దేశం లో కరోనా మోత.. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కోత.. 

అప్పుడెప్పుడో ప్లేగు వ్యాధి గురించి విన్నాం.. అది సృష్టించిన విలయతాండవం గురించి చదివాం.. ఇప్పుడు అదే తరహాలో ప్రపంచాన్ని మరణాలతో వణికిస్తున్న    కరోనా వైరస్ ని చూస్తున్నాం.. అనుభవిస్తున్నాం.. దానితో కాపురం కూడా చేస్తున్నాం.. దేశంలో , తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. బోయపాటి సినిమాలో విలన్ మాదిరి, అవును బయపెడుతాం.. మా రాజకీయం అంతే.. దమ్ముంటే మా ఎదురుగుండా వచ్చి ఢీకొట్టు.. అంటుంది కరోనా.. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో తగ్గేదేలే అంటూ విరుచుకుపడుతుంది. 

దేశంలో గడిచిన 24 గంటల్లో  4 లక్షలకుపైగా రోజువారీ కేసులు, 4 వేలకు చేరువగా మరణాలు నమోదవడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 4,14,188 కొత్త కేసులు నమోదయ్యాయి. 4 లక్షలకుపైగా కేసులు చోటుచేసుకోవడం దేశంలో ఇది మూడోసారి. ఇక మరణాలు వరుసగా పదో రోజు 3 వేలకుపైగా నమోదయ్యాయి. తాజాగా కొవిడ్‌తో పోరాడుతూ 3,915 మంది మరణించారు.  

తాజా కేసులతో దేశంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 2,14,91,598కి చేరింది.  గడిచిన 24 గంటల్లో 3,915 మంది కొవిడ్‌తో మృతి చెందగా.. ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 2,34,083కి పెరిగింది.  కేసులతో పోల్చితే రికవరీలు కూడా భారీగానే ఉండటం కాస్త ఊరటనిచ్చే విషయం. గడిచిన 24 గంటల్లో 3,31,507 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 1,76,12,351గా ఉంది.   ప్రస్తుతం దేశంలో 36,45,164 క్రియాశీల కేసులు ఉన్నాయి.  దేశంలో నిన్న  18,26,490 పరీక్షలు నిర్వహించారు.  ఇప్పటి వరకూ దేశంలో 16,49,73,058 టీకాలు పంపిణీ చేశారు.  

తెలంగాణలో.. 

నిన్న రాత్రి 8 గంటల వరకు 76,047 నమూనాలను పరీక్షించగా 5,892 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనాతో నిన్న 46 మంది మృతిచెందారు. కరోనా బారి నుంచి నిన్న 9,122 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 73,851కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 1104 కేసులు నమోదయ్యాయి.