ఆ కేసుల సత్వర విచారణ.. ఏపీ హైకోర్టు నిర్ణయం
posted on Dec 9, 2023 6:15AM
ఏపీలో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ హైకోర్టు పలువురు ఎంపీ, ఎమ్మెల్యేలకు షాక్ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో వారిపై నమోదైన కేసుల సత్వర విచారణకు నిర్ణయం తీసుకుంది. హైకోర్టు నిర్ణయంతో కళంకిత ప్రజాప్రతినిధులలో ఆందోళన మొదలైంది. వారిపై ఉన్న కేసులలో ఏ ఒ కేసులో దోషిగా తేలినా ఎన్నికలలో పోటీకి అనర్హులయ్యే అవకాశం ఉండంతో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలలో ఆందోళన వ్యక్తమౌతోంది.
ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులపై గతంలో నమోదైన కేసుల విచారణ నత్తనడక నడుస్తోందన్న ఫిర్యాదులపై తాజాగా స్పందించిన సుప్రీంకోర్టు.. వీటి వ్యవహారం వెంటనే తేల్చాలని దేశవ్యాప్తంగా అన్ని హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. తీవ్ర క్రిమినల్ కేసుల్లోనూ విచారణల్లో అసాధారణ జాప్యం చోటు చేసుకోవడంపై హైకోర్టులకు సుప్రీం అక్షింతలు వేసిన సంగతి విదితమే. హైకోర్టులో ఈ కేసుల విచారణకు ప్రత్యేక బెంచ్ లు ఏర్పాటు చేయాలని అప్పట్లో ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు స్పందించింది.
రాష్ట్రంలో ఎంపీ, ఎమ్మెల్యేలు సహా ప్రజాప్రతినిధులందరిపైనా నమోదైన కేసుల విచారణ వేగవంతం చేసే దిశగా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా కేసుల సత్వర విచారణపై ఆదేశాలు ఇచ్చేందుకు వీలుగా సుమోటోగా ప్రజాప్రయోజన వాజ్యం నమోదు చేసింది. దీనిపై హైకోర్టు విచారణ జరిపి విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు తగిన ఆదేశాలు ఇవ్వనుంది. ఈ పిల్ లో ప్రతివాదులుగా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుతో పాటు సీఎస్, డీజీపీ, హైకోర్టు పీపీని కూడా చేర్చింది.
రెండు నెలల్లో ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడబోతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు ప్రజాప్రతినిధులపై కేసుల్లో విచారణను వేగవంతం చేసి తీర్పులు ఇవ్వడం మొదలుపెడితే ఆ ప్రభావం కచ్చితంగా ఇప్పటికే కేసులున్న ఎంపీలు, ఎమ్మెల్యేలపై పడుతుంది. ఆ కేసులలో దోషిగా తేలిన ప్రజాప్రతినిథులు పోటీకి అనర్హఉలయ్యే అవకాశాలు ఉండటంతో హైకోర్టు నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా, కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులకు ముచ్చెమటలు పడుతున్నాయి.