ప్రభుత్వ సలహాదారులకూ ఎన్నికల కోడ్

జగన్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు ఇకపై మీడియా ముందుకు వచ్చి ఇష్టారీతిగా ప్రసంగాలు గుప్పించేయడానికి వీల్లేదు. అలా చేస్తే ఆయనపైనా ఎన్నికల సంఘం వేటు వేస్తుంది. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో విస్పష్టంగా పేర్కొంది. ఏపీలో ప్రభుత్వ సలహాదారులపై భారీ స్థాయిలో ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సలహాదారులకు కూడా కోడ్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. 

ప్రభుత్వ జీతభత్యాలు పొందుతున్న ప్రభుత్వ సలహాదారులు పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించేందుకు ఎంత మాత్రం కుదరదని కుండబద్దలు కొట్టింది. ఏపీలో  40 మంది ప్రభుత్వ సలహాదారులకూ కోడ్ వర్తిస్తుందని పేర్కొంటూ.. ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ సలహాదారులుగా వారికి నిర్దేశించిన విధులను వదిలేసి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఎన్నికల సంఘానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.   మంత్రులకు వర్తించినట్లే వీరికి కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందనీ, దానిని ఉల్లంఘిస్తూ కఠిన చర్యలు తప్పవనీ హెచ్చరించింది.