సొంతగూటికి పొంగులేటి?

గత కొంత కాలంగా తెలంగాణ రాజకీయాల్లో ఖమ్మం జిల్లా రాజకీయాలు కీలకంగా, ఆసక్తిదాయకంగా మారాయి. రసకందాయంలో పడ్డాయి. కొంత కాలం క్రితం, రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ రీ ఎంట్రీకి ఖమ్మం వేదికయింది. టీడీపీ అధినేత, చంద్రబాబు ఖమ్మం నుంచే శంఖారావం పూరించారు. ఆ తర్వాత, బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ఖమ్మం వేదికయింది. అదలా ఉంటే అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య నాయకులు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ రాజకీయ భవిష్యత్ కు కొత్త బాటలు వేసుకునే క్రమంలో  ఆత్మీయ  సమ్మేళనాలు నిర్వహించి హాల్ చల్ సృష్టించారు.

అయితే, బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్  హరీష్ రావు జరిపిన దౌత్యంతో తుమ్మల మెత్త పడ్డారు. బీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు.  కానీ, పొంగులేటి బీఆర్ఎస్ ను వదిలేశారు. బీఆర్ఎస్ లో జరిగిన అవమానాలను తలచుకుని తలచుకుని ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అయితే  తనకు  తన వర్గానికి అన్యాయం చేసిన బీఆర్ఎస్ ను దెబ్బ తీసేందుకు ఎవరితో జట్టు కట్టాలి , ఏ పార్టీలో చేరాలి  అనే విషయంలో మాత్రం ఇంకా ఒక స్పష్టమైన నిర్ణయానికి రాలేక పోతున్నారు.

ఈ నేపధ్యంలోనే, పొంగులేటి ఖమ్మం రాజకీయాల్లోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో కూడా వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.  బీఆర్ఎస్ నుంచి అయితే  బయటకు వచ్చేసిన పొంగులేటి ఏ పార్టీలో చేరతారు అనేది ఇప్పడు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారింది. బీఆర్ఎస్ నుంచి నేరుగా ఆయన బీజేపీ గూటికి చేరతారనే ప్రచారం సాగింది. ముహూర్తాలు, వేదికలు కూడా ఫిక్సయి పోయాయి. కానీ,ఇంతలో కాంగ్రెస్ నుంచి ఆఫర్ వచ్చింది. తేల్చుకొనే లోగా గత పరిచయాలో వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల చక్రం తిప్పారు. పొంగులేటితో చర్చించారు. గతంలో వైసీపీలో పని చేసిన పొంగులేటికి ఆ కుటుంబపై అభిమానం ఉంది. తాజాగా విజయమ్మతో భేటీ అయ్యారు. ఇక నిర్ణయానికి వచ్చేశారు. పార్టీలో చేరిక.. ముహూర్తం దాదాపు ఫిక్స్ అయ్యాయి. తన నిర్ణయం పై అనుచరలతో సమవేశానికి పొంగులేటి సిద్దమయ్యారు.

 పొంగులేటి తాను ఏ పార్టీలో చేరినా జిల్లాలో తన హవా కొనసాగాలని కోరుకున్నారు. బీఆర్ఎస్ ను ఢీ కొట్టేందుకు సిద్దమయ్యారు. తొలుత బీజేపీలో చేరాలని భావించారు. కానీ  కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ అన్నట్లు గా పోరు సాగుతున్న ఖమ్మం జిల్లాలో బీజేపీకి పట్టు చిక్కటం కష్టమని శ్రేయోభిలాషులు సూచించారు. వామపక్ష.. కాంగ్రెస్.. గులాబీ పార్టీకే అక్కడ ప్రజలు మద్దతుగా నిలిచే అవకాశం ఉందంటూ సర్వే నివేదికలు స్పష్టం చేసాయి. దీంతో.. విదేశాల నుంచి తిరిగి వచ్చిన తరువాత వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిలతో భేటీ అయ్యారు. జిల్లాలో పాలేరు నుంచి షర్మిల పోటీ చేస్తుండటంతో.. అక్కడ మినహా ఇతర నియోజకవర్గాల్లో పొంగులేటి మద్దతు దారులకు సీట్లు ఇచ్చే అంశం పైన చర్చ జరిగినట్లు సమాచారం. పార్టీలోకి వస్తే బాగుంటుందని షర్మిల సూచించారు. నిర్ణయం మాత్రం పెండింగ్ లో పెట్టారు. ఇప్పుడు తాజాగా విజయమ్మ తో భేటీ అయ్యారు. 

విజయమ్మతో భేటీ తరువాత పొంగులేటి రాజకీయ అడుగులు ఏంటనేది స్పష్టత వచ్చింది.  వైసీపీ ఆవిర్భావం తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ తో పాటుగా మూడు అసెంబ్లీ స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది. ఖమ్మం నుంచి వైసీపీ ఎంపీగా పొంగులేటి గెలుపొందారు. ఇప్పుడు వైఎస్సార్టీపీ ఏర్పాటు తరువాత జరుగుతున్న తొలి ఎన్నికల్లో షర్మిల అదే జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో వైసీపీ కోసం ఆ కుటుంబంతో కలిసి పని చేసిన అనుభవం ఉండటంతో.. ఇప్పుడు తన అనుచరులకు ఈ పార్టీ ద్వారా టికెట్లు దక్కించుకోవటం పైన చర్చలు జరిపారు  కాంగ్రెస్ లో కొంత ఓట్ బ్యాంక్ కలిసి రావటంతో పాటుగా వైఎస్సార్ ఇమేజ్.. తమకు వ్యక్తిగతంగా ఉన్న మద్దతు కలిసి జిల్లాలో మెజార్టీ స్థానాలు గెలవచ్చని లెక్కలు వేశారు. పాలేరు లో షర్మిల గెలుపునకు సహకరించేందుకు పొంగులేటి విజయమ్మతో భేటీలో హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో..నాడు జగన్ తో కలిసి వైసీపీలో.. నేడు షర్మిలతో కలిసి వైఎస్సార్టీపీలో పొంగులేటి పని చేయటం ఖాయమని చెబుతున్నారు.

 ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పొంగులేటి వైఎస్సార్‌టీపీలో చేరున్నారని తెలుస్తోంది. పార్టీలో చేరికపై వరుస మంతనాలు జరుపుతూ వస్తున్నారు. ఈ నెల 8 న పాలేరు లో వైఎస్ విజయమ్మ పర్యటించనున్నారు. అదే రోజున పొంగులేటి వైఎస్సార్‌టీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం కనిపిస్తోంది. తనతో పాటుగా అనుచరులను పార్టీలో చేర్చేలా మంతనాలు పూర్తయినట్లు తెలుస్తోంది. ఆ రోజు చేరటమా లేక షర్మిల పాదయాత్ర ముగింపు సభలో చేరటమా అనేది చర్చ జరిగింది.  పాలేరులో విజయమ్మ - షర్మిల సమక్షంలోనే చేరేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పొంగులేటి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.. ఏం జరుగుతుందనేది త్వరలోనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు.