గ‌ద్వాల్ ఎమ్మెల్యే వ్యవహారం.. కాంగ్రెస్ జోరుకు బ్రేకేనా?

తెలంగాణ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి గ‌ద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ‌మోహ‌న్ రెడ్డి ఝ‌ల‌క్ ఇచ్చారు. ఇటీవ‌ల బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయ‌న‌.. తిరిగి మ‌ళ్లీ బీఆర్ఎస్ గూటికి చేరిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అసెంబ్లీలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ నేత‌ల‌తో ఆయ‌న క‌లిసి ఉండ‌టంతో ఆయ‌న మ‌ళ్లీ బీఆర్ఎస్ గూటికి చేరుతున్న‌ట్లు వ‌చ్చిన వార్త‌ల‌కు బ‌లం చేకూరిన‌ట్ల‌యింది.

గ‌ద్వాల్ ఎమ్మెల్యేతో పాటు ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీలో చేరిన మిగిలిన ఎమ్మెల్యేలుసైతం తిరిగి సొంత‌గూటికి వెళ్తార‌ని విస్తృత ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ వార్త‌ల‌ను కాంగ్రెస్ నేత‌లు ఖండించారు. అయితే తాజా ప‌రిణామాలు కాంగ్రెస్ శ్రేణుల‌ను కొంత ఆందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి ప్ర‌తిప‌క్ష హోదా కూడా లేకుండా చేస్తామ‌ని చెప్పిన కాంగ్రెస్ పార్టీకి తాజా ప‌రిణామం పెద్ద ఎదురుదెబ్బేన‌ని చెప్పొచ్చు. అయితే, త్వ‌ర‌లోనే మ‌రికొంద‌రు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ గూటికి చేర‌బోతున్నార‌ని ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు. రాష్ట్రంలో తాజా రాజ‌కీయ ప‌రిణామాలు కాంగ్రెస్ పార్టీని ఏమేర‌కు ఇబ్బందికి గురిచేశాయనడంలో సందేహం లేదు. కాంగ్రెస్ నేత‌లు చెబుతున్న‌ట్లు మ‌రికొంద‌రు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి రాబోతున్నారా.. గ‌ద్వాల్ ఎమ్మెల్యే తిరిగి బీఆర్ఎస్ గూటికి చేర‌డానికి బ‌ల‌మైన కార‌ణం ఏమిటి అనే అంశాల‌పై రాష్ట్ర రాకీయాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్య జ‌రుగ‌తున్నది. 

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థులు కేవలం 39స్థానాల్లో మాత్రమే గెలుపొంద‌డంతో.. ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డంతో.. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో దాదాపు తొమ్మిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి చేరారు. ఆషాఢమాసం అయిపోయిన తరువాత రేవంత్ రెడ్డి సమక్షంలోనే చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని, త‌ద్వారా బీఆర్ఎస్‌కు విప‌క్ష హోదాకూడా ఉండ‌ద‌ని హస్తం పార్టీ నేతలు జోరుగా ప్రచారం చేశారు. కానీ, వారి ప్ర‌చారానికి విరుద్దంగా కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ త‌గిలింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌లో గ‌ద్వాల నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహ‌న్ రెడ్డి కూడా ఒక‌రు. ప్ర‌స్తుతం ఆయ‌న మ‌ళ్లీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌య్యారు. గ‌ద్వాల ఎమ్మెల్యేతోపాటు ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన మరికొందరు ఎమ్మెల్యేలుసైతం తిరిగి సొంత గూటికి చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, కాలె యాదయ్య కూడా తిరిగి బీఆర్ఎస్‌లో చేరుతారని గులాబీ పార్టీ అగ్రనేతలు చెబుతున్నారు. కానీ, వారు బీఆర్ఎస్ నేత‌ల ప్ర‌చారాన్ని ఖండించారు. తాము కాంగ్రెస్ లోనే ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు. 

తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌పై మంత్రులు స్పందించారు. బీఆర్ఎస్ నుంచి వ‌చ్చిన‌ ఎమ్మెల్యేలు తిరిగి ఆ పార్టీవైపు వెళ్లడం లేదని.. అదంతా గులాబీ నేతలు చేసుకుంటున్న ప్రచారమేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఛాంబర్ కు వెళ్లినంత మాత్రాన పార్టీ లో చేరినట్లా.. కేటీఆర్ కూడా నా ఛైర్ దగ్గర కు వచ్చి మాట్లాడారు.. ఆయన కాంగ్రెస్ లో చేరినట్లేనా అంటూ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి అన్నారు. బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అలాగే కలిసి ఉంటారు. ఆయన ఎక్కడికి వెళ్లడు అంటూ కోమ‌టిరెడ్డి పేర్కొన్నాడు. అయితే, బండ్ల కృష్ణ మోహ‌న్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ గూటికి తిరిగి చేరేందుకు సిద్ధ‌ప‌డ‌టానికి ప‌లు కార‌ణాలు ఉన్నాయి.

ముఖ్యంగా గ‌ద్వాల్ నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా స‌రిత‌ తిరుప‌తియ్య బ‌రిలో నిలిచారు. బండ్ల కృష్ణ‌మోహ‌న్ రెడ్డిపై ఓడిపోయారు. బండ్ల కృష్ణ‌మోహ‌న్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న‌ట్లు వార్త‌లు రావ‌డంతో స‌రిత తిర‌ప‌త‌య్య వ‌ర్గం తీవ్ర స్థాయిలో అభ్యంత‌రం తెలిపింది. నియోజ‌క‌వ‌ర్గంలోని కాంగ్రెస్ ముఖ్య‌నేత‌లు సైతం బండ్ల కృష్ణ మోహ‌న్ రెడ్డి కాంగ్రెస్ లోకి రావ‌డాన్ని అభ్యంత‌రం తెలిపారు. అధిష్టానం పెద్ద‌లు రంగంలోకి దిగి వారికి స‌ర్దిచెప్పి కృష్ణ మోహ‌న్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయ‌న‌కు పార్టీ కండువా క‌ప్పారు. 

బండ్ల కృష్ణ‌మోహ‌న్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్న క్ర‌మంలో కొన్ని కండీష‌న్లు పెట్టిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ విష‌యంపై యెన్నం  శ్రీ‌నివాస్ రెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్యే  కృష్ణ మోహన్ రెడ్డికి ఓపిక లేదు. అక్కడ ఆయన చెప్పినట్లు పార్టీ లో ప్రయార్టీ ఇచ్చాము. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన మనుషులకు అవకాశాలు ఉండాలని అడిగాడు. దానికీ   సరే అన్నాము. జిల్లాలో బీసీ మహిళ అయిన జెడ్పీ చైర్మన్ స‌రిత తిరుప‌త‌య్య‌ను ఎక్కడికి రావొద్దు, ఆమెను అధికార కార్యక్రమాలకు పిలవద్దు అని చెప్ప‌డంతో కాంగ్రెస్ అధిష్టానం ఇది సాధ్యం కాద‌ని చెప్పింద‌ని యెన్నం క్లారిటీ ఇచ్చారు. ఆ త‌ర‌వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే, గ‌ద్వాల్ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఆయ‌న ప‌ట్ల‌ వ్య‌తిరేక‌త‌తో ఉండ‌టంతో.. కాంగ్రెస్‌లో ఉంటే నియోజ‌క‌వ‌ర్గంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని భావించిన బండ్ల‌...తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరేందుకు నిర్ణ‌యించుకున్నార‌ని తెలుస్తోంది.

మ‌రోవైపు తన ఎన్నిక చెల్లదని హైకోర్టులో పడిన పిటిషన్లపై విచారణలో లాయర్ ను గతంలో బీఆర్ఆర్ ఏర్పాటు చేసింది. పార్టీ మారడంతో లాయర్ ను తీసేశారు. ఇప్పుుడు లాయర్ ను కొనసాగించాలని కేటీఆర్ ను కోరానని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అంటున్నారు. అంత మాత్రానే ఆయన రివర్స్ అయ్యే అవకాశం లేదని.. ఆయన ఏదో తీర్చలేని కోరిక కోరి ఉంటారని.. పట్టించుకోకపోవడంతో.. బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కొంత మంది బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. మొత్తానికి బండ్ల కృష్ణ వ్య‌వ‌హారం తెలంగాణ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం రేపింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu