TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎల్ నినో ఎఫెక్ట్: సముద్రజీవుల మనుగడ ప్రశ్నార్థకం.. మత్స్యకారుల పరిస్థితి దయనీయం.!

Published on: Fri Nov 6, 2026 9:59AM

ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులు సముద్ర జీవవైవిధ్యంపై పెను ప్రభావం చూపుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇప్పుడు ప్రపంచ దేశాలను భయాందోళనలకు గురి చేస్తున్న సూపర్ డూపర్ ఎల్ నినో వాతావరణంపైనే కాకుండా సముద్ర జీవ వైవిధ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది.  

కాలిఫోర్నియా నుంచి పసిఫిక్ నార్త్‌వెస్ట్ తీర ప్రాంతాల వరకు సముద్ర ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయిలో పెరిగిపోతుండటంతో  మత్స్య సంపద అంతరించిపోతున్నది. ఈ పరిస్థితి మత్స్య కారులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. 

ఈ పరిణామాల వల్ల భవిష్యత్తులో  సముద్ర ఆహారానికి  (సీఫుడ్) కొరత ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.   కాలిఫోర్నియా నుంచి అలాస్కా వరకు ఉన్న తీర ప్రాంత జలాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా ఎగబాకడంతో సముద్ర జీవుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.

వాషింగ్టన్ లోని అనకోర్టెస్ పోర్టు కేంద్రంగా రెండు స్క్విడ్ (ఒక రకమైన చేపలు) ఫిషింగ్ పడవలను నడిపే మత్స్యకారులు సముద్ర వేట నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా ప్రతికూల వాతావరణం ఏర్పడే వరకు చేపల వేటలో ఉండే  మత్స్యకారులు ఈ  ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా స్క్విడ్ చేపలు లోతైన చల్లని నీటిలోకి వెళ్లిపోవడంతో పడవలను నిలిపివేశారు. ఈ నిలిపివేత వల్ల వారికి  ఒక్కొక్కరికీ నెలకు50 వేల డాలర్లకు పైగా నష్టం వాటిల్లుతోంది. 

ఇది కూడా చదవండి: సూపర్ ఎల్ నినో ఎఫెక్ట్: ఈ ఏడాది చలికాలం గాయబ్.!

   నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ సీనియర్ క్లైమాటాలజిస్ట్.. ఈ ఏడాది  సూపర్ డూపర్ ఎల్ నినో ప్రభావంతో పసిఫిక్ నార్త్‌వెస్ట్ తీర ప్రాంత ఉష్ణోగ్రతలు 1991-2020 మధ్య సగటు కంటే 7.2 డిగ్రీల ఫారెన్‌హీట్ అధికంగా పెరిగాయని వెల్లడించారు. ఇప్పటికే అలాస్కా గల్ఫ్‌లో ఉన్న సముద్ర ఉష్ణ తరంగానికి తోడు   ఎల్ నినో కూడా తోడవడంతో సముద్రంలోని ప్లాంక్టన్, కోపాపాడ్స్ వంటి సూక్ష్మ జీవులకు అవసరమైన పోషకాలు తగ్గిపోయాయని ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన ఫిషరీస్ ప్రొఫెసర్ ఒకరు తెలిపారు.   ఈ ఉష్ణోగ్రతల పెరుగుదల కేవలం స్క్విడ్ చేపలకే పరిమితం కాలేదు. పసిఫిక్ మహాసముద్రంలోని తీరప్రాంత నదుల్లోకి వలస వెళ్లే సాల్మన్ చేపలు కూడా తగిన ఆహారం లభించక వాటి మనుగడే ప్రశ్నార్థకంగా మారింది.

కొలంబియా నది నుంచి వచ్చే సాల్మన్ చేపలకు తగినంత కొవ్వు పదార్థాలు, పోషకాలు లభించకపోవడం వల్ల రాబోయే రెండేళ్లలో వాటి పునరుత్పత్తి  అనూహ్యంగా పడిపోయే ప్రమాదం ఉందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. మరోవైపు, ఒరెగాన్ రాష్ట్రంలో   100 మిలియన్ డాలర్ల విలువైన డన్‌నెస్‌ క్రాబ్ (పీతల) వేట కూడా ఈ వాతావరణ మార్పుల కారణంగా ప్రశ్నార్థకంగా మారింది.  ఎల్ నినో ప్రభావం పూర్తిగా తగ్గిపోయి, సముద్ర జలాలు సాధారణ స్థితికి వచ్చే వరకు సముద్రంలో చేపల వేట దాదాపుగా నిలిచిపోక తప్పని పరిస్థితి ఏర్పడింది.   వచ్చే ఏడాది ప్రారంభంలో వాతావరణం అనుకూలిస్తే తప్ప మళ్లీ వేటను ప్రారంభించలేమని మత్స్యకారులు అంటున్నారు.  

మీకు నచ్చవచ్చు: ఎల్ నినో ఎఫెక్ట్: ఐరోపాలో మృత్యు ఘోష.!

ఎల్ నినో ఎఫెక్ట్: ఆసియాలో ఆహార సంక్షోభం.. ఇండియాలో కరవు.!

 

[El Nino Effect, sea Fishing Stalled, Marine Life, Ocean Temperature, Climate Report, Seafood Shortage]