TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎల్ నినో ఎఫెక్ట్: ఆసియాలో ఆహార సంక్షోభం.. ఇండియాలో కరవు.!

Published on: Fri Oct 16, 2026 4:45PM

సూపర్ డూపర్ ఎల్ నినో!
150 ఏళ్ల నాటి గాడ్జిల్లా ఎల్ నినో కంటే తీవ్రం.!
ఫసిఫిక్ ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణంగా అధికం.!
వర్షాలకు అవకాశం లేకుండా చేస్తున్న యాంటీ సైక్లోన్ పరిస్థితులు.!

ప్రపంచ వాతావరణ వ్యవస్థ ఆందోళనకరంగా వేగంగా రూపాంతరం చెందుతోంది. పచ్చటి భూగోళంపై ఉష్ణతాపం పెరుగుతూ, శీతాకాలంలోనూ భానుడి భగభగలు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. సాధారణ ఎల్‌ నినోగా మొదలైన ఈ ప్రకృతి వైపరీత్యం క్రమంగా సూపర్‌ ఎల్‌ నినో, ఆపై గాడ్జిల్లా ఎల్‌ నినోగా బలపడి, చివరకు చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన  సూపర్‌ డూపర్‌ ఎల్‌ నినో’గా రూపాంతరం చెందింది.    

150 ఏండ్ల క్రితం మానవాళిని తీవ్రంగా కుదిపేసిన ఎల్‌ నినో పరిస్థితులను కూడా ఇది అధిగమిస్తుండటం గమనార్హం.   అంతర్జాతీయ వాతావరణ సంస్థలతో పాటు ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తల   అంచనాల ప్రకారం, వచ్చే మూడు నెలల్లో ఈ ముప్పు మరింత తీవ్రరూపం దాల్చనుంది. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3.7 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువ స్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయి.  ఈ  వాతావరణ మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో జలప్రళయం వంటి అతివృష్టి పరిస్థితులు..   భారత్ వంటి ఆసియా దేశాల్లో తీవ్ర అనావృష్టి పరిస్థితులు తలెత్తే ముప్పు ఉంది. 1876-78 నాటి   కరువు   పరిస్థితుల కంటే ఇది మరింత తీవ్ర  విపరిణామాలకు దారితీసే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. 

భూమధ్యరేఖ వెంబడి దక్షిణ అమెరికా పశ్చిమ తీరాన ఉన్న పెరూ, ఈక్వెడార్ సమీపంలోని పసిఫిక్ మహాసముద్ర జలాలు అసాధారణ రీతిలో వేడెక్కినప్పుడు గాలులు పశ్చిమ దిశకు బదులు తూర్పు వైపు పయనిస్తాయి. ఈ సముద్ర పవనాల మార్పు వల్ల ఆసియా ఖండంలో వర్షపాతం గణనీయంగా తగ్గుతుంది. సాధారణంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత 0.5 డిగ్రీల సెల్సియస్ పెరిగితే దాన్ని సాధారణ ఎల్‌ నినోగా పరిగణిస్తారు. అయితే సముద్ర జలాల వేడి ఏకంగా 3.5 డిగ్రీల సెల్సియస్ మార్కును దాటితే దాన్ని  సూపర్‌ డూపర్‌ ఎల్‌ నినో’గా నిర్వచిస్తారు.

కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ అందించిన సముద్ర ఉపరితల పరిశీలన వివరాల ప్రకారం, పసిఫిక్ జలాలు మరోమారు గరిష్ఠ స్థాయి ఉష్ణోగ్రతలకు చేరుకున్నాయి. అంచనాలు నిజమైతే అక్టోబర్ మూడో వారంలోనే సూపర్‌ డూపర్‌ ఎల్‌ నినో తొలి దశ ప్రారంభమై, డిసెంబర్ నాటికి ఇది పరాకాష్ఠకు చేరుకునే అవకాశం ఉంది.   ఈ  వాతావరణ వైపరీత్యం వచ్చే ఏడాది  ఫిబ్రవరి వరకు కొనసాగే ప్రమాదం ఉంది.   భారత్‌లో నైరుతి రుతుపవనాలపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడం వ్యవసాయ రంగానికి పెద్ద దెబ్బగా మారింది. సాధారణంగా ఖరీఫ్ లేదా వానకాలం సీజన్‌లోనే దేశంలో సుమారు 65 నుంచి 70 శాతం వరకూ ధాన్యం దిగుబడి లభిస్తుంది. 

కానీ ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల వల్ల పంట దిగుబడులు భారీగా పడిపోతాయని, తద్వారా దేశంలో తీవ్ర ఆహార సంక్షోభం, నిత్యావసరాల ధరల పెరుగుదల సంభవించే ప్రమాదం ఉందని ఆర్థిక, వ్యవసాయ రంగాల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   సూపర్‌ డూపర్‌ ఎల్‌ నినో పరిణామాల వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సమతుల్యత దెబ్బతింటోంది.

భారత్ సహా పలు ఆసియా దేశాల్లో తీవ్ర వర్షాభావంతో కరువు ఛాయలు అలుముకోనుండగా, కొన్ని తీరప్రాంత దేశాలను భారీ వర్షాలు, హఠాత్తుగా వచ్చే వరదలు ముంచెత్తనున్నాయి. దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయి ఎండలు తీవ్రత కొత్త రికార్డులను నమోదు చేసే అవకాశముంది.   సముద్రాలలో తుపాన్ల రూపం కూడా ఈ ఎల్‌ నినో వల్ల మారిపోతుంది. పసిఫిక్, హవాయి, పశ్చిమాసియా దేశాల సముద్ర ప్రాంతాలలో తీవ్రమైన తుపాన్లు విజృంభించే ముప్పు ఉండగా, అట్లాంటిక్ మహాసముద్రంలో మాత్రం ప్రతితుపాను అంటే యాంటీ సైక్లోన్ వాతావరణం ఏర్పడుతుంది. దీని వల్ల వర్షాలు కురవవు. 

అందుకే రాబోయే కాలంలో పర్యావరణ మార్పులను తట్టుకోవడానికి ప్రభుత్వాలు ఇప్పటినుంచే ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.  ముఖ్యంగా తాగునీటి ఎద్దడి రాకుండా చూసుకోవడం, వ్యవసాయ రంగంలో నీటి యాజమాన్య పద్ధతులను వేగవంతంగా అమలు చేయడం ద్వారా మాత్రమే రాబోయే కరువు పరిస్థితుల ప్రభావాన్ని తగ్గించగలరని నిపుణులు సూచిస్తున్నారు.   

[Super Duper El Nino Efect India, El Nino Impact India, Draught, Global Warming,  Ocean Temperatures Rise, Monsoon Failure, Food Crisis, Telugu One]