తిరుమలలో ఆర్టీసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం
posted on Jun 19, 2025 5:20PM

తిరుమలలో భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్‌ఆర్టీసీ ఉచిత బస్సు సర్వీసులను ప్రారంభించింది. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆర్టీసీ అధికారులతో కలిసి ఈ సేవలను గురువారం (జూన్ 19) ప్రారంభించారు. ప్రైవేట్ వాహనాల దోపిడీని, కాలుష్యాన్ని నివారించడమే లక్ష్యంగా ఈ సర్వీసులను ప్రారంభించినట్లు వెంకయ్య చౌదరి తెలిపారు. శ్రీవారి ధర్మ రథాలు తిరిగే మార్గంలోనే ఈ బస్సులు తిరుగుతూ భక్తులను ఉచితంగా గమ్యస్థానాలకు చేరుస్తాయి.
శ్రీవారి మెట్టు, పాపవినాశనం వంటి ప్రాంతాలకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. తిరుమలలో భక్తుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేటు వాహనాల దోపిడీని అరికట్టడం, కాలుష్యాన్ని నియంత్రించడం, ప్రమాదాలను నివారించడం లక్ష్యంగా ఈ సేవలను అందుబాటులోనికి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. తొలి దశలో 20 బస్సులను అందుబాటులోనికి తీసుకువచ్చినట్లు చెప్పారు. ఇవి ఇప్పటికే తిరుమలలో తిరుగుతున్న 12 శ్రీవారి ధర్మరథాలకు అదనంగా ఆర్టీసీ బస్సులు 80 ట్రిప్పులు తిరుగుతాయి. దీని వల్ల ప్రతి ఐదు నిముషాలకు ఉచిత బస్సు భక్తులకు అందుబాటులో ఉంటుంది. భవిష్యత్తులో ప్రతి మూడు నిముషాలకు ఈ ఉచిత బస్సు అందుబాటులోనికి తీసుకువస్తామని వెంకయ్య చౌదరి తెలిపారు.