గంగిరెడ్డి భార్య పిటిషన్ పై హైకోర్టు ఆగ్రహం
posted on Dec 5, 2015 8:02AM
.jpg)
గంగిరెడ్డి..పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ఎర్రచందనం స్మగిలింగ్ మొదలుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై హత్యా ప్రయత్నం వరకు అనేక తీవ్ర నేరాలలో ప్రధాన నిందితుడు. చాలా రోజులుగా పోలీసులను తప్పించుకొని విదేశాలలో తిరుగుతున్న అతనిని కొన్ని రోజుల క్రితమే అరెస్ట్ చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకు వచ్చెరు. పోలీసులు అతనిని కోర్టులో హాజరుపరచగా కోర్టు అతనికి రిమాండ్ విధించింది. ప్రస్తుతం అతను కడప జైల్లో ఉన్నాడు. చేయకూడని నేరాలన్నీ చేసిన అతనిని చట్ట ప్రకారం శిక్షించడానికే పోలీసులు జైల్లో నిర్బంధించారు.
గంగిరెడ్డి భార్య కొల్లం మాళవిక తన భర్తకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుండి ప్రాణహాని ఉందని, కనుక తన భర్తని తెలంగాణాలో ఏదయినా జైలుకి మార్చాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, అది రాజ్యాంగ విరుద్దమని ప్రకటించ వలసిందిగా హైకోర్టును అభ్యర్ధించారు. ఆయన వలన తన భర్తకు ప్రాణహాని ఉందని భావిస్తున్నానని కనుక తన భర్తకు జైల్లో ప్రత్యేక రక్షణ ఏర్పాటు చేయాలని ఆమె తన పిటిషన్ లో కోరారు.
ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై ఆమె ఇటువంటి తీవ్ర ఆరోపణలు చేసినందుకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు తన పిటిషన్ లో ప్రతివాదుల పేర్ల నుండి చంద్రబాబు నాయుడు పేరు తొలగించాలని, ఆ తరువాతే పిటిషన్ నెంబరు కేటాయించాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. హైకోర్టు సూచించిన మార్పులు చేసిన తరువాత సోమవారం ఈ పిటిషన్ని విచారణకు స్వీకరించే అవకాశం ఉంది.