని ఫిర్యాదులు చేశారు. ఆయన, ఆయన చేసిన ప్రతి ఫిర్యాదుపై ఎన్నికల సంఘం ఎలా ఆఘమేఘాల మీద స్పందించిదీ అన్నది గుర్తు చేస్తూ, చేసుకుంటూ జనం నవ్వుకుంటున్నారు.  గత ఎన్నికల ముందు.. అంటే టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఎన్నికల్లో, వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అండ్‌కో  ఫిర్యాదుల మేరకు ఎలాంటి జాప్యం లేకుండా అప్పటి సర్కార్ లోని ఐఏఎస్, ఐపీఎస్ , డీఎస్పీలను ఎన్నికల విధుల నుంచి దూరం పెట్టిన సంగతి తెలిసిందే.   ప్రధానంగా నాటి సీఎస్ అనిల్‌చంద్ర పునేఠా, డీజీపీ , ఇంటలిజన్స్ ఏడీజీ ఏబీ వెంకటేశ్వరరావుతోపాటు మరికొందరు ఎస్పీ, కలెక్టర్లను ఎన్నికల సంఘం ఆఘమేఘాల మీద మార్చేసింది.  ఈ విషయాలను ఇప్పడు అధికారంలో ఉన్న వైసీపీ కన్వీనియెంట్ గా మర్చిపోతే పోవచ్చు కానీ, జనానికి ఐదేళ్ల కిందటి సంగతులన్నీ ఇప్పుడు ఒకదాని వెంట ఒకటి గుర్తుకు వచ్చేస్తున్నాయి. వైసీపీ తీరు గురువింద గింజ సామెతగా ఉందని ప్రజలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పింఛన్ల పంపిణీ నుంచీ, ఎన్నికల వేళ నిధుల విడుదల కోసం అభ్యర్థనలు పంపడం వరకూ ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డి జగన్ రెడ్డి పాలనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నా, ఎన్నికల సంఘం ఇంకా ఆయనపై ఎందుకు వేటు వేయలేదని ఆశ్చర్యపోతున్నారు.  

ఏది ఏమైనా ఎన్నికలు సక్రమంగా జరుగుతాయన్న నమ్మకం లేదంటూ జగన్ చేసిన వ్యాఖ్య వైసీపీ నేతలు, కేడర్, చివరాఖరికి అభ్యర్థులు కూడా ఓటమి ఖరారైపోయిందన్న నిర్ణయానికి వచ్చేలా చేసింది. దీంతో వారు సరిగ్గా ఎన్నికల వేళ కాడె వదిలేసినట్లు కనిపిస్తోంది. జగన్ సభలు జనం లేక వెలవెల బోతుండటమే ఇందుకు నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

జగనే ఓటమి భయంతో వణికి పోతుంటే.. తామెంత అనుకుంటున్న వైసీపీ అభ్యర్థులు ఎన్నికలలో సొమ్ములు ఖర్చు పెట్టడం వృధా అన్న భావనకు వచ్చి జగన్ సభలకు కూడా జనసమీకరణ చేయడానికి ప్రయత్నించడం లేదు.  మొత్తంగా  ఎన్నికలు సక్రమంగా జరగవేమోనంటూ జగన్ చేసిన  వ్యాఖ్యలు, వైసీపీ అభ్యర్ధుల మనోస్థైర్యాన్ని దారుణంగా దెబ్బతీసిందనడంలో సందేహం లేదు. ఎ ఆ ప్రభావం వైసీపీ ప్రచారంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.