ముచ్చటగా 3 టిమ్స్‌లు.. వట్టి ముచ్చట్లేనా? కట్టేదుందా?
posted on Apr 26, 2022 3:07PM
హైదరాబాద్ నలుమూలలా నాలుగు టిమ్స్‌లు. అందులో మూడిటికి ఒకేరోజు శంకుస్థాపన చేశారు సీఎం కేసీఆర్. ఈ విషయాన్ని ఘనంగా ప్రచారం చేసుకుంటున్నారు. భూమి పూజ వరకైతే ఓకే.. మరి, ఆ ఆసుపత్రులు ఇప్పట్లో కడతారా? అనే డౌటనుమానం. ఎందుకంటే, గతంలో ఉస్మానియా దవాఖానాలో పాత భవనాలు కూల్చేసి కొత్త బిల్డింగ్ కడతానంటూ ఇలానే గొప్పలకు పోయారు కేసీఆర్. ఇటీవల వరంగల్ ఎంజీఎం విషయంలోనూ ఇలానే అన్నారు. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకూ ఇటు ఉస్మానియా ఆసుపత్రి భవనాలు కట్టలేదు లేదు.. అటు వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌కు పునాది కూడా వేయలేదు. ఎక్కడి గొంగలి అక్కడే ఉన్నా.. కొత్తగా జీహెచ్ఎమ్‌సీకి నాలుగు దిక్కులా నాలుగు టిమ్స్ (తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) అంటూ సీఎం కేసీఆర్ ప్రజలను మరోసారి మభ్యపెడుతున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. కేసీఆర్ మాటలకు చేతలకు అసలు పొంతనే ఉండదని అంటున్నారు. అందుకే, ఒకేరోజు మూడు టిమ్స్‌లకు శంకుస్థాపన చేసినా.. ఆయన హయాంలో అవి ప్రారంభమవుతాయనే నమ్మకం మాత్రం ఎవరికీ లేదంటున్నారు విమర్శకులు. గతంలో ఆయనలా పిట్టలదొర మాటలు చెప్పి ఉండకపోతే.. ఈ టిమ్స్‌లు కడతారో కట్టరో అనే అనుమానం రాకపోయేది కావొచ్చు. అప్పుడెప్పుడో ఏళ్ల క్రితం సీఎం హోదాలో ఉస్మానియా హాస్పిటల్‌ను పరిశీలించి.. ఈ పాత భవనాలు కూలగొడతాం.. ఇక్కడ 10 అంతస్థుల బిల్డింగ్ కడతాం.. సూపర్ స్పెషాలిటీ వార్డులు పెడతాం.. అంటూ ఊదరగొట్టారు. ఆ తర్వాత కోర్టు కేసుల సాకుతో ఆవైపే చూడలేదాయన. సేమ్ టు సేమ్ వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ విషయంలోనూ అంతే. నగరం మధ్యలో ఉన్న జైలును సిటీ శివార్లకు తరలించి.. ఆగమేఘాల మీద కేంద్ర కారాగారాన్ని కూలగొట్టేసి.. హడావుడిగా కొత్త ఎంజీఎం దవాఖానాకు భూమిపూజ చేశారు. ఆయన కొబ్బరికాయ కొట్టి నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ పునాదిరాయి కూడా వేయలేదు. కొత్తది కడుతున్నామంటూ.. పాత ఎంజీఎంను పట్టించుకోకపోవడంతో అక్కడ ఐసీయూలో పేషెంట్లను ఎలుకలు కొరుక్కుతిన్న ఘటనలు కలకలం రేపాయి. అట్లుంటది కేసీఆర్‌తోని.
వినేవాళ్లు, చూసేవాళ్లు ఉండాలే కానీ సీఎం కేసీఆర్ ఇలాంటి ముచ్చట్లు, పనులు ఎన్నైనా చేస్తారంటారు. దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నుంచి.. దళిత బంధు, కరీంనగర్‌ను చికాగో చేయడం, ఉస్మానియా, ఎంజీఎం హాస్పిటల్స్ కడతాననడం వరకూ.. ఆయన చేసిన మాటల గారెడీలు ఎన్నో ఎన్నెన్నో అంటూ ఉదహరిస్తున్నారు. ఆయన కావాలనుకుంటే మాత్రం ఆ పని వెంటనే అయిపోతుంది. ఉస్మానియా ఆసుపత్రిని పక్కన పెట్టేసి.. అట్టహాసంగా ప్రగతిభవన్ మాత్రం కట్టేసుకున్నారు. కొత్త సచివాలయ భవనాన్ని జెట్ స్పీడ్‌తో కట్టేస్తున్నారు. కానీ, ఆ పక్కనే కట్టాల్సిన 100 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి మాత్రం ఇంకా పునాదులే తవ్వలేదు. ఇక, జైలును కూల్చేసినంత వేగంగా వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌ను మాత్రం కట్టట్లేదు. ఇప్పుడు కొత్తగా మూడు టిమ్స్‌లు అంటూ హడావుడి చేస్తున్నారు కానీ.. కట్టేదిలేదు పాడూలేదంటూ జనం విసుక్కుంటున్నారు. ఆయనపై అంతగా నమ్మకం పోయింది ప్రజలకు. అందుకు ఆయన వ్యవహారశైలే కారణమని చెబుతున్నారు.
కొత్తగా ఆసుపత్రి కట్టాలంటే వేల కోట్ల ఖర్చు. ఏళ్ల పాటు ఆలస్యం. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్వాల్, గడ్డిఅన్నారం, ఎర్రగడ్డలలో నిర్మించ తలపెట్టిన టిమ్స్‌ల కోసం సుమారు 2700 కోట్లు నిధులు ఖర్చు అవుతుందని అంచనా. నిజంగా కడితేగనుక, అది కట్టేలోపు బడ్జెట్ మరింత పెరిగిపోవడం పక్కా. అదే, ప్రస్తుతం నిత్యం వేలమందికి చికిత్స అందిస్తున్న ఉస్మానియా, గాంధీ, నిమ్స్, కోఠి, నీలోఫర్ తదితర ఆసుపత్రులకు పెద్ద ఎత్తున నిధులు అందజేస్తే.. ఆయా హాస్పిటల్స్‌లో అదనపు బెడ్స్, ఆధునిక వైద్య సదుపాయాలు కల్పిస్తే.. చాలా తక్కువ ఖర్చులోనే, చాలా తక్కువ సమయంలోనే.. వేగంగా మరింత మెరుగైన చికిత్స అందించే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అలా చేయక, సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయిన పెద్దాసుపత్రులను అభివృద్ధి చేయక.. కొత్తగా పెద్ద పెద్ద బహుళ అంతస్థులు కట్టి.. కొత్త ఆసుపత్రులు నిర్మిస్తామని చెబుతుండటం.. ఆ బిల్డింగుల పేరు జెప్పి.. ప్రజలను మభ్యపెట్టి.. ఓట్లు దండుకొనే కార్యక్రమమే తప్ప.. అది అయ్యేది కాదు పొయ్యేది కాదు.. అంటూ పెదవి విరుస్తున్నారు ఏళ్లుగా కేసీఆర్ మాటలు, చేష్టలు గమనిస్తున్న తెలంగాణ ప్రజలు.