వెల్లడవుతున్న రవాణా అక్రమాలు, పెరిగిన జప్తు బస్సుల సంఖ్య?

రవాణాశాఖ అక్రమాలకూ అడ్డా అన్నమాట వాస్తవమని తేలుతోంది. దీనికి వేరే సాక్ష్యం అక్కర్లేదు పెరుగుతున్న బస్సుల జప్తు దీన్ని తేటతెల్లం చేస్తోంది. కళ్ళు మూసుకుపోయిన అందినకాడికి దోచుకున్న రవాణాశాఖ సీరియస్ గా దాడులు మొదలుపెట్టినప్పటినుంచి నిబంధనల ప్రకారం రోడ్డుమీద తిరగటానికి వీల్లేని బస్సుల సంఖ్య పెరుగుతోంది. అసలు మొదటినుంచి ఎందుకు ఆ శాఖ నిబంధనలను పక్కనపెట్టేసింది? రవాణాధికారులు రోజుకు లక్షకు తక్కువ కాకుండా సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలను ఎందుకు పట్టించుకోలేదు? డిటిసి మొదలుకుని అటెండర్ వరకూ పంచుకుతింటున్నారన్న దానిపై ఎక్కడా సరైన వివరణ ఎందుకు ఇవ్వలేకపోయారు? వంటి ప్రశ్నలు ఆ శాఖ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తోందన్న విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. ప్రతీ పదేళ్ళకూ ఏదో ఒక ప్రమాదం జరిగినప్పుడు చర్యలు తీసుకోవటం కాకుండా ముందస్తుగా ఆ శాఖాధికారులు ఎందుకు స్పందించరు? అన్న ప్రశ్న రవాణా అవినీతికి ఎంతలా అలవాతుపడిందో అర్థమయ్యేలా చేస్తోంది. ప్రత్యేకించి ఒక్క రెండురోజుల దాడిలో సుమారు 150కు పైగా బస్సులను జప్తు చేశారంటే ఇంకా ఎన్ని బస్సులు అక్రమంగా నడుస్తున్నాయన్న సందేహానికి ఆస్కారం ఏర్పడుతోంది.

 

 

దాడుల్లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 90కు పైగా ప్రైవేటు బస్సులు, కండీషన్ లేని 68 స్కూలు బస్సులు జప్తు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 39 ప్రైవేటు బస్సులను పట్టుకున్నారు. వాటిలో 19 పట్టణంలో యథేచ్చగా తిరుగుతుండగా చెక్ చేసి జప్తు చేశారు. కొన్ని బస్సులకు ఇంకా పర్మిట్లు కూడా లేవు. కాంట్రాక్టు క్యారియర్ పర్మిషను తీసుకుని స్టేజిక్యారియర్లుగా బస్సులు తిప్పతాన్ని కూడా అధికారులు గుర్తించారు. పశ్చిమగోదావరి జిల్లాలో కండీషన్ లో లేని 38 స్కూల్ బస్సులను సీజ్ చేశారు. మెదక్ జిల్లాలో 12, కరీంనగర్ జిల్లాలో 20, హైదరాబాద్ లో 10 బస్సులు జప్తు చేశారు. ఇంకా తూర్పుగోదావరిజిల్లాలో రవాణాశాఖ దాడులు ప్రారంభించలేదు. ఒక్క షిర్డీ బస్సు ప్రమాదం జరిగినంత మాత్రాన వచ్చే ఆదాయం వదులుకోవాల? అందుకే ఈ జిల్లాలో రోజుకు రెండు లక్షల రూపాయల అదనపు ఆదాయం వదులుకోలేక సిబ్బంది దాడులకు సిద్ధంగా లేరు. ఇక ప్రైవేటు స్కూలు బస్సుల కండీషన్ విషయానికి వస్తే తూర్పుగోదావరిజిల్లాలో శ్రీచైతన్య వంటి పెద్ద సంస్థల బస్సులు కదలాలా వద్దా అని మొరాయించే స్థితిలో ఉన్నాయి. వాస్తవ ప్రయాణం గంటలోపు ఉంటే రెండు గంటలు దాటాక కూడా గమ్యస్థానానికి చేరటం లేదు. ఇంతటి దారుణ స్థితిలో ఉన్న బస్సులను శ్రీచైతన్య నడుపుతోందని జగ్గంపేటలో శ్రీచైతన్య విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఆందోళన నిర్వహించారు. ఈ ఘటన కూడా ఆర్టీఎ కళ్ళు తెరిపించలేదు. ఆర్టీసీలోనే పాతబడిపోయిన వాహనాలను కొనుక్కుని దానికి రంగులేయించి మరీ తిప్పుతున్నారు. రాష్ట్రస్థాయిలో స్పందిస్తే కానీ, ఈ శాఖలో పూర్తిస్థాయి చైతన్యం రాదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu