ఆర్ధిక ఉగ్రవాది శ్రీరంగ నీతులు!

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ పేరుతో ఏపీ సీఐడీ అక్రమ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడంపై జాతీయ స్థాయిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. జాతీయ పార్టీల నుండి ఏపీలో ప్రతిపక్ష పార్టీలన్నీ ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుండి అమెరికా వరకూ తెలుగు వారు ఎక్కడ ఉన్నా చంద్రబాబు అరెస్టుపై నిరసన తెలియజేస్తున్నారు. ఈ కేసు వ్యవహారంలో స్పందించిన మేధావులు, రాజకీయ విశ్లేషకులు ఇది కేవలం కక్షపూరిత చర్యగానే తేల్చేయగా.. రిటైర్డ్ ఉద్యోగులు, మాజీ న్యాయమూర్తులు కూడా చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నారు. చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో జగన్ ప్రభుత్వం, సీఐడీ పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దారుణమని ఇప్పటికే తేల్చేశారు. చంద్రబాబు  హోదా, వయసుకు గౌరవం ఇవ్వలేదు. పౌర హక్కులు, చట్ట నియమ నిబంధనలను తుంగలో తొక్కడం ప్రభుత్వ నియంత, కక్ష సాధింపు వైఖరికి నిదర్శనమని పేర్కొంటున్నారు.

కాగా, చంద్రబాబు అరెస్ట్ సమయంలో అసలు దేశంలో లేని సీఎం జగన్.. తిరిగి రాష్ట్రానికి వచ్చిన అనంతరం కూడా చంద్రబాబు అరెస్టుపై సూటిగా సమాధానాలు చెప్పలేకపోయారు. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు.. అందుకే జైలుకు వెళ్లారని బట్ట కాల్చి మోహన విసిరిన చందంగా చెప్పిన జగన్.. అక్రమ అరెస్టు, అక్రమ కేసులపై వివరణ ఇవ్వలేదు. కనీసం ఎఫ్ఐఆర్ లో పేరు లేకపోవడం, అవినీతి జరిగినట్లు ఆధారాలు లేవనే ఆరోపణలపై కూడా సమాధానం ఇవ్వలేదు. కేవలం చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలకే జగన్ పరిమితమయ్యారు. దీంతో జగన్ పై ఉన్న అక్రమ ఆస్తుల కేసుల వివరాలను మరోసారి వెలికి తీస్తున్న పరిశీలకులు.. 16 నెలల పాటు జైల్లో ఉన్న వ్యక్తి మరొకరు అవినీతి చేశారని న్యాయస్థానాల కంటే ముందే స్టేట్మెంట్లు ఇవ్వడంపై విస్తుపోతున్నారు. అవినీతి జరిగిందా లేదా అనేది కోర్టులు తేల్చకుండానే ఓ ఆర్ధిక ఉగ్రవాది సమాజానికి శ్రీరంగ నీతులు చెప్పడం ఏమిటంటూ విస్తుపోతున్నారు.

సీఎం జగన్ రెడ్డి మొత్తం 11 సీబీఐ, 7 ఈడీ కేసుల్లోప్రధాన ముద్దాయి కాగా.. 13 ఏళ్లుగా ఈ కేసులు విచారణలో ఉన్నాయి. ఇందులో కొన్నిటిలో ఈడీ ఆస్తులను అటాచ్ కూడా చేసింది. ఈ కేసుల్లోనే జగన్ 16 నెలలు జైల్లో గడిపారు. సీబీఐ అఫిడ విట్ లో పేర్కొన్న రూ.43 వేల కోట్ల అవినీతి సంపదలో ఇప్పటివరకు రూ.10 వేల కోట్ల ఆస్తులను జప్తు చేయగా.. మిగిలిన అవినీతి సంపదను కూడా జప్తు చేసి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది.  మనీలాండరింగ్, నేరపూరితమైన కుట్ర, మోసం, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లంచాలు  తీసుకోవడం వంటి హేయమైన అభియోగాలున్న  జగన్ ఇప్పుడు చంద్రబాబు విషయంలో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలుంటాయని ప్రవచించడం చూస్తే  దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విశ్లేషకుల అంటున్నారు. ఆర్ధిక ఉగ్రవాదులు ఇలా శ్రీరంగ నీతులు బోధించడం మన ప్రజాస్వామ్య  దుస్థితికి అద్దం పడుతోందంటున్నారు.

జగన్ అవినీతి కేసులలో ఏళ్ల తరబడి విచారణ కొనసాగుతున్నది. ఇలా సాగడం వెనక లాబీయింగ్ ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నీతి, నిజాయతీ గురించి ప్రవచనాలు చెప్తున్న జగన్ ముందుగా తనపై కేఉన్న కేసులను త్వరితగతిన విచారణ పూర్తి అయ్యేలా సహకరించి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని, అప్పుడే ఆయనకు నీతి, నిజాయతీల గురించి మాట్లాడే అర్హత వస్తుందని అంటున్నారు.  తనపై కేసుల విచారణకు హాజరుకాకుండా కుంటి సాకులతో తప్పించుకుంటే.. ప్రత్యర్థుల అక్రమ అరెస్టులకు స్క్రిప్ట్ రచించడం ఏమిటని నిలదీస్తున్నారు.  త విదేశాలకు విహారయాత్రలకు వెళ్లిన సీఎంకు పక్కనే ఉన్న హైదరాబాద్ కోర్టుకు వెళ్లే సమయం లేదా అని ప్రత్యర్ధులు ఏకిపారేస్తున్నా మౌనాన్ని ఆశ్రయిస్తున్న జగన్  చట్టం, న్యాయం, నేరాలు, మోసాల గురించి చెప్పడం  ఏమిటని రాజకీయ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.

నిజానికి మన దేశంలో జరిగిన అతిపెద్ద ఆర్ధిక కుంభకోణాలలో జగన్ అక్రమ ఆస్తుల కేసు కూడా ఒకటి. స్వతంత్ర భారత దేశంలో ఏ రాజకీయ నాయకుడి పైనా లేనన్ని  అవినీతి కేసులు జగన్ పై ఉన్నాయి. అలాంటి వ్యక్తి అధికారంలో ఉండగా.. ప్రత్యర్థులపై అక్రమ కేసులు బనాయించడం పెద్ద లెక్కేమీ కాదు. తనతో పాటు అందరినీ దొంగలనే ముద్రవేయాలనుకోవడం విడ్డూరంగా అనిపించకపోవచ్చు. ఇప్పుడు చంద్రబాబు విషయంలో కూడా జగన్ అదే చేస్తున్నారన్నది పరిశీలకుల వాదన.