తుఫాను బాధితులకు ఉచితంగా నిత్యావసరాలు... బాబు..
posted on Oct 15, 2014 11:12AM

హుదుద్ తుఫాను బాధితులందరికీ ఉచితంగా పంపిణీ చేయడం కోసం చౌకధరల దుకాణాల్లో నిత్యావసరాలు సిద్ధంగా ఉంచినట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. బుధవారం నాడు చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. విశాఖలో ప్రతి పౌరుడూ ఉచితంగా నిత్యావసరాలు తీసుకోవచ్చని ఆయన చెప్పారు. ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం, అరకిలో ఉప్పు, అరకిలో కారం, కందిపప్పు, లీటర్ పామాయిల్ ఉచితంగా ఇవ్వననున్నట్టు తెలిపారు. దాదాపు తొమ్మిది లక్షల కుటుంబాలకు ఉచితంగా నిత్యావసరాలు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకున్నామన్నారు. చేనేత కార్మికులు, మత్స్యకారులకు 50 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయనున్నామన్నారు. విశాఖలో కూరగాయల ధరలను నియంత్రించేందుకు రైతు బజార్ల ద్వారా కిలో ఉల్లిపాయలు 5 రూపాయలకు, కూరగాయలు కిలో మూడు రూపాయలకు ప్రభుత్వం తరఫున పంపిణీ చేయనున్నట్టు చంద్రబాబు వివరించారు. అన్ని జిల్లాల నుంచి వందల టన్నుల కూరగాయలను తెప్పించినట్టు తెలిపారు. విశాఖ జిల్లా ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాలలో పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదని, ఇకనుంచి గ్రామీణ ప్రాంతాలలో సహాయక చర్యలపై దృష్టి పెడతామని చెప్పారు. విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ తమ ముందున్న ప్రధాన కర్తవ్యమని, అన్ని ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టామని తెలిపారు. విశాఖలోని 10 మురికివాడల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని, కృష్ణ, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఆరు లక్షల ఆహార పొట్లాలు హెలికాప్టర్లలో తెప్పించి పంపిణీ చేశామని చంద్రబాబు చెప్పారు. తుఫాను కారణంగా పరిశ్రమలకు అపార నష్టం వాటిల్లిందని, ముందు చూపు వల్లే ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగామని, మరో రెండు రోజుల్లో కేంద్ర పరిశీలన బృందం వస్తుందని చంద్రబాబు వివరించారు.