తూర్పురైతుకు తీరని కష్టం?
posted on Jun 22, 2012 10:47AM
ఒకవైపు వాతావరణ ప్రభావం, మరోవైపు దళారులు రైతుకు తీరని కష్టాన్ని మిగులుస్తున్నారు. తూర్పుగోదావరిజిల్లా వ్యవసాయాథారిత ప్రాంతమైనందున ఇక్కడ జీవించే వారందరూ బంధుత్వం పేరిట పెనవేసుకుంటారు. పెద్దలను పేరుపెట్టి పిలిచే బదులు బాబాయి, బావ, మామయ్య, తాత వంటి ఏదో ఒక వరాసతో కేకేస్తుంటారు. సుద్దవ్యవహారికంలో ఒకరిపై ఒకరు నమ్మకంగా ఉంటుంటారు. ఇది దళారీ వ్యవస్థ పెరగటానికి, వ్యాపారాల్లో మోసం చేయాలనే నిజానికి కారణమవుతోంది. అడిగినప్పుడు పెట్టుబడి పెట్టేందుకు కొందరు వ్యాపారులు ముందుకు వస్తుండటంతో రైతులు వారిని పూర్తిగా నమ్మేస్తారు. వారు ఒక మూడునెలల పాటు అందరికీ పద్దు ఆపేసి ధాన్యం తీసేసుకుని మిల్లర్ల నుంచి డబ్బు వసూలు చేసుకుని పరారైతే ఒక్కసారిగా రైతులు ఘోల్లుమంటారు. ఇదే తరహా మోసాలకు బలవుతుంటారు. తాజాగా ఆలమూరు మండలం పెనికేరు కమీషను ఏజెంటు శ్రీనివాసరావు రూ. 30లక్షలకు పైచిలుకే రైతులకు డబ్బు ఇవ్వకుండా పరారయ్యాడు. మొత్తం 40మంది రైతులను శ్రీనివాసరావు మోసం చేశాడు. ఐదువేల రూపాయలు మొదలుకుని రెండు లక్షల వరకూ రైతులకు చెల్లించాల్సి ఉంది. ఇక కోనసీమలో అయితే తరచుగా ఇటువంటి సంఘటనలు పునరావృత్తం అవుతాయి. గతంలో కన్నా ప్రైవేటు రుణాలు తగ్గించినా కమీషన్ ఎజెంట్లు, పిండికొట్టువ్యాపాటి పెట్టుబడులు ఇంకా ఆగలేదు. దీంతో రైతు ఎవరో ఒకరిపై ఆధారపడే సాగు కొనసాగించాల్సి వస్తోంది. మండలస్థాయిలోనూ, గ్రామస్థాయిలోనూ అధికారులు రైతులను బ్యాంకులవైపు మళ్ళించినా మళ్ళీ ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు. రైతుల అవగాహనా కార్యక్రమాలు పెరగాల్సిన అవసరం ఉందని పై సంఘటన నిరూపిస్తోంది. గిట్టుబాటు ధర ఇవ్వలేదని అలిగిన తూర్పురైతు గతేడాది క్రాప్ హాలిడే ప్రకటించి తీరని నష్టాన్ని చవిచూశాడు. ఇంకా దాని నుంచి తెరుకోకుండానే కొత్తకొత్త ఘటనలు రైతును కష్టాల్లోకి గేన్తెస్తోంది. పొలంబడి, రైతుమిత్రసంఘాలు అభివృద్ధి చెందినా రైతుమనోధృక్పథంలో పెద్దగా మార్పు రాలేదని అర్థం చేసుకుని వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారు. అధికారులకు తెలియకుండా ఆలమూరు మండలం పెనికేరు రైతులకు వ్యాపారి నుంచి అప్పులు ఇప్పించేందుకు పెద్దలు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు అప్పు ఇచ్చి పంట చేతికి వచ్చిన వెంటనే లాభంతో కలిసి సొమ్ము చేసుకునే వ్యాపారులకు బదులు బ్యాంకుకు తీసుకెళ్ళి ప్రయత్నం పెద్దలు చేయటం లేదు. దాని ఫలితం భవిష్యత్తులో ఎలా ఉంటుందో అన్న ఆందోళన తప్పటం లేదు. ప్రజాప్రతినిథులు కూడా ఇటువంటి విషయాల్లో శ్రద్ధ తీసుకోవటం లేదు. మార్పు దిశగా తూర్పురైతును తీసుకెళ్లేందుకు ఎవరూ కృషి చేయటం లేదన్నది నగ్నసత్యం.