అదిగో ఏనుగు.. ఇదిగో చావు
posted on May 1, 2025 12:43PM
.webp)
ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అటవీ ప్రాంతాల సమీపంలో నివసించే గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఆరుగాలం అప్పులు చేసి ఎంతో శ్రమించి పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో ఏనుగుల గుంపుల స్వైర విహారం తో పంటలు నష్టపోతున్నారు.. పంటలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా రైతులు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుని మృత్యువాత పడుతున్నారు. మూడు నెలల క్రితం చంద్రగిరి నియోజకవర్గం కందులవారి పల్లి ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి పంట పొలాలను రక్షించే ప్రయత్నంలో భాగంగా రాత్రి సమయంలో గ్రామస్తులతో కలిసి ఏనుగులు తరిమేందుకు ప్రయత్నించారు. ఈ తరుణంలో ఆయన ఏనుగులు పాదాలకింద పడి మృతి చెందారు.
వారం రోజుల క్రితం చిన్నగొట్టిగల్లు మండలం లో ఏనుగులను తరిమే క్రమంలో కౌలురైతు మృతి చెందారు. ఇలా ఒకటి రెండు మరణాలు కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా నిత్యం ఏనుగుల దాడులు... పంటల నష్టం... రైతుల మరణాలు జరుగుతూనే ఉన్నాయి.
ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా శేషాచలం, కౌండిన్య, కరిమంగళం, బన్నేరుగట్ట అటవీ ప్రాంతాలు విస్తరించి ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో 110 ఏనుగులు, తమిళనాడు రాష్ట్రంలో 300 ఏనుగులు, కర్ణాటకలో 400 వరకు ఏనుగులు ఉన్నాయి. ఏనుగులు వీలైనంత మేర గుంపులు గుంపులుగా సంచరిస్తుంటాయి. ఇటు చిత్తూరు జిల్లా అటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులు కావడంతో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంటుంది. వేసవి తో పాటు గత పాలకులు ఎర్రచందనం అక్రమ రవాణా కారణంగా భారీ శబ్దాలు చేస్తుండడంతో అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు బయటకు వచ్చేస్తున్నాయి. ఆహారం కోసం పంట పొలాల పై పడి ఏనుగులు స్వైర విహారం చేస్తుండటంతో రైతులు ఆస్తులు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
సంవత్సరాల తరబడి ఏనుగుల దాడులు జరుగుతూనే ఉన్నాయి. టెక్నాలజీ పెరిగినా ఏనుగులు వల్ల జరుగుతున్న నష్టాన్ని తీర్చే ప్రయత్నం చేయలేదు గత పాలకులు. దీని ప్రభావంతో వేల ఎకరాల పంట నష్టంతో పాటు రైతుల మరణాలు నివారణకు చర్యలు తీసుకోలేదు. వైసీపీ హయాంలో జిల్లాకు చెందిన కీలక నాయకుడు అటవీ శాఖ మంత్రి గా పని చేసినా రైతులకు నష్టపరిహారం సైతం పూర్తి స్థాయిలో అందలేదు.
ఏనుగుల దాడులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫారెస్ట్ అధికారులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఏనుగుల కదలికలు, వన్యప్రాణుల సంరక్షణ, సమాజ భద్రత, పంట నష్టం తగ్గించడం, ఈ టాస్క్ ఫోర్స్ పని. అటవీ సమీప గ్రామాల ప్రజలు ఏనుగుల కదికలు ఉన్న ప్రాంతాలకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా టాస్క్ ఫోర్స్ 9440810070, 9440810114, 9440810069, 9440810113, టోల్ ఫ్రీ 18004255909కి సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. తప్పుడు సమాచారం ఇవ్వకుండా అటవీ రక్ష ణకు ఉపయోగపడాలని కోరుతున్నారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది గ్రామాల్లోకి వెళ్లి గ్రామస్తులకు ఏనుగులు వచ్చిన సమయంలో ఎలా వ్యవహరించాలనే దానిపై పై అవగాహన కార్యక్రమాలు నిర్వహి స్తున్నారు.