గన్నవరం పంచాయతీలో ఊహించని ట్విస్ట్... వంశీకి షాక్ తప్పదా
posted on Feb 16, 2021 3:53PM
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వల్లభనేని వంశి టీడీపీ తరుఫున గెలిచి తరువాత వైసిపికి మారిన నాటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమౌతున్న సంగతి తెల్సిందే. వంశి వైసిపిలోకి వెళ్లినా అక్కడ అప్పటికే ఉన్న రెండు గ్రూపుల నాయకులతో నిత్యా ఘర్షణ పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే నియోజకవర్గం పరిధిలోని గన్నవరం పంచాయతీలో రాజకీయ సమీకరణాలు హఠాత్తుగా మారిపోయాయి.
ఇక్కడ వైసీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పాలేటి మనోజ్ఞ తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమెకు టీడీపీ గన్నవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మనోజ్ఞ చేరికతో గన్నవరం పంచాయతీ పోరు ఆసక్తికరంగా మారింది. తాజాగా మారిన సమీకరణాలతో ఈనెల 21న జరిగే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పీఠం దక్కించుకునేందుకు టీడీపీ తన ప్రయత్నాలు మొదలు పెట్టింది. గత కొంత కాలంగా రాష్ట్రం మొత్తం హాట్ టాపిక్ గా ఉన్న గన్నవరం ప్రజలు ఎవరిని గెలిపిస్తారో వేచి చూడాలి.