కొండాతో ఈటల కొత్త పార్టీ? అంతా ఆయన డైరెక్షనేనా.. 

మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. తనను అవమానకరంగా తొలగించారనే కసితో ఉన్న ఈటల భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందన్న చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేస్తారని, కొత్త పార్టీతో కేసీఆర్ ను ఎదుర్కొంటారనే టాక్ నడుస్తోంది. కొత్త పార్టీ కాకుండా ఇప్పుడున్న పార్టీల్లోనే ఏదో ఒక దాంట్లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా  ఈటల రాజేందర్‌ ఎపిసోడ్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి మేడ్చల్‌లోని ఈటల నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. వీళ్లిద్దరు కలిసి పార్టీ పెట్టనున్నారని గత కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.

కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి మాత్రం ఈ భేటీకి రాజకీయపరమైన కారణాలేమీ లేవని తెలిపారు. ఈటల భార్య జమున తమకు బంధువని, కేవలం సానుభూతితో మాత్రమే ఆయనను కలవడానికి వచ్చానన్నారు. తాము చాలా కాలం నుంచి మిత్రులమని.. కొన్ని పాత విషయాలు గుర్తుచేసుకున్నామన్నారు.
ఈటల తప్పేమీ చేయలేదని, అవమానానికి గురికావాల్సిన అవసరం లేదని కొండా చెప్పారు. కేసీఆర్‌ ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని.. వాటిలో ఇదొకటని కొండా అభిప్రాయపడ్డారు. ఈటల ఏ నిర్ణయం తీసుకున్నా.. తెలంగాణ సమాజం ఆయన వెనుక ఉంటుందని విశ్వేశ్వర్‌ రెడ్డి చెప్పారు. ఈటలతో సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత లేదని కొండా చెబుతున్నా... కొత్త పార్టీ ఏర్పాటు గురించే చర్చ జరిగిందని తెలుస్తోంది. 

కేసీఆర్ సర్కార్ పై ఇప్పటికే పోరాడుతున్నారు రేవంత్ రెడ్డి. కొండా విశ్వేశర్ రెడ్డి కూడా ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. కొంత కాలంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ను ఇరుకున పెట్టేలా ఈటల రాజేందర్ మాట్లాడుతూ వస్తున్నారు. దీంతో కేసీఆర్ ను గద్దే దించడమే లక్ష్యంగా వీళ్లు ముగ్గురు కలిసి కొత్త పార్టీ పెడతారనే ప్రచారం జరుగుతోంది. రేవంత్‌రెడ్డి.. ప్ర‌స్తుతం పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌. ఫుల్‌టైమ్ పీసీసీచీఫ్ చేయాల‌ని ఆయ‌న ఎప్ప‌టినుంచో డిమాండ్ చేస్తున్నారు. అయితే సీనియ‌ర్లు రేవంత్‌రెడ్డికి అడుగ‌డుగునా మోకాలు అడ్డుతున్నారు. పీసీసీ పీఠం రేవంత్‌కు ద‌క్క‌కుండా చేస్తున్నారు. దీంతో, కాంగ్రెస్ తీరుతో విసిగి వేసారి పోయిన రేవంత్‌.. సొంత పార్టీకి స‌న్నాహాలు చేస్తున్నార‌ని అంటున్నారు. అందులో భాగంగనే రేవంత్‌కు న‌మ్మ‌క‌మైన అనుచ‌రుడు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వచ్చారని అంటారు. అంతేకాదు అవ‌స‌ర‌మైతే కొత్త పార్టీ ఆలోచ‌న చేస్తానంటూ ప్ర‌క‌టించారు కొండా. 

తాజాగా జరుగుతున్న పరిణామాలతో రేవంత్‌రెడ్డి, కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డితో పాటు ఈట‌ల రాజేంద‌ర్ సైతం కేసీఆర్ వ్య‌తిరేక‌ రాజ‌కీయ శ‌క్తుల ఏకీక‌ర‌ణ వైపు మొగ్గు చూపుతున్నారని సమాచారం. తాను ఒక్క‌డిని ఒంట‌రిగా కేసీఆర్‌పై పోరాడే బ‌దులు.. రేవంత్‌రెడ్డి లాంటి బ‌ల‌మైన నాయ‌కుడితో క‌లిసి క‌ట్టుగా దండెత్తితే బెట‌ర్ అని ఈటల అనుకుంటున్నార‌ట‌. గ‌తంలోనే రేవంత్‌రెడ్డి, ఈట‌ల ప‌ర‌స్ప‌రం ట‌చ్‌లోకి వ‌చ్చార‌ని చెబుతున్నారు. ఇప్పుుడు కొండాతో కలిసి భవిష్యత్ కార్యాచరణపై ఈటల చర్చిస్తున్నారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీళ్లద్దరి భేటీ రేవంత్ రెడ్డి డైరెక్షన్ లోనే జరిగిందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఉద్యమ సంఘాలు, ఇతర పార్టీల్లో తనకు మద్దతుగా ఉంటారని భావిస్తున్న వాళ్లతోనే రాజేందర్ చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. 

కేసీఆర్ మామూలోడు కాదు. ఆర్థికంగా, రాజ‌కీయంగా, వ్యూహాల ప‌రంగా.. ఉద్దండుడు. అలాంటి కేసీఆర్‌ను  గ‌ద్దె దింపాలంటే.. పెద్ద ఎత్తున ఆర్థిక‌, రాజ‌కీయ‌ అండా, దండా అవ‌స‌రం. అందుకే రేవంత్‌రెడ్డి, ఈట‌ల రాజేంద‌ర్‌, కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి.. ఈ ముగ్గురు క‌లిసి కొత్త పార్టీతో కేసీఆర్‌కు చెక్ పెట్టాల‌ని చూస్తున్నారని అంటున్నారు ఈ ముగ్గురూ ఆర్థికంగా బాగా సంప‌న్నులే. డైన‌మిక్ లీడ‌ర్‌గా రేవంత్‌రెడ్డికి తెలంగాణ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఊరూరా రేవంత‌న్న ఫ్యాన్స్ ఉన్నారు. కావ‌ల‌సినంత రాజ‌కీయ నేర్ప‌రిత‌నం, మాట‌కారి త‌నం రేవంత్ సొంతం. తెలంగాణ‌లో బ‌ల‌మైన సామాజిక వ‌ర్గ‌మైన రెడ్లంతా రేవంత్‌కు ఫుల్ స‌పోర్ట్‌గా ఉన్నారు. ఈట‌ల రాజేంద‌ర్ త‌క్కువేమీ కాదు. ఉద్య‌మ నాయ‌కుడిగా అన్ని జిల్లాల ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌య‌స్తుడు. సౌమ్యుడిగా మంచి పేరు. కేసీఆర్ చేతిలో అవ‌మానింప‌బ‌డ్డాడ‌నే సానుభూతి ఎలానూ ఉండ‌నే ఉంది. తెలంగాణ‌లో అధిక సంఖ్యాకులైన‌ బీసీ సామాజిక వ‌ర్గానికి ప్ర‌తినిధిగా ప్ర‌జ‌ల ముందుకు రాబోతున్నాడు. వీరికి తోడు ఆర్థికంగా సుసంప‌న్నుడు,  మాజీ ముఖ్య‌మంత్రి రంగారెడ్డి వార‌సుడైన కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డిలు క‌లిసి.. కొత్త పార్టీతో కేసీఆర్‌ను రాజ‌కీయంగా కుమ్మేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది. 

రేవంత్‌రెడ్డి, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలు కలసి ఏర్పాటు చేయబోయే కొత్త రాజకీయ పార్టీలోకి.. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి పెద్ద ఎత్తున అసంతృప్త నేతలు వ‌ల‌స రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ప‌లువురు టీఆర్ఎస్ నేత‌లు సైతం ఈట‌ల‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని.. స‌రైన స‌మ‌యంలో వారంతా రాజేంద‌ర్ వెంట నిలుస్తార‌ని అంటున్నారు. ఏకంగా ప‌దుల సంఖ్య‌లో ఎమ్మెల్యేలే ఈట‌ల స‌పోర్ట‌ర్స్‌గా ఉన్నార‌ని చెబుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో వారంతా ఈట‌ల నుంచి ఆర్థిక సాయం పొందిన వార‌ని.. వాళ్లంతా ఆ రుణం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నార‌ని తెలుస్తోంది.