2014 లో లోకేష్ పోటీ చేయరా?

 

 

చంద్ర బాబు నాయుడు తనయుడు లోకేష్ వచ్చే 2014 ఎన్నికల్లో పోటీ చేయక పోవచ్చని ఆయన సన్నిహితులు అంటున్నారు. ప్రస్తుతానికి తన తండ్రిని ఎలాగైనా తిరిగి అధికారంలోకి తీసుకురావడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారని వారంటున్నారు. ఆయనే స్వయంగా బరిలోకి దిగితే, తెర వెనుక చేయవలసిన కసరత్తు, నేతల మధ్య సమన్వయం, పార్టీ యంత్రాంగ పర్యవేక్షణ వంటి బాధ్యతలు వంటివి చూసే సామర్ధ్యం ఉన్న నేతలు పార్టీలో లేని కారణంగా లోకేష్ ప్రస్తుతానికి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కీలక బాధ్యతలు చూస్తారని తెలుస్తోంది.

 

లోకేష్ నిరంతరం పార్టీలోని సీనియర్ల కుమారులతో మాట్లాడుతూ, ప్రస్తుతానికి ఎన్నికలకు దూరంగా ఉండాలని, 2019 ఎన్నికల్లో మాత్రం మనమంతా కలిసి పోటీ చేద్దామని చెపుతున్నారని తెలుస్తోంది. ఆయన చాలా కాలం నుండి పార్టీ తెర వెనుక రాజకీయాల్లో కీలక పాత్రే పోషిస్తున్నారు. క్రితం ఎన్నికల్లో పార్టీ మానిఫెస్టో రూపకల్పనలో కూడా తన వంతు పాత్ర పోషించారు. అయితే, మీడియాలోని ఒక వర్గం లోకేష్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని, ఆయన ఓ నియోజక వర్గాన్ని కూడా ఎంపిక చేసుకున్నారని ప్రచారం చేస్తోంది. లోకేష్ ను కేవలం ఓ నియోజక వర్గానికి పరిమితం చేసి, ఆయన పాత్ర మరింత క్రియాశీలకంగా ఉండకుండా చేసే ఎత్తుగడలో ఈ ప్రచారం భాగమని లోకేష్ సన్నిహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

అలాగే, చంద్ర బాబు కూడా పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి లోకేష్ సేవలను వినియోగించుకొనే ఆలోచనలో ఉన్నారని కూడా పార్టీ వర్గాలు చెపుతున్నాయి.