ఏపీలో వార్ వన్ సైడే డౌటే లేదు!

ఏపీలో జనం డిసైడైపోయారు. సాధారణంగా ఏ ఎన్నికలలోనైనా సరే   చివరి నిముషం వరకూ ఎవరికి ఓటు వేయాలన్న నిర్ణయం తీసుకోకుండా వేచి చూసే తటస్థ ఓటర్లు ఉంటారు. సాధారణంగా ఎన్నికల ఫలితాలు ఆ తటస్థ ఓటర్లు మెగ్గు చూపిన పార్టీ లేదా కూటమికే సానుకూలంగా ఉంటాయి. అయితే ఆశ్చర్యకరంగా ఏపీలో ప్రస్తుతం తటస్థ ఓటర్లు అనే వారే లేకుండా పోయారు. జగన్ అరాచక, అస్తవ్యస్థ పాలన కారణంగా తటస్థ ఓటర్లు ఇప్పటికే తాము ఎటువైపు ఉండాలన్న నిర్ణయం తీసేసుకున్నారు.  దీంతో రాష్ట్రంలో పరిస్థితి ఎలక్షన్ వార్ వన్ సైడైపోయిందన్న పరిస్థితి కనిపిస్తోంది. 

ఆంధ్రప్రదేశ్ లో  ఎన్నికల సమరంలో అధికార వైసీపీ చేతులెత్తేసిందా అనిపించేలా రాష్ట్రంలో పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నికల హీట్ పీక్స్ చేరిన ఈ సమయంలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి బస్సు యాత్రకు జనస్పందన అంతంత మాత్రంగా ఉండటం, అదే సమయంలో విపక్ష నేత ప్రజాగళం సభలకు జనం పోటెత్తుతుండటం చూస్తుంటే జనం మూడ్ ఏమిటన్నది అర్థమైపోతోంది. అదే సమయంలో పలు మీడియా, సర్వే సంస్థలు వెలువరించిన సర్వేలు కూడా ఏపీలో తెలుగుదేశం కూటమి సునామీ ఖాయమని చెబుతున్నాయి. ఒకటి రెండు అని కాదు.. ఇప్పటి వరకూ వెలువడిన దాదాపు అన్ని సర్వేలూ కూడా తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధిస్తుందనే అంచనా వేశాయి. ఒక సర్వేను మించి మరో సర్వే కూటమి గెలిచే స్థానాల సంఖ్య పెచ్చుగా ఉంటుందని చెబుతున్నాయి. ఇప్పటి వరకూ ఏపీ ఎన్నికలకు సంబంధించి దాదాపు పది సర్వేలు వెలువడ్డాయి. అన్ని సర్వేలూ కూడా కూటమి విజయాన్ని ఖరారు చేస్తున్న విధంగానే  ఫలితాలు వెలువరించాయి. 

ఇండియా టుడే సర్వే తెలుగుదేశం కూటమి 17 లోక్ సభ స్థానాలలో  విజయకేతనం ఎగురవేస్తుందనీ, వైసీపీ ఎనిమిది స్థానాలకే పరిమితమౌతుందనీ పేర్కొంది. ఇంొడియా టుడే గతంలో రాష్ట్రంలో వైసీపీ ప్రభంజనం మరోసారి తధ్యమని పేర్కొన్న సంగతి విదితమే. అయితే రాష్ట్రంలో పరిస్థితులపై వాస్తవాన్ని గ్రహించి ప్లేటు ఫిరాయించింది. ఇక సీఎన్ఎన్ న్యూస్ నిర్వహించిన సర్వే తెలుగుదేశం కూటమి  18 లోక్ సభ స్థానాలలో విజయం సాధిస్తుందనీ, అధికార వైసీపీ కేవలం ఏడు స్థానాలకే పరిమితమౌతుందని అంచనా4 వేసింది. ఇక ఇండియా టీవీ నిర్వహించిన సర్వే కూడా ఇండియా టుడే ఫలితాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఇండియా టీవీ సర్వే ప్రకారం తెలుగుదేశం కూటమి 17 లోక్ సభ స్థానాలలోనూ, అధికార వైసీసీ 8 స్థానాలలోనూ గెలిచే అవకాలున్నాయని పేర్కొంది.  న్యూస్ ఎక్స్ సర్వే అయితే తెలుగుదేశం కూటమికి 18, వైసీపీకి 7 లోక్ సభ స్థానాలలో విజయం సిద్ధిస్తుందని అంచనా వేసింది. 

ఏబీపీ న్యూస్ అయితే వైసీపీ కేవలం ఐదు లోక్ సభ స్థానాలకే పరిమితమౌతుందనీ, తెలుగుదేశం కూటమి ఇరవై స్థానాలలో విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ అంచనా వేసింది. జనమత్ పోల్స్ నిర్వహించిన సర్వే తెలుగుదేశం కూటమికి 17, వైసీపీకి 8 లోక్ సభ స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది. 

స్కూల్ ఆఫ్ పోలటిక్స్ సర్వేలో తెలుగుదేశం కూటమికి అత్యధికంగా 23 లోక్ సభ స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని తేల్చింది. అధికార వైసీపీ కేవలం రెండు స్థానాలకే పరిమితమౌతుందని పేర్కొంది. పీపుల్స్ రైట్  సంస్థ సర్వే ఫలితం కూడా  సరిగ్గే ఇలానే  ఉంది. అధికార వైసీపీ రెండు స్థానాలకే పరిమితమౌతుందని, తెలుగుదేశం కూటమి 23 లోక్ సభ స్థానాలలో జయకేతనం ఎగురవేయడం ఖాయమని పీపుల్స్ రైట్ సర్వే పేర్కొంది. 

ఇక పయనీర్ పోల్ అయితే తెలుగుదేశం 18 లోక్ సభ స్థానాలను కైవశం  చేసుకుంటుందనీ, వైసీపీ ఏడు స్థానాలకే పరిమితమౌతుందని తేల్చింది. ఇండియా న్యూస్ సర్వే కూడా ఇదే ఫలితం వెలువరించింది. ఇక జీ న్యూస్ అయితే తెలుగుదేశం కూటమికి 17, వైసీపీకి 8 లోక్ సభ స్థానాలు దక్కుతాయని పేర్కొంది. 
ఇలా ఏపీ ఎన్నికల విషయంలో అధికార వైసీపీకి ఎటువంటి అవకాశం లేదని దాదాపు అన్ని సర్వేలూ తేల్చాయి.  ఈ సర్వేలన్నీ రాష్ట్రంలో ప్రజల మూడ్ ఎలా ఉందన్నది పట్టి చూపాయి. అయితే ఐదేళ్ల కిందట అద్భుత మెజారిటీతో ఘన విజయం సాధించిన వైసీనీ కేవలం ఐదేళ్లలో ఇంతటి స్థాయిలో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోవడానికి  ఈ ఐదేళ్లలో జగన్ సర్కార్ సాగించిన ప్రజా వ్యతిరేక పాలనే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీలో   ఏపీలో వచ్చే నెల 13న పోలింగ్ జరగనుంది.  గురువారం (ఏప్రిల్ 18) నోటిఫికేష్ వెలువడనుంది.  

గత ఐదేళ్లలో రాష్ట్రంలో ప్రజా పాలన కాకుండా పోలీసు పాలన సాగిందన్న అభిప్రాయం ప్రజలలో బలంగా వ్యక్తం అవుతోంది.   జగన్ సర్కార్ అభివృద్ధిని విస్మరించి కేవలం బటన్ నొక్కుడు ద్వారా సొమ్ముల పందేరమే పాలన అన్నట్లుగా వ్యవహరించింది. దానికి తోడు అభివృద్ధి గురించి ప్రశ్నించినా, హక్కుల కోసం గళమెత్తినా వారిపై ఉక్కుపాదం మోపింది. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోవడంతో  ప్రజలపై విపరీతంగా పన్నుల భారం మోపింది. లబ్ధి అంటూ పావలా పందేరం చేసి... రూపాయిని పన్నుల రూపంలో లాగేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పథకాల లబ్ధి దారులపై కూడా జగన్ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది.  అన్ని వ్యవస్థలనూ నిర్వీర్యం చేయడం, ప్రజల హక్కులను కాలరాయడం వంటి చర్యల కారణంగా సమాజంలోని ఏ వర్గమూ జగన్ పాలన పట్ల సానుకూలంగా లేని పరిస్థితి నెలకొంది. దానినే సర్వేలన్నీ ఎత్తి చూపాయి.  

ఐదేళ్ల పాల‌న‌లో సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క‌క్ష‌పూరిత‌ పాల‌న సాగించారని, రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాలు కూడా కనిపించడం లేదనీ, జగన్ పాలనలో సమాజంలోకి ఏ ఒక్క వర్గమూ కూడా సంతోషంగా లేదనీ ఈ సర్వే ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయి. జగన్ అస్తవ్యస్త, అరాచక పాలన పట్ల ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నార‌నీ, అన్ని వ‌ర్గాల వారూ ఏకతాటిపైకి వ‌స్తూ వైసీపీ ప్ర‌భుత్వానికి గ‌ట్టి గుణ‌పాఠం చెప్పేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని సర్వేల ఫలితాలు నిర్ద్వంద్వంగా సూచిస్తున్నాయి. అందుకు ప్రత్యక్ష నిదర్శనం  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన మేమంతా సిద్ధం బ‌స్సు యాత్ర‌కు ప్ర‌జాద‌ర‌ణ క‌రువైంది. వైసీపీ కార్య‌క‌ర్త‌లు సైతం బ‌స్సు యాత్ర‌లో పాల్గొనేందుకు ఆస‌క్తి చూప‌డం లేదు.  వీటన్నిటినీ బట్టి చూస్తే రానున్న రోజులలో అంటే పోలింగ్ సమయం దగ్గరపడేకొద్దీ వైసీపీ గ్రాఫ్ మరింత దిగజారడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.