గవర్నర్, ప్రభుత్వం మధ్య సయోధ్య కొనసాగుతుందా?

అబద్ధాలా .. అర్థ సత్యాలా అనే  విషయం పక్కన పెడితే, అసలు గవర్నర్  శాసన సభకు వచ్చి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడం, నిజంగా... నిజమా, అనే అనుమానం అందరిలో కాకున్నా కొందరిలో ఇంకా అలాగే వుంది.  నిజం  తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ను ముఖ్యమంత్రి కేసీఆర్  సాదరంగా ఆహ్వానించింది, నిజంగా నిజమేనా, అనే అనుమానం కూడా ఇంకా పూర్తిగా తొలిగి పోలేదు. అలాగే, ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగాన్ని గవర్నర్  చక్కగా అక్షరం పొల్లు పోకుండా ఉన్నది ఉన్నట్లు చదవడం  నిజంగా నిజమేనా  అనే అనుమానాలు కూడా ఇంకా అలాగే ఉన్నాయి. 

గత రెండు రెండున్నర సంవత్సరాలుగా రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న  పోరు,  అంతకు మించి రాష్ట్ర శాసన సభ సమావేశాల ప్రారంభానికి ముందు చోటు చేసుకున్న పరిణామాలు, రాజకీయ వివాదం రాజ్యాంగ వివాదానికి దారితీసేలా తలెత్తిన పరిస్థితులు  గుర్తు చేసుకుంటే, ఇలాంటి దృశ్యం ఒకటి ఇంత త్వరగా చూస్తామని బహుశా రాజకీయ పండితులు సైతం ఊహించి ఉండరు. నిజానికి  రాష్ట్ర హై కోర్టు జోక్యం చేసుకోవడం వలన కానీ  లేదంటే  నిజంగానే రాజ్యాంగ సంక్షోభం ఏర్పడదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

 కానీ, అందరి ఊహాలను తల్లకిందులు చేస్తూ  ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్  అటు గవర్నర్ తమిళి సై  చాలా చక్కగా ఎవరి పాత్రను వారు పోషించారు. ‘సయోధ్య’ చిత్రాన్ని రక్తి కట్టించారు. అఫ్కోర్స్ ముఖ్యమంత్రి బాడీ లాంగ్వేజ్ లో కొద్దిపాటి అవమాన ఛాయలు, గవర్నర్ అడుగుల్లో కొద్దిపాటి విజయ దరహాసం అగుపించాయనుకోండి  అది వేరే విషయం.  అయినా  రెండు వ్యవస్థల మధ్య సయోధ్య అవసరాన్ని ఇద్దరూ ఎంతో కొంత గ్రహించినట్లే కనిపించారు. అయితే, ఈ సయోధ్య ఇంత వరకేనా   ముందు ముందు కూడా కొనసాగుతుందా? అంటే, రాజకీయ విశ్లేషకులు అనుమానమే అంటున్నారు. కానీ  ఇక ముందు గతంలోలాగా తెగే వరకూ లాగే పరిస్థితి అయితే రాకపోవచ్చనీ, ఇరు వర్గాల నుంచి ఎంతో కొంత విజ్ఞత, వివేచనా, సంయమనం ఆశించ వచ్చననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రధానంగా ఇప్పటికే పెండింగ్ లో ఉన్న ఐదారు బిల్లుల విషయంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. ఆమోద ముద్ర వేస్తారా? తిప్పి పంపుతారా? అనేది తేలితే సయోధ్య ఎంత వరకు నిలుస్తుందని అనే విషయంలో కొంత క్లారిటీ వస్తుందని అంటున్నారు.

ముఖ్యంగా   మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలలో అవిశ్వాసం తీర్మానం గడువును ప్రస్తుతమున్న మూడేళ్ళ నుంచి నాలుగేళ్ళకు పొడిగిస్తూ  గత అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించిన సవరణ బిల్లును  గవర్నర్ పెండింగ్ లో ఉంచారు. ప్రస్తుత సయోధ్య నేపధ్యంలో అయినా  గవర్నర్ దానిని ఆమోదిస్తారా? లేదా అనే ‘ఉత్కంఠ వ్యక్తమవుతోంది.  నిజానికి, రాష్ట్రంలోని 127 పట్టణ, నగరపాలక సంస్థలలో అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చేందుకు ప్రస్తుతమున్న మూడేళ్ళ గడవు జనవరి 26తో ముగిసింది. మరో వంక ఇప్పటికే అనేక పట్టణ, నగర పలక సంస్థలలో అధికార బీఆర్ఎస్ లో లుకలుకలు మొదలయ్యాయి.

అలాగే హుజురాబాద్ సహా అనేక పట్టణ  నగరపాలక సంస్థలలో అవిశ్వాస తీర్మానం నోటీసులు కూడా ఇచ్చారు. క్యాంపులు, ప్రజా ప్రతినిదుల కొనుగోలు వ్యవహారాలు మొదలైన వార్తలు అందుతున్నాయి. ఈ నేపధ్యంలో గవర్నర్  అవిశ్వాస గడువు పొడిగింపు బిల్లుకు ఆమోదమ తెలుపుతారా ? తిప్పి పంపుతారా? అదీ ఇదీ కాకుండా పరిశీలనలో ఉంచుతారా? అనేది సయోధ్యకు పరీక్షగా మారిందని అంటున్నారు.